Share News

Rural Education : ఊరు బడికి ఊపిరి!

ABN , Publish Date - Feb 04 , 2025 | 04:12 AM

ప్రైవేటు బడులు పెరగడం, ప్రజల్లోనూ ఆదిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాభవం కోల్పోయాయి.

 Rural Education : ఊరు బడికి ఊపిరి!

  • ‘మోడల్‌ ప్రైమరీ స్కూల్‌’కు శ్రీకారం

  • ప్రతి తరగతికీ ఒక టీచర్‌తో బోధన

  • ప్రాథమిక విద్య బలోపేతానికి చర్యలు

  • పంచాయతీ, వార్డుల్లో మోడల్‌ స్కూల్‌

  • ప్రైవేటుకు దీటుగా మార్చేలా ప్రణాళిక

  • వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

  • జగన్‌ హయాంలో కునారిల్లిన స్కూళ్లు

ఊరి బడులకు కూటమి ప్రభుత్వం ఊపిరిపోస్తోంది. ప్రైవేటు స్కూళ్ల పోటీ, జగన్‌ జమానాలో తీసుకున్న అసమర్థ నిర్ణయాలతో కునారిల్లిన పల్లెల్లోని ప్రాథమిక పాఠశాలలకు తిరిగి పునరుజ్జీవం పోసే దిశగా అడుగులు వేస్తోంది. ‘మోడల్‌ ప్రైమరీ స్కూళ్ల’కు శ్రీకారం చుడుతోంది. ప్రతి తరగతికీ ఓ ఉపాధ్యాయుడు ఉండేలా, విద్యార్థులను ప్రాథమిక దశ నుంచి తీర్చిదిద్దేలా పక్కా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యార్థులను ప్రాథమిక దశ నుంచే బలోపేతం చేయనుంది. ఈ స్కూళ్లు వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రారంభంకానున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెండు దశాబ్దాలకు ముందు గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు కళకళలాడుతుండేవి. కాలక్రమంలో ‘ఊరి బడి’ కళను కోల్పోయింది. ప్రైవేటు బడులు పెరగడం, ప్రజల్లోనూ ఆదిశగా మోజు పెరగడంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ప్రాభవం కోల్పోయాయి. ఇప్పుడైతే ఊర్లో ప్రభుత్వ బడి ఉందా? అని అనుమానం కలిగే స్థాయిలో సర్కారు ప్రాథమిక పాఠశాలలు కునారిల్లుతున్నాయి. మండలానికి ఎక్కడైనా ఒకట్రెండు పాఠశాలలు, పట్టణాల్లో ప్రాథమిక బడులను మినహాయిస్తే మిగిలిన బడులు ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో ప్రభుత్వాలు కూడా టీచర్ల సంఖ్యను తగ్గిస్తూ వచ్చాయి. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లు అంతంత మాత్రంగానే ఉండటంతో ఎవరైనా తల్లిదండ్రులు ప్రభుత్వ బడిలో పిల్లల్ని చేర్పించాలనే ఆలోచన ఉన్నా.. వెనక్కి తగ్గుతున్నారు. దూరాభారం అయినా ప్రభుత్వ బడులకు పిల్లల్ని పంపుతున్నారు. కొన్ని చోట్ల ప్రైవేటు బడులకు కాకపోయునా టీచర్లు ఎక్కువ ఉన్న పక్క ఊళ్లలోని సర్కారీ స్కూళ్లకు పంపుతున్నారు.


ప్రస్తుత పరిస్థితి ఇదీ!

రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాల్లో 32,596 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వాటిలో 60 మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న పాఠశాలలు 17 శాతమే. అవి కూడా ఎక్కువగా పట్టణాల్లోనే ఉన్నాయి. మిగిలిన 83 శాతం బడులు ‘ఉన్నాయంటే ఉన్నాయి’ అన్నట్టుగానే నడుస్తున్నాయి. ఈ విషయాన్ని గమనించిన కూటమి ప్రభుత్వం ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని, ఊరి బడికి మళ్లీ కళ తేవాలని సంకల్పించింది. గత వైసీపీ ప్రభుత్వం తరగతుల విలీనం పేరుతో దెబ్బతీసిన ప్రాథమిక విద్యను తిరిగి పట్టాలెక్కించేందుకు, మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రాథమిక బడులను సమూలంగా మార్చేయాలనే విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ పెట్టాలని నిర్ణయించింది. ఈ బడిలో ప్రీ-పైమరీ 1-5 తరగతులు ఉంటాయి. ప్రతి తరగతికీ ఒక టీచర్‌ ఉంటారు. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చాలావరకు 1-5 తరగతులకు ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు. మోడల్‌ ప్రైమరీ స్కూల్‌లో తరగతికి ఒక టీచర్‌ను ఇవ్వడం వల్ల బోధన మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. టీచర్ల సంఖ్య పెరిగితే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని తలపోస్తోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి మోడల్‌ ప్రైమరీ స్కూళ్లను ప్రారంభించే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.


