Tirupati: తిరుపతి కిడ్నాప్ కేసు.. వెలుగు చూసిన సంచలన విషయాలు..
ABN , Publish Date - Mar 30 , 2025 | 12:03 PM
తిరుపతి జీవకోన ప్రాంతంలో రాజేశ్ అనే వ్యక్తి భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి నివాసం ఉంటున్నారు. రాజేశ్, భార్య సుమతి రెండు మీ-సేవా కేంద్రాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ మూడేళ్ల కిందట రాజేశ్ వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు.

తిరుపతి: తిరుపతిలో ఓ కుటుంబం కిడ్నాప్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిన్న(శనివారం) సాయంత్రం ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అపహరించిన దుండగులు రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో బాధిత కుటుంబాన్ని సురక్షితంగా కాపాడిన పోలీసులు నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశారు. కిడ్నాపర్లంతా బెంగళూరు పారిపోయినట్లు గుర్తించి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు పోలీసులు. కిడ్నాప్‌కు ఉపయోగించిన రెండు కార్లను సైతం గుర్తించి సీజ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
తిరుపతి జీవకోన ప్రాంతంలో రాజేశ్ అనే వ్యక్తి భార్య సుమతి, పిల్లలు, తల్లి విజయతో కలసి నివాసం ఉంటున్నారు. రాజేశ్, భార్య సుమతి రెండు మీ-సేవా కేంద్రాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన భార్గవ్ మూడేళ్ల కిందట రాజేశ్ వద్ద నగదు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఎంత అడిగినా భార్గవ్ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించడం లేదు. రాజేశ్ మాత్రం డబ్బులు తిరిగి చెల్లించాలని భార్గవ్‌ను కొంత ఒత్తిడి చేశాడు. దీంతో భార్గవ్ కిడ్నాప్ ప్లాన్ వేశాడు. సెటిల్‌మెంట్లు, కిడ్నాప్‌లు చేయడంలో ఆరితేరిన అరుణ్ అనే వ్యక్తిని సంప్రదించి చెన్నై నుంచి కొందరు కిడ్నాపర్లను రప్పించారు.
శుక్రవారం సాయంత్రం మీ-సేవా కేంద్రాన్ని మూసేసి రాజేశ్, సుమతి ఇంటికెళ్లారు. రాత్రి ఏడు గంటల సమయంలో వారికి అరుణ్ ఫోన్ చేశాడు. కొత్త వ్యాపారం గురించి మాట్లాడాలని చెప్పి అక్కారంపల్లిలోని ఓ అపార్టుమెంటు వద్దకు రావాలని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన రాజేశ్.. కుటుంబంతో సహా అక్కడికి వెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ ఉన్న ఆరుగురు కిడ్నాపర్లు రూ.కోటి ఇస్తేనే తిరిగి ఇంటికి వెళ్లనిస్తామని భయపెట్టారు. చిత్తూరులో ఉన్న తమ బంధువుల వద్దకు తీసుకెళ్తే డబ్బులు ఇస్తానని రాజేశ్ చెప్పాడు. ఈ మేరకు వారంతా కారులో బయలుదేరారు. ఐతేపల్లి వద్దకు రాగానే రాజేశ్ ఒక్కసారిగా కారు నుంచి దూకేశాడు. తీవ్రగాయాలైన అతన్ని స్థానికాలు కాపాడి తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులకు రాజేశ్ అసలు విషయం చెప్పాడు. కిడ్నాపర్ల చెరలో ఉన్న భార్య, పిల్లలు, తల్లిని కాపాడాలని కోరాడు. వెంటనే రంగంలోకి దిగిన చిత్తూరు, తిరుపతి పోలీసులు బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజేశ్ తప్పించుకోవడంతో కిడ్నాపర్లు భయపడ్డారు. పోలీసులకు దొరికిపోతామని భావించి రాజేశ్ తల్లిని చిత్తూరులో, రాజేశ్ భార్య, ఇద్దరు పిల్లలను బెంగుళూరులో వదిలిపెట్టారు. కిడ్నాపర్లంతా బెంగళూరుకు వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు అక్కడికి చేరుకుని ఒకరిని అరెస్టు చేయగా.. మిగతా వారి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Indonesia Earthquake: మరో భారీ భూకంపం.. ఇళ్ల నుంచి పరుగులు పెట్టిన ప్రజలు..
Ugadi 2025: సంవత్సరాలకు పేర్లు ఎలా వచ్చాయో తెలుసా.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే..