మెగా ప్రాజెక్టులు..పడక!
ABN , Publish Date - Mar 31 , 2025 | 01:01 AM
పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పర్యాటక భవనాలు వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి.

పదేళ్ల కిందట పర్యాటక పనులు
నాడు కేంద్ర మంత్రిగా శంకుస్థాపన
ఉమ్మడి జిల్లాలో సాగని నిర్మాణాలు
రూ.25 కోట్లతో ఆరంభం
కోనసీమలో అయితే దారుణం
కాకినాడలో అటకెక్కిన నిర్మాణం
తూర్పున పునాది దాటని వైనం
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
పర్యాటకులను మంత్రముగ్ధులను చేసే లక్ష్యంతో కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పర్యాటక భవనాలు వినియోగంలోకి రాకుండానే శిథిలావస్థకు చేరుతున్నాయి. సర్వాంగ సుందరంగా నిర్మాణాలు పూర్తి చేసిన భవనాలను పర్యాటకుల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావడంలో పర్యాటకశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. నిర్మాణ సమయాల్లోనే నిధులు కాజేస్తూ ఆ తర్వాత భవన సముదాయాలను గాలికి వదిలేస్తున్నారు.. సుమారు పదేళ్ల కిందట కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న చిరంజీవి సుమారు రూ.27 కోట్ల వ్యయంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించిన పనులు ఎక్కడికక్కడ అటకెక్కాయి.. చాలా భవనాలు ప్రారంభించకుండానే శిథిలమై దీనంగా చూస్తున్నాయి.. ప్రస్తుత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ మెగా పర్యాటక ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. మెగా ప్రాజెక్టులు పడేకేశాయి.. ఒక్కచోట కూడా పరిస్థితి సంతృప్తికరంగా లేదు.. కాకినాడ జిల్లాలో జిల్లాలో స్టేట్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ హోట ల్ మేనేజ్‌మెంట్ నిర్మాణం మధ్యలోనే నిలిచి పోయింది..కోనసీమ జిల్లాలో భవన నిర్మా ణాలు పూర్తయినా పర్యాటక అధికారుల నిర్లక్ష్యం కార ణంగా శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇక తూర్పు గోదావరి జిల్లా కడియపులంకలో చేపట్టిన ఎకో టూరిజం ప్రాజెక్టు పునాది దశను దాటలేదు. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మెగా ప్రాజెక్టులు పడేకేశాయి.కాకినాడ జిల్లాలో స్టేట్ ఇన్సిస్టిట్యూ ట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కలగానే మారింది. శంకుస్థాపన చేసి పదేళ్లు పూర్తయినా ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోక వెక్కిరిస్తోంది. 2015లో కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సంస్థ ఏర్పా టుకు రూ.12 కోట్లు నిధులివ్వడానికి ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు భవన నిర్మాణ పనులు సా...గుతూనే ఉన్నాయి. నిరు ద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చాలనే ఉద్దేశంతో రాష్ట్రవిభజన సమ యంలో కేంద్ర ప్రభుత్వం హోటల్ మేనేజ్‌మెంట్ ఇన్సిస్టి ట్యూట్ మంజూరు చేసింది. అప్పట్లో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి దీన్ని జిల్లాకు కేటాయించారు. కేంద్రం నుంచి రూ.12 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 2015 ఏప్రిల్ లో పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ఉప్పా డ కొత్తపల్లిలో హైస్కూలుకు చెందిన 16 ఎక రాల స్థలం కేటాయించారు.కొందరు భూమి కేటా యింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించడంతో మూడు ఎకరాలు కేటాయిం చేలా న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసి వివా దానికి ముగింపు పలికింది.ఇది జరిగి దాదాపు ఐదేళ్లుపైనే దాటిపోయింది.అయినా ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోకుండా వెక్కిరిస్తోంది. కాకి నాడతో పాటే తిరుపతిలో కేంద్రం నిధులతో రాష్ట్రపర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన హోట ల్ మేనేజ్‌మెంట్ విద్యాసంస్థ అద్భు తంగా రాణి స్తోంది.ఇక్కడ మాత్రం ఇంకా ఆరంభం కాకుం డా అలాగే ఉంది. సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాష్ట్ర పర్యాటక అభి వృద్ధి సంస్థ కళ్లు తెరిచి దీన్ని పూర్తి చేయడానికి రూ.6.74 కోట్లతో టెండర్లు పిలిచింది.ఒక కాంట్రాక్టర్ పను లు ఆరంభించినా తర్వాత బిల్లులు ఆగిపోవ డంతో భవనాల పనులు మధ్యలో వదిలేశారు. కూటమి ప్రభుత్వం దృష్టి సారించి సీఎం చంద్ర బాబు,ప్రస్తుత పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ నిర్మాణాలపై దృష్టి పెట్టా లని ప్రజలు కోరుతున్నారు.దీనిపై పర్యాటక శా ఖ డీఈని వివరణ కోరగా భవనానికి కేంద్రం నుంచి నిధులు రావాల్సి ఉందన్నారు. హాస్టల్ భవనాల పనులు త్వరలో ఆరంభిస్తామన్నారు.
