Share News

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!

ABN , Publish Date - Jan 18 , 2025 | 03:21 AM

‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది.

Chandrababu's Achievements : జగన్‌ మాటలు.. బాబు చేతలు!
YS Jagan vs CM Chandrababu Naidu

  • విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు

  • సమర్థ నాయకత్వంతో రాష్ట్రానికి ఫలాలు

నాడు..

స్వప్రయోజనాల కోసమే ఢిల్లీకి

పోలవరం పరిహారంపై చేతులెత్తేసి కేంద్రమే దయతలచాలంటూ దీనత్వం

ఉక్కు పై శూన్య స్పందన.. అమరావతిపై ‘భారమైన’ కబుర్లు.. జోన్‌కు రెడ్‌ సిగ్నల్‌

నేడు..

రాష్ట్ర ప్రయోజనాలే కీలకం

ఒకేరోజు పోలవరం నిర్వాసితులకు 988 కోట్లు

విశాఖ ఉక్కుకు ఊపిరి పోస్తూ భారీ ప్యాకేజీ

రైల్వే జోన్‌కు భూములు, ప్రధాని శంకుస్థాపన

అమరావతికి ఆర్థిక సంస్థల రుణాలు, నిధులు

‘‘మీరంతా అనుకున్నంత వేగంగా చేయలేకపోయిన పని ఒకటుంది! అది... పరిహారం ఇప్పించడం! అది నా చేతుల్లో ఉండే పని కాదు. కాబట్టి నేను కూడా కష్టపడాల్సి వస్తోంది. ఈ విషయంలో ఢిల్లీ మీద ఆధారపడాల్సి వస్తోంది. వాళ్ల మీద ఎక్కువ ఒత్తిడి తీసుకువచ్చే కార్యక్రమం చేతనైనకాడికి చేస్తూనే ఉన్నాను! అడుగులు ముందుకు వేస్తూనే ఉన్నాను.’’

2023 ఆగస్టు 7వ తేదీన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్‌ పోలవరం నిర్వాసితులతో పలికిన దీన, దయనీయమైన పలుకులు ఇవి! ఆయన ఇలాంటి మాటలు అనేకం చెప్పారు. కానీ... నిర్వాసితులకు పైసా దక్కలేదు.

  • అక్కడ సీన్‌ కట్‌ చేస్తే...

ఈ నెల 3వ తేదీన, ఒకే రోజున పోలవరం నిర్వాసితులకు రూ.988 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. టింగ్‌మని ఫోన్‌లో మెసేజ్‌ రావడం... డబ్బులు జమ అయినట్లు తెలుసుకుని నిర్వాసితులు ఆనందంతో పొంగిపోవడం! అంతా... ‘సైలెంట్‌’గా జరిగిపోయింది! వైఎస్‌ జగన్‌ సర్కారు అసమర్థ నిర్వాకాలు... నేటి చంద్రబాబు సర్కారు సాధిస్తున్న ఫలితాలను చెప్పేందుకు మచ్చుకు ఇదొక చిన్న ఉదాహరణ! అమరావతి నుంచి విశాఖ రైల్వేజోన్‌ దాకా... చెప్పుకొంటూ పోతే ఇలాంటివి ఎన్నో! ఐదేళ్లు అనేక పర్యాయాలు ఢిల్లీ యాత్రలు చేసి... జగన్‌ సాధించిందేమిటోఎవ్వరికీ తెలియదు.


కానీ... అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే చంద్రబాబు కేంద్రం నుంచి వేలకోట్ల నిధులు సాధించారు... సాధిస్తున్నారు. పోలవరం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, రైల్వేజోన్‌, పెండింగ్‌ బిల్లులు... ఇలా అన్నింటిపైనా ముఖ్యమంత్రిగా జగన్‌ చేతులెత్తేశారు. ‘కేంద్రం దయ... మన ప్రాప్తం’ అంటూ ఐదేళ్లు దీన వచనాలు పలికారు. ‘అమరావతి’పై కక్షకట్టి దానిని అటకెక్కించారు. అదేమంటే... అన్ని వేల కోట్ల ఖర్చు భరించడం వల్ల కాదని కబుర్లు చెప్పారు. జగన్‌ విఫలమైన ఈ అన్ని అంశాల్లో చంద్రబాబు సూపర్‌ సక్సెస్‌ అయ్యారు.

  • జగన్‌ ఢిల్లీ యాత్రల ఫలం శూన్యం

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీకి వెళ్లేవారు. ప్రధాని, హోంమంత్రితోపాటు ఇతర కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేవారు. వాళ్లతో ఏం మాట్లాడిందీ, వారు ఎలా స్పందించిందీ ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. కానీ... ఢిల్లీ పెద్దలకు ఇచ్చిన ‘వినతిపత్రం’ అంటూ ఒక కాగితాన్ని మీడియాకు విడుదల చేసేవారు. అందులో... ప్రతిసారీ దాదాపుగా అవే అంశాలు! కానీ... దేనిపైనా కేంద్రం నుంచి స్పందన కనిపించేదే కాదు. దీంతో... సొంత కేసులు, వివేకా కేసులో తమ్ముడు అవినాశ్‌ రెడ్డికి రక్షణ, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసమే జగన్‌ ఢిల్లీ పెద్దలను కలిసేవారనే బలమైన ఆరోపణలు వినిపించేవి. కోరినన్ని అప్పులు మినహా... రాష్ట్రం కోసం జగన్‌ సాధించిందేమిటనేది పెద్ద ప్రశ్న!

  • నేడు ఇదీ పరిస్థితి...

కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను వారికి నివేదించారు. దీని ఫలితాలు తక్షణం కనిపిస్తున్నాయి. పోలవరానికి నిధులు, అమరావతికి రుణం, విశాఖ రైల్వేజోన్‌కు శంకుస్థాపన, జాతీయ రహదారులు, కేంద్ర సంస్థల పెట్టుబడులు... ఇలా కేంద్రం నుంచి నిధుల వరద పారుతోంది!


  • సొంత ప్రయోజనాలే ముఖ్యం

ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి. ఇంకా చెప్పాలంటే... టీడీపీ ఎంపీల బలం కేంద్ర ప్రభుత్వానికి చాలా కీలకం. అందుకే... రాష్ట్రానికి కేంద్రం ప్రాధాన్యం ఇస్తోందనే వాదనలోనూ నిజముంది. అయితే... 2019-24లో వైసీపీ ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి కాదు. కానీ... అప్పట్లో రాజ్యసభలో ఎన్డీయేకు తగిన బలం లేదు. దీనిని అవకాశంగా తీసుకుని... రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తేనే, రాజ్యసభలో బిల్లులకు మద్దతు పలుకుతామని జగన్‌ స్పష్టం చేసే అవకాశం ఉండింది. కానీ... జగన్‌ ఎప్పుడూ ఇలా చేయలేదు. కేంద్రం కోరకముందే అన్ని అంశాల్లో బేషరతుగా మద్దతు పలికారు. ‘నా స్వప్రయోజనాలు, కేసుల నుంచి రక్షణే నాకు ముఖ్యం’ అన్నట్లుగా వ్యవహరించారు.

- అమరావతి, ఆంధ్రజ్యోతి

  • అన్నింటా జగన్‌ ‘నాటకాలే’

  • విశాఖ ఉక్కు

జగన్‌ ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయించారు. అధికారంలోకి వచ్చాక ఇలాంటి ‘రాజీనామాలు’ మరిచిపోయారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నా పట్టించుకోలేదు. ఉక్కు రక్షణ కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న డిమాండ్లను వినిపించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతీసారి ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌, ఉక్కు శాఖా మంత్రి కుమారస్వామితో సమావేశమై చర్చలు జరిపారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు కూడా విశాఖ ఉక్కుకు ఆర్థికసాయం చేయాలని కోరారు. చంద్రబాబు ప్రయత్నాల ఫలితంగా కేంద్రం విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. ‘ప్రైవేటీకరణ’ ముప్పు తప్పింది.


  • పోలవరం-పరిహారం

పోలవరం నిర్వాసితులకు పునరావాసం, పరిహార ప్యాకేజీపై జగన్‌ ఐదేళ్లు కథలు చెప్పారు. ‘నా చేతిలో ఏమీ లేదు’ అన్నట్లుగా నిర్వాసితులను ఉసూరుమనిపించారు. కేంద్రం ఇచ్చే పరిహారానికి అదనంగా... ఎకరాకు రూ.10 లక్షలు చెల్లిస్తానని హామీ ఇచ్చీ పట్టించుకోలేదు. ఇప్పుడు... ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండానే కేంద్రం పోలవరం నిర్వాసితులకు పరిహారం జమ చేసింది. పునరావాస కాలనీల నిర్మాణ కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు కూడా చెల్లిస్తున్నారు. 90 శాతం వరకు పరిహారం పంపిణీ పూర్తి చేశారు. స్థిరాస్తి విలువలు కూడా చాలా వరకు చెల్లించారు. మిగిలిన భూములను సేకరించి వాటికి పరిహారం అందజేసి, ఇతర అంశాలను పూర్తి చేసేందుకు అధికారులను నియమించింది.

  • విశాఖ రైల్వే జోన్‌...

విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటును వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ముడసర్లోవ వద్ద స్థలం అప్పగిస్తే జోన్‌ కార్యాలయం ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వేశాఖ పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదు. అయితే, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కూటమి ప్రభు త్వం రైల్వేజోన్‌ ఏర్పాటును కార్యరూపంలోకి తెచ్చింది. రైల్వేకు ముడసర్లోవ వద్ద స్థలం అప్పగించింది. ఆ వెంటనే రైల్వేశాఖ జోనల్‌ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు పిలిచింది. టెండర్ల గడువు ముగియగా బిడ్లు సాంకేతిక పరిశీలనలో ఉన్నాయి. ఆ భవనాల ఆకృతులతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించారు. ప్రధాని ఇటీవల రైల్వేజోన్‌ కార్యాలయానికి శంకుస్థాపన కూడా చేశారు.

అమరావతి...

రాష్ట్రానికి ఐదేళ్లు రాజధాని లేకుండా చేసిన ఘనత వైఎస్‌ జగన్‌దే! ‘రాజధానిగా అమరావతికి మద్దతు పలుకుతున్నాం’ అని నమ్మబలికి ఆయన అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత... మాట మడతపెట్టారు. మూడు ముక్కలాట మొదలుపెట్టారు. అమరావతి నిర్మాణానికి వేల కోట్లు కావాలన్నారు. నిధుల కోసం ఎలాంటి ప్రయత్నం చేయకుండానే... అంత భారం భరించలేమని కథలు చెప్పారు. మునిగి పోతుందని దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు ‘అమరావతి’ దృశ్యం మారిపోయింది. ప్రపంచబ్యాంకు, ఏడీబీలు రుణం మంజూరు చేశాయి. జగన్‌ సర్కారు పెండింగ్‌లో పెట్టిన బిల్లులను ప్రస్తుత ప్రభుత్వం చెల్లిస్తోంది. పనుల కొనసాగింపునకు మళ్లీ టెండర్లు పిలిచింది. అమరావతిని పూర్తిస్థాయిలో పట్టాలెక్కిస్తోంది.

Updated Date - Jan 18 , 2025 | 07:55 AM