Share News

చిత్తూరులో పెరుగుతున్న రౌడీ సంస్కృతి

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:20 AM

వైసీపీ అధికారంలో వుండగా చిత్తూరులో ఐదేళ్ల పాటు అక్రమ కేసులతో టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల తీరులో మార్పు రాలేదు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అత్యంత హీనంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేస్తున్నారు.

చిత్తూరులో పెరుగుతున్న రౌడీ సంస్కృతి

చిత్తూరు, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధికారంలో వుండగా చిత్తూరులో ఐదేళ్ల పాటు అక్రమ కేసులతో టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టారు. ప్రభుత్వం మారినా వైసీపీ నాయకుల తీరులో మార్పు రాలేదు. ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అత్యంత హీనంగా సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌ చేస్తున్నారు. 2029లో టీడీపీ నాయకుల అంతు చూస్తామంటూ హెచ్చరికలు చేస్తుండడం ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణమవుతోంది.

అప్పట్లో ఎంపీ మనుషులపై దాడి..

ఎన్నికల సమయంలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కుమారుడు రాధే స్నేహితుల మీద చిత్తూరు వైసీపీ నాయకులు దాడి చేయగా.. వారిలో మురళీరెడ్డి కీలకం. ఈయనే ఈ మధ్య ఎమ్మెల్యే గురజాలను ట్రోల్‌ చేస్తూ వీడియో విడుదల చేశారు. ‘నా పేరు శ్రీశైలం.. నేను చేస్తా రౌడీయిజం’ అంటూ చిత్తూరు వాట్సాప్‌ గ్రూపులో వీడియో పెట్టారు. అలాగే శుక్రవారం టీడీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తూ స్టేటస్‌ పెట్టారు. 2029లో టీడీపీ శ్రేణులకు పుష్ప-2 క్లైమాక్స్‌ చూపిస్తామంటూ అందులో ఉంది. ఆ స్టేటస్‌ చూసిన కొందరు మురళీరెడ్డి ఇంటికెళ్లి గొడవ పడ్డారు.

ఆస్పత్రిలో టీడీపీపై వైసీపీ దాడులు

టీడీపీ, వైసీపీ శ్రేణులు చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండగా.. వైసీపీ ఇన్‌ఛార్జి విజయానందరెడ్డి పరామర్శకు వెళ్లారు. ఆస్పత్రిలో ఉన్న టీడీపీ శ్రేణులపై విజయానందరెడ్డి మనుషులు దాడి చేయగా, ఆ వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అక్కడే ఉన్న ఎమ్మెల్యే పీఏ కుమారస్వామి యాదవ్‌పై విజయానందరెడ్డి చిందులేశారు. వడ్డీతో సహా తిరిగిస్తానని హెచ్చరించారు.

పోలింగ్‌ రోజునే ఎమ్మెల్యేపై దాడికి యత్నం

గత ఏడాది ఎన్నికల పోలింగ్‌ రోజున విజయానందరెడ్డి మనుషులు ఎమ్మెల్యే జగన్మోహన్‌ కారును వెంబడించారు. రౌడీషీటర్‌ ప్రసన్న, అప్పటి చుడా ఛైర్మెన్‌ పురుషోత్తమరెడ్డి తదితరులు జగన్మోహన్‌ కారు కదలకుండా చేశారు. సంతపేట పోలింగ్‌ కేంద్రంలో పెద్దఎత్తున ఆయన కారును చుట్టుముట్టి దాడికి యత్నించారు.అయినా కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాలను దక్కించుకున్న రౌడీషీటర్‌ ప్రసన్న వాటిని ప్రశాంతంగా నిర్వహించుకుంటున్నారంటే, తమ నాయకుడు చంద్రబాబు పాలన తీరుకు ఇది నిదర్శనమని ఎమ్మెల్యే జగన్మోహన్‌ చెబుతున్నారు.తాము ఇంత మంచిగా వ్యవహరిస్తుంటే వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Mar 30 , 2025 | 02:21 AM