ఎంపికే ప్రధాన సవాలు

మోడల్‌ ప్రైమరీ పాఠశాల విధానం మంచిదే అయినా ఏ ప్రాథమిక పాఠశాలలను మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా గుర్తించాలనేది ప్రధాన సవాలుగా మారనుంది. రాష్ట్రంలోని చాలా పంచాయతీల్లో రెండు నుంచి మూడు ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటిలో కొన్ని ఎస్సీ, ఎస్టీల నివాసిత ప్రాంతాల్లో ఉన్నాయి. తమ ఇంటి వద్ద ఉండే బడి మోడల్‌ స్కూల్‌గా ఉండాలని సాధారణంగా తల్లిదండ్రులు కోరుకుంటారు. దీంతో ఊరికి మధ్యస్థంగా, అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉండే బడిని మోడల్‌ ప్రైమరీ స్కూల్‌గా ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఎంపిక బాధ్యతను స్థానికంగా ఉండే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలకే అప్పగిస్తున్నారు. గ్రామంలోని పరిస్థితులు, అవసరాల, వసతుల ఆధారంగా కమిటీలే నిర్ణయిస్తాయి.

దశలవారీగా మార్పు

ప్రతి గ్రామ పంచాయతీలో మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ పెట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం అయినప్పటికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి పంచాయతీలో మోడల్‌ స్కూల్‌ వచ్చే అవకాశం లేదు. విద్యార్థుల సంఖ్య మరీ తక్కువగా ఉంటే అక్కడ మోడల్‌ స్కూల్‌ ప్రారంభించలేరు. తొలుత విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉన్న చోట్ల మోడల్‌ స్కూళ్లు పెట్టి.. దశలవారీగా ఏటా కొన్నింటిని మోడల్‌గా మారుస్తారు. అంతిమంగా 13 వేల పంచాయతీల్లో 13 వేల మోడల్‌ ప్రైమరీ స్కూళ్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం. మోడల్‌ స్కూళ్లు పెట్టినా బేసిక్‌ ప్రైమరీ పాఠశాలలను యథావిధిగా కొనసాగించనున్నారు.


ఆ తరగతులు వెనక్కి

వైసీపీ ప్రభుత్వం జీవో 117ను తీసుకొచ్చి ప్రాథమిక విద్యను చావుదెబ్బ కొట్టింది. ప్రాథమిక పాఠశాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఉన్న చోట్ల 3-5 తరగతులను తీసుకెళ్లి వాటిలో విలీనం చేశారు. అలా 4,731 ప్రాథమిక పాఠశాలల్లో 3-5 తరగతులను తీసేసి, సమీపంలోని 3,348 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో కలిపేశారు. దీంతో 2,43,540 మంది విద్యార్థులు ప్రభావితమయ్యారు. ఇంటికి దగ్గర్లోని బడిని కాదని దూరంలో ఉన్న బడులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. అలా విలీనానికి గురైన తరగతులను వెనక్కి తేవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.

కనీసం 60 మంది

కనీసం 60 మంది విద్యార్థులుంటే వాటిని మోడల్‌ ప్రైమరీ పాఠశాలగా మారుస్తారు. అవసరం అనిపిస్తే కొన్ని చోట్ల ఆ సంఖ్య లేకపోయినా పెడతారు. గదులు సరిపోకపోతే సమీప ప్రభుత్వ బడుల్లోని భవనాలను వాడుకుంటారు. వేర్వేరు భవనాల్లో ఉన్నా దానిని ఒకే మోడల్‌ పాఠశాలగా పరిగణిస్తారు. విద్యార్థుల సంఖ్య 120 దాటితే ప్రధానోపాధ్యాయుడి పోస్టును మంజూరు చేస్తారు. 150 దాటిన తర్వాత ప్రతి 30 మంది విద్యార్థులకు మరో టీచర్‌ను కేటాయిస్తారు.

Updated Date - Feb 04 , 2025 | 04:13 AM