Ruia: రుయాలో నకిలీ సర్టిఫికెట్ల ముఠా
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:00 AM
రుయాస్పత్రిలో నెల రోజులుగా సదరం సర్టిఫికెట్ల పరిశీలన జోరుగా సాగుతోంది. ఇప్పటికే 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు.

తిరుపతి(వైద్యం), ఆంధ్రజ్యోతి: రుయాస్పత్రిలో నెల రోజులుగా సదరం సర్టిఫికెట్ల పరిశీలన జోరుగా సాగుతోంది. ఇప్పటికే 20కి పైగా నకిలీ సర్టిఫికెట్లను అధికారులు గుర్తించారు. వీటి జారీ వెనుక కొందరు కింది స్థాయి సిబ్బంది పాత్ర ఉన్నట్లు కూడా తేలింది. లోలోపలే దానిపై విచారణ చేపడుతున్నారు. తిరుపతి నగరపాలక సంస్థలో పనిచేసే ఓ శానిటరీ మేస్త్రి... ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు గతేడాది నవంబరు 1 నుంచి ఈ ఏడాది జనవరి 31 వరకు మూడు నెలలు సెలవు కావాలని మెడికల్ సర్టిఫికెట్ సమర్పించారు. ఆ తర్వాతా ఆరోగ్యం కుదుటపడలేదని సెలవును మరో 54 రోజులు పొడిగించాలంటూ ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు మళ్లీ మెడికల్ సర్టిఫికెట్ ఇచ్చారు. తన ఆరోగ్యం కుదుట పడిందంటూ ఈనెల 25న ఫిట్‌నెస్ సర్టిఫికెట్ సమర్పించారు. వీటన్నింటిని రుయాస్పత్రిలోని ఒకే డాక్టరు మంజూరు చేశారు. దీనిపై నగరపాలక సంస్థ అధికారులకు అనుమానం వచ్చి రుయా అధికారులను విచారించగా.. ఈ మెడికల్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసిన సదరు డాక్టరు పదేళ్ల కిందట రుయాస్పత్రిలో పనిచేసి అప్పుడే రిటైర్ అయినట్లు తెలిసింది. ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న రేణిగుంటవాసి రెండు నెలలు సెలవు కోసం నెల కిందట మెడికల్ సర్టిఫికెట్ సమర్పించారు. ఆ కంపెనీ ప్రతినిధులు అనుమానంతో పరిశీలించగా అది రుయాస్పత్రిలో ఏడేళ్ల కిందట రిటైరైన జనరల్ సర్జరీ విభాగాధిపతి ఇచ్చినట్లుగా తేలింది. ఆ విషయాన్ని రుయా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యల్లేవు.
ఏం జరుగుతోంది?
రుయాలో ఎంఆర్‌డీ (మెడికల్ రికార్డు డిపార్టుమెంటు)లో కొందరు సిబ్బంది గతంలో ఆస్పత్రిలో పనిచేసి బదిలీ అయిన, రిటైరైన అధికారుల పేర్లతో సంతకాలు చేసి వారి హోదాతో నకిలీ సీలు వేసి ఇలా సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీనికోసం బయట ఓ గదిని సిద్ధం చేసుకొన్నట్లు విమర్శలున్నాయి. కొందరు మధ్యవర్తుల ద్వారా నకలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ. 20 వేల వరకు అవసరాన్ని బట్టి వసూలు చేస్తున్నారని తెలిసింది. అయితే, సర్టిఫికెట్లు అవసరమైన వారు మధ్యవర్తుల మాటలు నమ్మి నకిలీ వాటినే నిజమైనవిగా భావించి తీసుకెళుతున్నారు. వీటివల్ల భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అనేక అనర్థాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని జిల్లా అధికారులు నకిలీ సర్టిఫికెట్ల ముఠా ఆటకట్టించాల్సి ఉంది.