మహిళల ఆర్థిక స్వావలంబనే భువనేశ్వరి అజెండా
ABN , Publish Date - Mar 30 , 2025 | 02:23 AM
‘సంకల్పించాలే కానీ మహిళలు చేయలేని అద్భుతాలు లేవు. ఆమెలోని శక్తి అపారం.’ ‘ఆర్థిక స్వావలంబన కావాలి. అందుకోసం ధైర్యంగా మీరు ముందడుగు వేయాలి. మీలో ప్రతివొక్కరూ ఉపాధి పొందడమే కాదు, పదిమందికి ఉపాధి చూపించే ఎత్తులకు ఎదగాలి.’ నారా భువనేశ్వరి కుప్పం మహిళలకు ఇచ్చిన పిలుపు ఇది.

కుప్పం - ఆంధ్రజ్యోతి
‘సంకల్పించాలే కానీ మహిళలు చేయలేని అద్భుతాలు లేవు. ఆమెలోని శక్తి అపారం.’ ‘ఆర్థిక స్వావలంబన కావాలి. అందుకోసం ధైర్యంగా మీరు ముందడుగు వేయాలి. మీలో ప్రతివొక్కరూ ఉపాధి పొందడమే కాదు, పదిమందికి ఉపాధి చూపించే ఎత్తులకు ఎదగాలి.’ నారా భువనేశ్వరి కుప్పం మహిళలకు ఇచ్చిన పిలుపు ఇది. అవును, ఆమె కుప్పం నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రి సతీమణిగానో లేదా విజయం సాధించి అందలం ఎక్కిన అధికార పార్టీ అధినేత భార్యగానో రాలేదు. కేవలం ఒక మహిళగా వచ్చారు. మామూలు మహిళగా కాదు, స్వయం శక్తితో విజయవంతమైన మహిళగా వచ్చారు. ఇంకా చెప్పాలంటే భర్త జైలుపాలైనప్పుడు ఎన్నడూ అలవాటులేని ప్రజా క్షేత్రంలోకి దూకి ‘నిజం గెలవాలం’టూ ప్రస్థానం సాగించి. తననుతాను రాజకీయంగా రాటుదేల్చుకున్న ఉక్కు మహిళగా ఈ పర్యటన చేపట్టారు. స్వయం ప్రకాశిత వెలుగులను సాటి మహిళలకు పంచడానికి, వారిలోని మహిళా శక్తిని మేల్కొలిపి విజేతలుగా నిలపడానికి ఈ పర్యటనను ఆమె వినియోగించుకున్నారు.నారా భువనేశ్వరి గత నాలుగు రోజులపాటు చేసిన కుప్పం నియోజకవర్గ పర్యటన విజయవంతమైంది. గుడుపల్లెలో అగస్త్య ఇంటర్నేనల్ ఫౌండేషన్‌లో విద్యార్థులతో ముఖాముఖితో మొదలైన ఆమె పర్యటన, కుప్పం పట్టణంలో ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా చిరు వ్యాపారులకు, మహిళలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లను ఉచితంగా అందజేసిన కార్యక్రమంతో ముగిసింది. ప్రధానంగా ప్రతి మండలంలోనూ కనీసం రెండుమూడు పంచాయతీల్లో భువనేశ్వరి గ్రామీణ మహిళలతో మమేకమయ్యారు. వారి ఈతిబాధలు వినడమే కాదు, స్వయంగా తన అనుభవాలను పంచుకున్నారు.మహిళల సంక్షేమం, ఆర్థిక స్వావలంబనకోసం ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను గురించి వివరిస్తూనే, ఈ పథకాలకు అతీతంగా తమనుతాము ఉద్ధరించుకోవాలని మహిళలకు పిలుపునిచ్చారు.అలీ్‌పతో కడా అనుసంధానమై ఇస్తున్న శిక్షణను మహిళలందరూ వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘నేను కూడా ఒకప్పుడు సాధారణ గృహిణినే, చంద్రబాబుగారు నాకు అప్పగించిన హెరిటేజ్ బాధ్యతను నాకు నేనుగా నేర్చుకుని మరీ నెరవేర్చా. విజయవంతంగా సంస్థను నడుపుతున్నా’ అంటూ తన స్వానుభవంతో మహిళల్లో ఉత్తేజం నింపారు.పనిలో పనిగా వైసీపీ అయిదేళ్ల పాలనలో మనం మోసపోయామంటూ ప్రతిపక్షంపై విమర్శలూ గుప్పించారు. మరోవైపు శాంతిపురం మండలం నక్కనపల్లెలో పట్టు రైతులతో మమేకమై వారికి సాదకబాధకాలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చెప్పి, సబ్సిడీలు, ప్రోత్సాహకాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని మాట ఇచ్చారు.
కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి
ఎక్కువగా మహిళల్లో స్ఫూర్తి నింపడానికే పర్యటన సమయాన్ని కేటాయించిన భువనేశ్వరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సతీమణిగా పార్టీ కార్యకర్తలను మరచిపోలేదు. చివరి రోజైన శనివారంనాడు పార్టీ ఆవిర్బావ దినోత్సవంలో పాల్గొన్న ఆమె, కార్యకర్తల త్యాగాలతోనే పార్టీ ఈరోజు ఈ స్థితికి చేరిందన్నారు. వారికి పార్టీ, తమ కుటుంబం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నాయకులతోనూ సమావేశాలు జరిపి పార్టీ స్థితిగతులపైనా ఆరా తీశారు. మరోవైపు మేనేజింగ్ ట్రస్టీగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్వారా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు పంపిణీ చేసి, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబుతామన్న హామీని నిలబెట్టుకున్నారు.అధిక దర్పానికి, ఆడంబరాలకు దూరంగా, సామాన్య మహిళలకు దగ్గరగా.. ఆత్మీయంగా సాగిన భువనేశ్వరి కుప్పం పర్యటన నియోజకవర్గ ప్రజల మనసు చూరగొంది.