AMC: నేడో రేపో ఏఎంసీ పోస్టుల భర్తీ
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:01 AM
మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టులను రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు ఎమ్మెల్యేలకు సమాచారం అందింది.

చిత్తూరు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): మార్కెట్ కమిటీ ఛైర్మన్ పోస్టుల భర్తీ కసరత్తు పూర్తయి చాలాకాలమైనా ప్రకటించడంలో ఆలస్యమవుతోంది. జిల్లాలో మొత్తం 10 పోస్టులుండగా, రెండు చోట్ల మాత్రమే ఇటీవల ప్రకటించారు. జిల్లాలోని అన్ని పోస్టులకు పేర్లను అప్పట్లోనే ఖరారు చేసినా మరో 8 పోస్టులను మాత్రం ప్రకటించలేదు. వీటిని రెండు మూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నట్లు ఎమ్మెల్యేలకు సమాచారం అందింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలున్న చోట్ల వారు సూచించిన నేతలను, లేని చోట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జులు సిఫార్సు చేసిన పేర్లనే అధిష్ఠానం ఖరారు చేసినట్లు సమాచారం. అయితే వారు సిఫార్సు చేసిన నేతల సేవలను టీడీపీ అధిష్ఠానం మరో ఛానెల్ ద్వారా చెక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ విజయానికి కృషి చేసినవారికే ఛైర్మెన్‌గిరి దక్కుతున్నట్లు చెబుతున్నారు. ఛైర్మన్ పోస్టులు టీడీపీకి దక్కనుండగా కొన్ని డైరెక్టర్ పోస్టుల్లో జనసేన, బీజేపీ నాయకులకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే ప్రకటించిన ఎస్‌ఆర్‌పురం, నగరి మార్కెట్ కమిటీ ఛైర్మన్ల పోస్టులను ఎమ్మెల్యేలు వీఎం థామస్, గాలి భానుప్రకాష్ సిఫార్సు చేసిన వారికే ఇచ్చారు. ఎస్‌ఆర్‌పురంలో థామ్‌సకు ముఖ్య అనుచరుడు గుండయ్య సతీమణి జయంతికి, నగరిలో టీడీపీ పుట్టుక నుంచీ పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేత సుబ్రమణ్యం రాజు సతీమణి రాజమ్మ పేర్లను ఖరారు చేశారు.ఫ జీడీనెల్లూరు నియోజకవర్గంలో ఖాళీగా వున్న పెనుమూరు ఏఎంసీ ఛైర్మన్ పోస్టుకు జీడీనెల్లూరు మండలం పాతపాళ్యం పంచాయతీ మిట్టకొత్తూరుకు చెందిన వ్యాపారవేత్త వై.కృష్ణమ నాయుడి పేరును ఎమ్మెల్యే సిఫార్సు చేసినట్లు తెలుస్తోందిఫ చిత్తూరు మార్కెట్ కమిటీకి గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన మాపాక్షికి చెందిన బీసీ నేత వెంకటేష్ యాదవ్ పేరును తొలుత ఖరారు చేశారు. రిజర్వేషన్ల అడ్జ్‌స్టమెంట్లలో భాగంగా ఆయన సతీమణికి ఇవ్వనున్నట్లు తెలుస్తోందిఫపూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని బంగారుపాళ్యం మార్కెట్ కమిటీకి తవణంపల్లె మండలానికి చెందిన భాస్కర నాయుడి పేరును నియోజకవర్గంలోని నాయకుల సమ్మతితో ఎమ్మెల్యే మురళీమోహన్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఒకటే కమిటీ ఉండగా.. స్థానిక కీలక నాయకులు మూడు పేర్లను సూచించారు. ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేసి ప్రకటించనున్నారు.ఫ పలమనేరులో ఒకటే మార్కెట్ కమిటీ ఉండగా.. అక్కడ ఎస్సీ రిజర్వేషన్ ఉండగా, మరోసారి బీసీ మహిళ రిజర్వేషన్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పలమనేరు ఛైర్మెన్ పేరును ఖరారు చేయనట్లు తెలుస్తోంది.ఫ పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, రొంపిచెర్ల, సోమలలో మార్కెట్ కమిటీలున్నాయి. ఇక్కడ నియోజకవర్గ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆయా పేర్లను ఖరారు చేసి అధిష్ఠానానికి పంపారు.