తనిఖీల్లేకుండా ‘కొండ’కు అనుమతించకండి
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:07 AM
తిరుమల భద్రతపై ఎస్పీ హర్షవర్ధనరాజు ఫోకస్ పెంచారు. ‘అలిపిరి’ వద్ద తనిఖీల్లేకుండా తిరుమలకు అనుమతించొద్దని.. టోల్‌గేటు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

‘అలిపిరి’లో అప్రమత్తంగా ఉండాలి
తిరుమల భద్రతపై పోలీసు, విజిలెన్సు అధికారులతో ఎస్పీ సమీక్ష
తిరుపతి(నేరవిభాగం), మార్చి 31(ఆంధ్రజ్యోతి): తిరుమల భద్రతపై ఎస్పీ హర్షవర్ధనరాజు ఫోకస్ పెంచారు. ‘అలిపిరి’ వద్ద తనిఖీల్లేకుండా తిరుమలకు అనుమతించొద్దని.. టోల్‌గేటు వద్ద అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం ఉదయం ఓ యువకుడు అలిపిరి చెక్‌పాయింట్‌లోని వీఐపీ లైనుగుండా బైకులో దూసుకెళ్లగా.. జీఎన్సీ టోల్‌గేటు వద్ద అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల అదనపు ఎస్పీ రామకృష్ణ, డీఎస్పీ విజయశేఖర్, టీటీడీ వీజీవో రాంకుమార్, అలిపిరి ఏవీఎ్‌సవో రాజశేఖర్, సిబ్బందితో ఎస్పీ దాదాపు రెండు గంటల పాటు సమీక్షించారు. ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న భక్తుడిని ఎందుకు గుర్తించలేక పోయారని ఎస్పీ ప్రశ్నించినట్లు తెలిసింది. వీఐపీ దారిలో ఎంతమంది డ్యూటీలో ఉన్నారని తెలుసుకున్నారు. ఆపినా.. ఆపకుండా సిబ్బందిపైకి దూసుకొంటూ రావడంతో తప్పించుకుని వెళ్లడానికి కారణమైందని ఎస్పీకి అధికారులు వివరించినట్లు సమాచారం. దీనిపై ఎస్పీ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అలిపిరి టోల్‌గేటు వద్ద మరింత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. వాహనాలు, లగేజీని క్రమపద్ధతిలో తనిఖీచేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. పటిష్ఠ తనిఖీలతో నిషేధిత వస్తువులు.. పదార్థాలకు అలిపిరి వద్దే అడ్డుకట్ట వేయాలన్నారు. తిరుమల వీజీవో సెక్యూరిటీ అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలన్నారు. సీసీ కెమెరాల పనితీరుపైనా సమీక్షించారు.
చిన్న పిల్లలు, వృద్ధులు మిస్సింగ్‌పై ఆరా
తిరుమలలో తరచూ వృద్ధులు, చిన్నపిల్లలు తప్పిపోవడం, కిడ్నా్‌పకు గురవడంపై సీవీఎస్వో కూడా అయిన ఎస్పీ హర్షవర్ధనరాజు ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై తక్షణం విజిలెన్సు సహకారం తీసుకుని తిరుమల పోలీసులు డాక్యుమెంటరీ తయారు చేయాలని ఆదేశించారు. దీనికోసం ఆలయ ప్రధాన ద్వారం వద్ద సమాచార కేంద్రం ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధ్యయనంచేసి నివేదిక ఇవ్వాలన్నారు. ఆలయం లోపల, బయట యాత్రికులు ఎవరైనా తప్పిపోతే వెంటనే వారిని గుర్తించేలా టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేయడంపైనా చర్చించినట్లు తెలిసింది. గత ఐదేళ్లలో 400 నుంచి 450 మంది పిల్లలు, 400 మంది వృద్ధులు తప్పిపోగా 75 శాతం మందిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో తిరుమలకు వచ్చే చిన్న పిల్లలకు అలిపిరి వద్దే ట్యాగ్‌లు వేయడం.. వృద్ధుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించడంపైనా సమీక్షించినట్లు సమాచారం. ఇక, తిరుమలలో అపరిచితులు లేకుండా చూడడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. భక్తుల రద్దీని నియంత్రించడం కోసం తిరుపతిలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపైనా ఎస్పీ సమీక్షించారు. దీనిపై టీటీడీ విజిలెన్సు, పోలీసు అధికారులు కలసి ఒక డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించారు.