Amaravati : దామోదరం సంజీవయ్యకు సీఎం ఘననివాళి
ABN , Publish Date - Feb 15 , 2025 | 05:02 AM
సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఘన నివాళులర్పించారు.

ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉన్నామన్న లోకేశ్
అమరావతి, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఆ మహనీయునికి సీఎం చంద్రబాబు, విద్య, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ ఘన నివాళులర్పించారు. శుక్రవారం ఉండవల్లి నివాసంలో సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా సంజీవయ్య ఖ్యాతికెక్కారని, తన పదవీకాలంలో అనేక విప్లవాత్మక పథకాలతో ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని కొనియాడారు. నమ్మిన విలువలకు జీవితాంతం కట్టుబడిన వ్యక్తి సంజీవయ్య అని, ఆయన జయంతి వేడుకలను కూటమి ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ ఆయన ఆశయసాధనకు కట్టుబడి ఉందని లోకేశ్ పేర్కొన్నారు.
కర్నూలులో ఘనంగా ‘దామోదరం’ జయంతి వేడుకలు
మాజీ సీఎం దామోదరం సంజీవయ్య నిజాయితీకి మారు పేరని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా కొనియాడారు. సంజీవయ్య 104వ జయంతి వేడుకలను కర్నూలు నగరంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కలెక్టరేట్ నుంచి విద్యార్థులు, అధికారులు, నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దామోదరం సంజీవయ్య కూడలిలో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో కలెక్టర్ రంజిత్ బాషాతో పాటు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరిత, బొగ్గుల దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..‘ప్రతి ఒక్కరూ సంజీవయ్యను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగు జాడల్లో నడవాలి. దళిత సీఎంగా ఆయన ఒక చరిత్ర సృష్టించారు. సంజీవయ్య జీవిత చరిత్రను పుస్తకాలుగా ముద్రించి విద్యార్థులకు పంపిణీ చేస్తాం’ అని అన్నారు. ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, ‘సంజీవయ్య ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. బడుగుల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. దేశంలోనే మొదటిసారిగా వృద్ధులకు పింఛన్ మంజూరు చేశారు’ అని వివరించారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ... అవినీతిపరుల కట్టడి కోసం ఏసీబీ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఈ సందర్భంగా పలువురు కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ... కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.