గజరాజుల బీభత్సం
ABN , Publish Date - Mar 28 , 2025 | 01:54 AM
యాదమరి మండలంలోని దళవాయిపల్లె వద్ద బుధవారం రాత్రి 14 ఏనుగులతో కూడిన గుంపు బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన రైతులు, రవి, ప్రసాద్, అశోక్, బాబు, చిన్నదొరలకు చెందిన వరి, కొబ్బరి, మామిడి, అరటి పంటలను, గజేంద్ర, వాసులకు చెందిన వ్యవసాయ బోరు బావి పైపులు, నీటి సరఫరా వ్యవస్థను, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేశాయి.

ధ్వంసమైన పంటలు, వ్యవసాయ పరికరాలు
పేయ దూడను తొక్కి చంపేసిన ఒంటరి ఏనుగు
యాదమరి, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): యాదమరి మండలంలోని దళవాయిపల్లె వద్ద బుధవారం రాత్రి 14 ఏనుగులతో కూడిన గుంపు బీభత్సం సృష్టించింది. గ్రామానికి చెందిన రైతులు, రవి, ప్రసాద్, అశోక్, బాబు, చిన్నదొరలకు చెందిన వరి, కొబ్బరి, మామిడి, అరటి పంటలను, గజేంద్ర, వాసులకు చెందిన వ్యవసాయ బోరు బావి పైపులు, నీటి సరఫరా వ్యవస్థను, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ధ్వంసం చేశాయి. ఈ క్రమంలో గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు దళవాయిపల్లె సమీపంలోని రైతు మణికి చెందిన పేయ దూడను తొక్కి చంపేసింది. అలాగే రాచూరు బీట్ పరిధిలో పెరగాండ్లపల్లె, యలమూరు, రాచూరు వద్ద నాలుగు ఏనుగులు సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. సమాచారం అందుకున్న వెస్ట్ ఫారెస్ట్ రేంజ్ ఇన్‌చార్జి సంకేత్ గరుడ్, ఎఫ్‌ఎ్‌సవో మోహన్ మురళి, ఎఫ్‌బీవో ప్రతాప్, సిబ్బంది ఏనుగులు నాశనం చేసిన పంటలను, మృతిచెందిన దూడను పరిశీలించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అటవీశాఖ ఆధ్వర్యంలో యాదమరి వెటర్నరి వైద్యురాలు డాక్టర్ సంధ్యారాణి సంఘటన స్థలంలోనే దూడకు పోస్టుమార్టం నిర్వహించారు.
హడలిపోతున్న రైతులు
ఏనుగుల వరుస దాడుల నేపథ్యంలో అటవీ సమీప గ్రామాల రైతులు హడలిపోతున్నారు. కళ్లముందే పంటలు ధ్వంసమవుతున్నా కాపాడుకోలేక కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారు. ఏనుగుల దాడుల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.