Share News

Rice card: బియ్యం కార్డుదారులకు ఊరట

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:45 AM

బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్‌ 30వ తేదీవరకు గడువు పొడిగించింది.

Rice card: బియ్యం కార్డుదారులకు ఊరట
వేలిముద్ర

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): బియ్యం కార్డుదారుల ఈకేవైసీ నమోదుకు పౌరసరఫరాలశాఖ ఏప్రిల్‌ 30వ తేదీవరకు గడువు పొడిగించింది. తొలుత ఈనెల 31 వరకే సమయం ఉందని అధికారులు చెప్పినా, జిల్లాలో ఆదివారం నాటికి ఇంకా 1.53 లక్షల మంది మిగిలిపోయారు. చాలామందిలో సందేహాలుండడం, ప్రస్తుత పరీక్షల కారణంగా పిల్లలు అందుబాటులో లేకపోవడంతో గడువు పొడిగింపు అనివార్యమైంది.

అడ్డంకులెన్నో..

ఈకేవైసీ ఎవరెవరు చేయించుకోవాల్సి ఉందో ఆ జాబితాను డీలర్లు, సచివాలయ సిబ్బందికి పౌరసరఫరాల అధికారులు పంపించారు. ఈ జాబితా ప్రకారం అక్కడ బియ్యం కార్డుదారులు చాలాచోట్ల లేరు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఒక దుకాణం పరిధిలో ఉన్నవారిని మ్యాపింగ్‌ చేసేటప్పుడు వేర్వేరు దుకాణాలకు అస్తవ్యస్తంగా మార్పుచేసేశారు.ఎక్కడైనా సరుకులు తీసుకునే వెసులుబాటు ఉండటంతో లబ్ధిదారులు తాము ఏ దుకాణం పరిధిలో ఉన్నామో పట్టించుకోలేదు. ఇంకొందరు వేరే ప్రాంతాలకు వెళ్లడం, ఫోన్‌ నెంబర్లు లేకపోవడంతో ఈకేవైసీ నమోదులో సమస్యలు తలెత్తాయి.

చిన్నారులు, వృద్ధుల వేలిముద్రలు అప్‌డేట్‌ కాక..

ఐదేళ్ల తర్వాత తమ పిల్లల వేలిముద్రలను చాలామంది అప్‌డేట్‌ చేయించలేదు. ఇటువంటి చిన్నారులు సుమారు 30వేల మంది ఉన్నట్లు అంచనా. అలాగే వేలిముద్రలు అప్‌డేట్‌కాని వృద్ధులు కూడా సుమారు 2000 మంది ఉన్నట్లు తెల్సింది. వీరంతా ఆధార్‌ సెంటర్‌లో వేలిముద్రలు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంది.


ఇలా తెలుసుకోండి

ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి ఎండీయూల ద్వారా రేషన్‌ సరుకుల పంపిణీ చేపట్టనున్నారు. ఇందుకు కార్డుదారులు ఈ-పోస్‌ యంత్రాల్లో వేలిముద్రలు వేస్తారు. ఆ సమయంలో ఆ కార్డులో ఎవరెవరు ఈకేవైసీ నమోదు చేసుకోవాల్సి ఉందో వివరాలను లబ్ధిదారులు తెలుసుకోవచ్చు.

Updated Date - Mar 31 , 2025 | 12:45 AM