Share News

డీఆర్‌ బాండ్ల జారీపై కదలిక

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:44 AM

ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెట్‌ రైట్‌ (టీడీఆర్‌) బాండ్ల జారీపై కదలిక వచ్చింది. బాండ్ల జారీకోసం తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు.

డీఆర్‌ బాండ్ల జారీపై కదలిక

నేడు స్పెషల్‌ డ్రైవ్‌

తిరుపతి, డిసెంబరు8(ఆంధ్రజ్యోతి): ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెట్‌ రైట్‌ (టీడీఆర్‌) బాండ్ల జారీపై కదలిక వచ్చింది. బాండ్ల జారీకోసం తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయంలో శుక్రవారం స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నారు. మాస్టర్‌ ప్లాన్‌ రోడ్లకోసం ఆస్తులు పోగొట్టుకున్న చిన్నాచితకా యజమానులకు ఊరట కలగనుంది. గత వైసీపీ పాలనలో టీడీఆర్‌ బాండ్ల జారీలో పెద్దఎత్తున కుంభకోణం జరిగిందని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో లావాదేవీలకు నోచుకోని టీడీఆర్‌ బాండ్లు చెల్లవని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రతిపాదించిన 42 రోడ్లలో ఇప్పటివరకు నిర్మించిన 18 రోడ్లకు సంబంధించి 1,121 మంది భూములు కోల్పోయారు. వీరిలో 373 మందికి మాత్రమే టీడీఆర్‌ బాండ్లు జారీ చేశారు. గొల్లవానిగుంట, కొర్లగుంట ప్రాంతాల్లో స్వల్పంగా భూములు కోల్పోయిన వారితో పాటు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరికి పెద్దమొత్తంలో బాండ్లు జారీ అయ్యాయి. ఇంకా 1,200కు పైగా టీడీఆర్‌ బాండ్లు ఇవ్వాల్సి ఉంది. ప్రతి చదరపు గజానికి రూ.35వేలు చొప్పున 2.80 లక్షల చదరపు గజాల స్వాధీనంతో కూడిన 342 టీడీఆర్‌ బాండ్ల జారీపై వివరాణత్మక నివేదికను సమర్పించాలని, మొత్తం రూ1,013 కోట్లు టీడీఆర్‌ బాండ్లు జారీ చేసినట్టు ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఉత్తర్వులు వెలువడే నాటికే 75 శాతం టీడీఆర్‌ బాండ్లు వినియోగం జరిగిపోయిందని, తక్కిన 25 శాతం మాత్రమే ఉన్నాయని కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీఆర్‌ బాండ్ల అవినీతిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. రెసిడెన్షియల్‌ స్థలానికి కమర్షియల్‌ విలువ కట్టి అడ్డగోలుగా టీడీఆర్‌ బాండ్లు కట్టబెట్టడం ద్వారా కార్పొరేషన్‌కు దాదాపు రూ.150కోట్లు నష్టం వాటిల్లినట్టు విజిలెన్స్‌ విభాగం ప్రాథమికంగా తేల్చింది. నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయమని ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. డాక్యుమెంట్లను పరిశీలించిన కమిటీ లబ్ధిదారులకు బాండ్లను జారీ చేస్తోంది.

స్పెషల్‌ డ్రైవ్‌ను వినియోగించుకోండి

టీడీఆర్‌ బాండ్ల జారీ కోసం శుక్రవారం ఉదయం పది గంటల నుంచి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని కమిషనర్‌ మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ విద్యుల్లత, అదనపు డైరెక్టర్‌ శ్రీనివాసులు పాల్గొంటారన్నారు. వాలిడేషన్‌ చేయించుకునేవారు ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలతో రావాలని తెలిపారు. ఆన్‌లైన్‌ ఎండార్స్‌మెంట్‌, షార్ట్‌ ఫాల్‌ ఇచ్చినవారు తగిన డాక్యుమెంట్లతో హాజరుకావాలని పేర్కొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 01:44 AM