Share News

రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:53 AM

చిత్తూరు జిల్లావ్యాప్తంగా వున్న సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌) కార్యాలయాల ద్వారా వార్షిక ఆదాయం లక్ష్యం దాటలేదు.

రిజిస్ట్రేషన్ల ఆదాయం తగ్గుముఖం
కుప్పం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లావ్యాప్తంగా వున్న సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌) కార్యాలయాల ద్వారా వార్షిక ఆదాయం లక్ష్యం దాటలేదు. 2024-25లో రూ.221.88 కోట్ల ఆదాయ లక్ష్యం బదులు మార్చి 31 నాటికి పూర్తయిన ఆర్థిక సంవత్సరాంతంలో రూ.149.88 కోట్లు మాత్రమే ఆదాయం సాధించింది. నిజానికి ప్రభుత్వ ఆదాయ రాబడి సంస్థల్లో స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ఒకటి. కానీ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యంలో చిత్తూరుజిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ వెనుకబడింది. 2023-24 సంవత్సరంతో పోలిస్తే 2024-25లో లక్ష్యసాధనలో మెరుగుపడింది. రిజిస్ట్రేషన్లశాఖ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 2023-24లో 50.90 శాతానికి లక్ష్యం పరిమితం కాగా, 2024-25లో 68శాతానికి పెరిగింది. జిల్లాలో ఎనిమిది సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నా... ఏ కార్యాలయం కూడా నిర్దేశించిన ఆదాయలక్ష్యాన్ని చేరుకోలేదు. అత్యధికంగా పలమనేరు ఎస్‌ఆర్‌ 78 శాతంతో ముందుండగా, కార్వేటినగరం ఎస్‌ఆర్‌ 75.71 శాతం, కుప్పం ఎస్‌ఆర్‌ 69.93 శాతంతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. చిట్టచివరి స్థానంలో బంగారుపాళ్యం ఎస్‌ఆర్‌ 55.88శాతం మాత్రమే వృద్ధి సాధించింది. ఇదిలావుండగా 2023-24లో 86,622 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్‌ కాగా, 2024-25లో 60,656 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు జరిగి సుమారు 26వేల రిజిస్ట్రేషన్లు తగ్గాయి.

Updated Date - Apr 02 , 2025 | 12:53 AM