Andhra Pradesh betting scandal: వైసీపీకి బెట్టింగ్ బేడీలు
ABN , Publish Date - Mar 29 , 2025 | 04:54 AM
ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్ మాఫియాపై పోలీసుల వేట ముమ్మరంగా కొనసాగుతోంది. కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎంపీపీ కుమారుడు తుంగల పవన్‌కుమార్ క్రికెట్ బెట్టింగ్‌లో పట్టుబడ్డాడు. అతని నెట్‌వర్క్‌లో జనసేన మద్దతుదారు చెన్నా గోపయ్య కూడా ఉండగా, పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కడపలో బెట్టింగ్ కారణంగా అప్పులపాలైన యువకుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.

అవనిగడ్డ ఎంపీపీ కుమారుడి అరెస్టు
జనసేన మద్దతుదారూ అదుపులో!
బ్యాంక్ ఖాతాలో భారీగా నగదు
విజయవాడ, ప్రొద్దుటూరు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బెట్టింగ్‌రాయుళ్ల కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. శుక్రవారం కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీ ఎంపీపీ తుంగల సుమతీదేవి కుమారుడు పవన్‌కుమార్ బెట్టింగ్ నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికినట్టు తెలిసింది. ఈ జిల్లాకు చెందిన మరో బుకీనీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అతడు జనసేన మద్దతుదారు అని తెలిసింది. పోలీసువర్గాల కథనం ప్రకారం, విజయవాడ పటమటకు చెందిన తుంగల పవన్‌కుమార్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పోలీసులు పవన్‌కుమార్ ఉంటున్న స్థావరాన్ని చుట్టిముట్టి లోపలకు వెళ్లే సరికి మ్యాచ్‌లో పరుగులకు మించి ఆయన పందాలను పరుగెత్తిస్తున్నాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్ బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, అందులో లక్షలాది రూపాయలు నిల్వ ఉన్నట్టు గుర్తించారు. విచారించగా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం నెట్‌వర్క్‌ను విస్తరించినట్టు పవన్‌కుమార్ వెల్లడించాడని సమాచారం. ఆయన ఫోన్ సంభాషణలు ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ద్వారా సాగినట్టు సమాచారం. పవన్‌కుమార్‌తో నిత్యం సంప్రదింపులు చేస్తున్న అవనిగడ్డకు చెందిన జనసేన మద్దతుదారు చెన్నా గోపయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పవన్‌కుమార్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడి స్వస్థలం అవనిగడ్డ అయినప్పటికీ విజయవాడ కేంద్రంగా బెట్టింగ్‌లు నడుపుతున్నాడు. పవన్‌కుమార్ ప్రధాన బుకీగా ఉంటూ ఉమ్మడి జిల్లాలో సబ్ బుకీలను నియమించుకున్నాడు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి మిగిలిన బుకీలను కూడా ఏరివేసే పనిలో ప్రత్యేకబృందం ఉన్నట్టు తెలిసింది.
అప్పులపాలై యువకుని ఆత్మహత్య
కడప జిల్లా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పులపాలై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో కాకనూరు నాగేశ్వరరెడ్డి అనే వ్యక్తి చిల్లర దుకాణం నిర్వహిస్తున్నాడు. నాగేశ్వరరావు కుమారుడు ప్రేమ్‌సాగర్ రెడ్డి (23) బీటెక్ రెండవ సంవత్సరంలో చదువు మానేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో కొన్ని రోజులు పనిచేశారు. అనంతరం తిరుపతి చేరుకుని అక్కడ హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకులో పనిచేస్తూ 15 రోజుల క్రితం కడపకు బదిలీపై వచ్చారు. క్రికెట్ బెట్టింగ్‌లు ఆడి డబ్బులు పోగొట్టుకున్నారు. పలువురి దగ్గర సుమారు రూ.8లక్షలు అప్పు చేశారు. వాటిని తీర్చలేని స్థితిలో శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంట్లో వాళ్లు కిరాణా షాపులో ఉండగా.. ప్రేమ్‌సాగర్‌రెడ్డి పైన గదిలో ఇనుప పైపులకు చీరతో ఉరివేసుకున్నారు. కాసేపటికి కుటుంబసభ్యులు గమనించి అతడిని కిందకు దించి దగ్గరలోని ఓ వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందాడని ఆయన తెలిపారు. తండ్రి నాగేశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేశామని వన్‌టౌన్ పోలీసులు తెలిపారు.
Also Read:
42 అడుగుల బోటుపై.. ఓ ఫ్యామిలీ డేరింగ్ స్టెప్..
మోదీజీ... తమిళనాడుతో పెట్టుకోవద్దు
కొత్త ఏడాది మారనున్న రూల్స్.. తెలుసుకోకుంటే మీకే..
For More Andhra Pradesh News and Telugu News..