Share News

Ugadi: తెలుగువారు విజ్ఞానవంతులు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:57 AM

దేశంలోనే ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతి తెలుగువారిది అని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు.

Ugadi: తెలుగువారు విజ్ఞానవంతులు
‘భువన విజయం’, చిన్నారుల నృత్య ప్రదర్శన - ఉగాది వేడుకల్లో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు కల్చరల్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ప్రత్యేకమైన, భిన్నమైన సంస్కృతి తెలుగువారిది అని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అన్నారు. ఆదివారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తెలుగు అంటేనే తెలివి అని, ప్రపంచంలోనే తెలుగువారు విజ్ఞానవంతులుగా ఉన్నారని చెప్పారు. అన్ని రంగాల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో సత్తాచాటినవారు జిల్లాలో ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. వారి స్ఫూర్తితో ముందుకెళదామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్పీ మణికంఠ మాట్లాడుతూ.. మాతృభాషను కాపాడుకుందామని కోరారు. చుడా చైర్‌పర్సన్‌ కఠారి హేమలత, డీఆర్వో మోహన్‌ కుమార్‌ ప్రసంగించారు. కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయ వేద పండితుడు చిలకమర్తి వెంకట సుబ్బారావు తెలుగు సంవత్సరాది విశ్వావసు నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. నగరంలోని వివిధ పాఠశాలల బాలికలు సంప్రదాయ నృత్యాలతో ఆహూతులను అలరించారు. పండితులు, సాహితీవేత్తలతో ‘భువన విజయం’ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ రంగాలకు చెందిన వారికి ఉగాది పురస్కారాలను ప్రదానం చేశారు. ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా టూరిజం అధికారి గౌరి, చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.


కాణిపాకంలో ఉగాది వేడుకలు

ఐరాల(కాణిపాకం), మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకంలో ఉగాది వేడుకలను ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉద యం ఆలయంలో వరసిద్ధుడికి అభిషేకం చేశారు. మూల విరాట్‌కు చందన అలంకారం చేసి, భక్తులను స్వామి దర్శనానికి అనుమతిచ్చారు. ఆలయ కల్యాణ వేదికపై పురోహితులు మోహన్‌రామలింగం, ఆస్థాన పంచాంగకర్త శివకుమార్‌శర్మలు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఆలయంలో ప్రథమంగా తయారు చేసిన గంటల పంచాంగం విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీమోహన్‌, ఈవో పెంచలకిషోర్‌ దంపతులు, సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, అర్చక, పండితులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:57 AM