CBI : కేసులో చట్టపరంగా సంక్లిష్టత లేదు
ABN , Publish Date - Feb 16 , 2025 | 05:17 AM
చట్టపరంగా సంక్షిష్టత లేని, అంతర్రాష్ట్ర పర్యవసానాలు ముడిపడని ఓ విద్యార్థిని మృతి కేసులో తమ విచారణ సాధ్యం కాదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది.

విద్యార్థిని మృతిపై సీబీఐ విచారణ సాధ్యంకాదు
2017 నాటి కేసుపై హైకోర్టులో సీబీఐ కౌంటర్
అమరావతి, ఫిబ్రవరి 15(ఆంధ్రజ్యోతి): చట్టపరంగా సంక్షిష్టత లేని, అంతర్రాష్ట్ర పర్యవసానాలు ముడిపడని ఓ విద్యార్థిని మృతి కేసులో తమ విచారణ సాధ్యం కాదని హైకోర్టుకు సీబీఐ తెలిపింది. కర్నూలు జిల్లా, దిన్నెదేవరపాడులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలలో 2017లో జరిగిన 10వ తరగతి విద్యార్థిని మృతిపై చెన్నై సీబీఐ ఎస్పీ రఘురామ్‌రాజన్ హైకోర్టులో తాజాగా కౌంటర్ దాఖలు చేశారు. ‘పరిమిత సంఖ్యలో ఉన్న మా సిబ్బంది ముఖ్యమైన కేసుల దర్యాప్తులో నిమగ్నమయ్యారు. వనరుల కొరత ఉంది. విద్యార్థిని మృతి కేసులో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి 2018 మే లోనే కర్నూలు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ తరువాత విద్యార్థిని తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. గత రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2020లో సీబీఐ నుంచి కామెంట్స్ కోరింది. ఇది చట్టపరంగా సంక్లిష్టత ఉన్న వ్యవహారంకాదని 2021లో సీబీఐ ప్రధాన కార్యాలయానికి జవాబుఇచ్చాం. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయండి’ అని సీబీఐ ఎస్పీ తన కౌంటర్‌లో కోరారు. తమ కుమార్తెను 2017 ఆగస్టు 19న అత్యాచారం చేసి హత్య చేశారని ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ తల్లిదండ్రులు 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే గత ప్రభుత్వం డీఎ్‌సపీఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ నోటిఫికేషన్ జారీ చేసిందని, కేసును సీబీఐ విచారణ చేపట్టేందుకు వీలుగా కేంద్రం నోటిఫికేషన్‌లో ఇవ్వలేదని ఎస్పీ వివరించారు.