Share News

నయా స్టేషన్‌ ఆగయా

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:55 AM

మరో రెండు నెలల్లో తిరుపతి కొత్త రైల్వే స్టేషన్‌ అందుబాటులోకి తుదిమెరుగుతులు దిద్దుకుంటున్న దక్షణవైపు నిర్మాణాలు వచ్చే ఏడాది జూన్‌లో ఉత్తరవైపు భవనం పూర్తి

నయా స్టేషన్‌ ఆగయా
తిరుపతి రైల్వే స్టేషన్‌ దక్షిణ వైపు ప్రధాన ద్వారం

తిరుపతి, (సెంట్రల్‌), ఏప్రిల్‌1 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మరో రెండు నెలల్లో దక్షిణ వైపు నిర్మిస్తున్న నూతన భవనం అందుబాటులోకి రానుంది. రూ.300కోట్లతో వరల్డ్‌ క్లాస్‌ రైల్వేస్టేషన్‌గా తిరుపతిని మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే శ్రమిస్తోంది. దక్షణవైపు తుదిదశకు చేరుకున్న నిర్మాణాలను రైల్వే అధికారులు మీడియా ప్రతినిధులతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం తిరుపతి స్టేషన్‌ డైరెక్టర్‌ కుప్పాల సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘దక్షిణమధ్య రైల్వేకు చెందిన ప్రధాన రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్‌, నెల్లూరు, తిరుపతిలో అభివృద్ధి పనులు జరగుతున్నాయి. వీటిలో తిరుపతిలో మరింత వేగంగా పనులు జరుగుతున్నాయి. తిరుపతి రైల్వే స్టేషన్‌ అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం రూ.300కోట్లతో పనులు ప్రారంభించింది. ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్లో 80వేల మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో 1.5 లక్షల మంది రాకపోకలకు అవసరమైన సదుపాయాలను కల్పిస్తూ నిర్మాణాలు చేపడుతున్నాం. ఇప్పటికి 70 శాతం పనులు పూర్తయ్యాయి. ఉత్తరంలో నిర్మిస్తున్న పనులు వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తవుతాయి. ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్లో ఆరు ఫ్లాట్‌ ఫాంలు ఉన్నాయి. మరో రెండు పెంచేందుకు ప్రతిపాదనలు పంపాం’ అని వివరించారు. ఈ సమావేశంలో స్టేషన్‌ మేనేజర్‌ డాక్టర్‌ చిన్న రెడ్డెప్ప, ఏడీఈఎం ప్రభాకర్‌, పీఎంసీ నిర్మల్‌ కుమార్‌, కాంట్రాక్టర్‌ సంజయ్‌ కఠారే, ఆర్కే సింగ్‌, ఐపీఎఫ్‌ సందీప్‌ కుమార్‌, జీఆర్పీ సీఐ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

ప్రత్యేకతలివీ

ప్రస్తుతం నిర్మిస్తున్న జీ+3 భవనాల్లో (ఉత్తర-దక్షిణ భవనాలను కలుపుతూ) రెండు ఎయిర్‌ కాన్‌ కోర్సులు ఏర్పాటు చేశారు. వీటికి అనుసంధానంగా 12 ఎస్కలేటర్లు, 10 లిఫ్టులు పనిచేస్తాయి. వీటితో పాటు ప్రస్తుతమున్న రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు కూడా ఉంటాయి. దక్షిణ దిక్కున కొత్త భవనంలోని అండర్‌ గ్రౌండ్‌లో 400 వాహనాలు పార్కింగ్‌ చేసుకునే సౌకర్యం ఉంది.

గ్రౌండ్‌ ఫ్లోర్‌: టికెట్‌ బుకింగ్‌ కౌంటర్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, ప్రయాణికుల విశ్రాంత గదులు, రైల్వే ఆపరేటింగ్‌ ఉద్యోగుల కార్యాలయాలు, ఎస్‌ఎంఆర్‌, ఏఎ్‌సఎం కార్యాలయాలు, వీఐపీ లాంజ్‌లు, క్లాక్‌ రూంలు ఉంటాయి.

ఫస్ట్‌ ఫ్లోర్‌: విశ్రాంత గదులు, ఫుడ్‌ కోర్టులు, దుకాణాలు

సెకండ్‌ ఫ్లోర్‌: రైల్వే విభాగాల కార్యాలయాలు, రిటైరింగ్‌ గదులను (ఆరు లిఫ్ట్‌లు, నాలుగు ఎస్కలేటర్లు) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ నూతన భవనంపై మరో 7 అంతస్థులు పీపీపీకింద విశ్రాంతి గదులు, ఫుడ్‌ కోర్టులు నిర్మాణాలు చేపట్టే యోచనలో ఉన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 01:00 AM