అందంగా కట్టారు.. శిథిలస్థితికి చేర్చారు!
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
పర్యాటక శాఖ నిర్లక్ష్యం కారణంగా పలు ప్రా జెక్టులు ముందడుగు పడడంలేదు. నిధు లున్నా నీరసంగా నడుస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికు దురు మండలం ఆదుర్రు బౌద్ధస్థూపం సమీ పంలో నిరుపయోగంగా వదిలేసిన భవనాలు పర్యాటక శాఖ అధికారుల పనితీరుకు అద్దంపడుతున్నాయి.వైనతేయ నదీ తీరాన ఆదుర్రు బౌద్ధ స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే సంకల్పంతో తొమ్మిదేళ్ల కిందట రూ.6 కోట్లతో పర్యాటకుల విడిది భవనాలను నిర్మిం చారు. మడ అడవుల చెంతన ఓ వైపు గోదా వరి మరో వైపు ఆదుర్రు బౌద్ధ స్థూపాలు ఉన్న ప్రాంతంలో వీటిని పర్యాటకశాఖ నిర్మించింది. పాశర్లపూడి నుంచి ఆదుర్రు బౌద్ధ స్థూపానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది. పాశ ర్లపూడి వైపు వైనతేయ వంతెన కింద మరో భవనాన్ని నిర్మించారు.ఇక్కడి నుంచి ఆదుర్రుకు వైనతేయ నదిలో నాలుగు కిలోమీటర్ల మేర ప్రయాణించేందుకు రూ.కోటి పైబడిన వ్యయం తో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఒక బోటు కొనుగోలు చేశారు. పాశర్లపూడి వైపు ఉన్న పర్యాటక భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకిచ్చామని చెబుతున్నా అవి ఉపయోగంలో లేవు. ఆధునిక సౌకర్యాలతో కొనుగోలు చేసిన బోటు ఉపయోగంలో లేదు. ఆదుర్రులో గోదా వరి నది చెంత నుంచి పర్యాటక భవనాలకు చేరుకునేందుకు వీలుగా అందంగా చెక్కలతో నిర్మించిన వంతెన ఇప్పుడు శిథిలస్థితికి చేరింది. ఆ భవనాల్లో తుప్పలు, చెట్లు పెరిగిపోయాయి. రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను గాలికొదిలేయడంపట్ల పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనాలు గాలికొదిలేసిన పర్యాటక అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆరేళ్లకే.. నిండు నూరేళ్లు!
గౌతమి గోదావరి తీరాన నిర్మించిన భవనాలు శిథిలమవుతున్నాయి. కోటిపల్లి రేవు చెంతనే అప్పటి కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి కోటిపల్లి రేవులో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.ఈ భవన నిర్మాణాలకు అప్పటి మంత్రి యనుమల రామకృష్ణుడు 2019 జనవరి 7న ప్రారంభించారు. కోటిపల్లి రేవులో రూ.2.14 కోట్లతో నిర్మించిన రెండు ప్రత్యేక భవనాలు ప్రారంభించి ఆరేళ్లు కావొస్తున్నా వినియోగంలోకి రాలేదు. పర్యాటకంగా అభివృద్ధి చెందితే కోటిపల్లి రేవు తీరప్రాంతం ఎంతో అభివృద్ధి చెందేది. రేవు చెంతనే కోటిఫలీశ్వరస్వామి ఆలయం, దగ్గరలో ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయాలు ఉండడం, రేవులో నిత్యం వందల మంది ప్రయాణించడంతో ఎప్పుడూ ఈ ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టి నిర్మించిన భవనాలు ఉపయోగించకపోవడంతో చెట్లు, తుప్పలు, పిచ్చిమొక్కలు పెరిగి నిరుప యోగంగా మారాయి.
కడియంలో ఎకో నారాయణ?
కడియం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) : పర్యాటక అభి వృద్ధిలో భాగంగా కడియపు లంకలో ఆరం భమైన ఎకో టూరిజం ప్రాజెక్టు అటకెక్కింది. ఎకో టూరిజం భవన నిర్మాణానికి 2014 ఫిబ్రవరి 9న చిరంజీవి స్వయంగా శంకుస్థాపన చేశారు.కేంద్రం రూ.5 కోట్లు మంజూరు చేయ డంతో పనులు కూడా ప్రారంభించారు. ఇక ఈ ప్రాంతానికి టూరిజం శోభ వచ్చేసిందని ఆనందపడే లోపు పునాది దశలోనే ప్రాజెక్టు నిలిచిపోయింది. దశాబ్దకాలంగా ఎక్కడి నిర్మాణాలు అక్కడే ఆగిపోయాయి. గత వైసీపీ ప్రభు త్వంలో ఈ ప్రాజెక్టు వైపు చూసిన వారే కానరాలేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నర్సరీరైతులు కోరుతున్నారు.