AP Fiber Net: ఫైబర్ నెట్లో ఏం జరుగుతోంది!
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:00 AM
ఈ వ్యవహారంలో నిజానిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది.

పంచాయితీపై రంగంలోకి సర్కారు
జీవీ రెడ్డి ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్
మంత్రి జనార్దనరెడ్డితో కార్యదర్శి యువరాజ్, ఎండీ దినేశ్ భేటీ
తన ఆరోపణలకు ఆధారాలతో మంత్రికి వివరణ ఇచ్చిన జీవీ రెడ్డి
అమరావతి, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్‌పై ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన రాజద్రోహం ఆరోపణలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేశాయి. ఈ వ్యవహారంలో నిజానిజాలు రాబట్టేందుకు వీలుగా సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ కుమార్‌లను వ్యక్తిగతంగా వివరణాత్మకంగా ఆధారాలతో కూడిన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరింది. గురువారం నాడుఫైబర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్‌పై సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి చేసిన ఆరోపణలు శుక్రవారంనాడు పత్రికల్లో పతాకస్థాయిలో ప్రచురితం కావడంతో.. ఏం చేయాలో తేల్చుకోలేక ప్రభుత్వ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు. దీంతో.. అసలేం జరుగుతుందనే దానిపై వాస్తవాలను ప్రభుత్వానికి తెలియజేసే బాధ్యతను మంత్రి బీసీ జనార్దనరెడ్డికి అప్పగించారు.
తొలగించినా జీతాలు: జీవీ రెడ్డి
ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే శుక్రవారమే మంత్రి బీసీ జనార్దనరెడ్డి రంగంలోకి దిగారు. ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరపకుండానే నేరుగా మీడియా ముందు ఫైబర్‌నెట్ ఎండీ దినేశ్‌కుమార్ రాజద్రోహం చేసినట్లుగా ఆరోపణలు ఎందుకు చేశారంటూ జీవీ రెడ్డిని మంత్రి అడిగారు. గడచిన కొద్దినెలలుగా దినేశ్‌కుమార్ తనకు సహకరించడం లేదంటూ జీవీ రెడ్డి వివరించారు. తాను మీడియా ముందు మాట్లాడిన ప్రతి మాటకూ ఆధారాలున్నాయని ఆయన మంత్రికి తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో వాట్సప్ మెసేజ్ ఆధారంగానే ఉద్యోగాలు ఇచ్చేశారని జీవీరెడ్డి గుర్తు చేశారు. అసలు నియామక పత్రాలు లేని 410 మందిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలూ లేనప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చాక తొమ్మిది నెలలుగా వారిని కొనసాగిస్తూనే జీతభత్యాలు చెల్లిస్తున్నారని ఎండీపై జీవీ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో ఇన్‌కమ్‌టాక్స్, జీఎస్టీ అంశాలపైనా జీవిరెడ్డి తన వాదనలు వినిపించారు. తాను ఇప్పటికే.. తన వాదనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మౌలిక సదుపాయాల కార్యదర్శి యువరాజ్‌కు వెల్లడించానని జీవీ రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. ఫైబర్‌నెట్ ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఎండీ దినేశ్‌కుమార్‌ను బదిలీ చేయాలని మంత్రికి సూచించారు. వీటన్నింటిపై ఆధారాలతో కూడిన సంజాయిషీని ఇవ్వాలని జీవీ రెడ్డిని మంత్రి జనార్దనరెడ్డి కోరారు. దీంతో.. జీవీ రెడ్డి తన వద్దనున్న ఆధారాలతో కూడిన నివేదికను శుక్రవారం మధ్యాహ్నానికి మంత్రికి అందజేశారు.
జీఎస్టీ వ్యవహారాలు కన్సల్టెన్సీ పనే: దినేశ్
శుక్రవారం మధ్యాహ్నం వెలగపూడిలోని సచివాయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని ఫైబర్ నెట్ ఎండీ దినేశ్ కుమార్ కలిశారు. ఈ సమావేశానికి ఐఅండ్‌ఐ కార్యదర్శి యువరాజ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీకూ, చైర్మన్‌కు మధ్య విబేధాలు ఎందుకు వస్తున్నాయని దినేశ్ కుమార్‌ను మంత్రి ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖలలోని కీలకమైనవారే మీడియా ఎదుటకు వచ్చి రచ్చచేస్తే ప్రభుత్వ ప్రతిష్ఠ ఏం కావాలని అడిగారు. దీనిపై దినేశ్‌కుమార్ తన వాదనలు వినిపించారు. గతంలో జీఎస్టీ వ్యవహారాలు చూస్తున్న కన్సల్టెన్సీ సంస్థ ఫీజును తీసుకుంటున్నందున.. సకాలంలో చెల్లింపులు జరిగేలా చూసే బాధ్యత ఆ సంస్థదేనని దినేశ్‌కుమార్ వివరించారు. ఆదాయపు పన్ను విషయంలోనూ ఇదే వర్తిస్తుందని దినేశ్‌కుమార్ వెల్లడించారు. ఆయన వాదన విన్నాక.. ఈ అంశాలన్నింటిని లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా.. సంజాయిషీని ఇవ్వాలని దినేశ్ కుమార్‌ను మంత్రి ఆదేశించారు. శనివారం నాటికి సంజాయిషీని అందజేస్తానని మంత్రికి దినేశ్‌కుమార్ చెప్పారు.
ప్రభుత్వానికి తలనొప్పిగా ‘ఫైబర్’ లడాయి
ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు చేయకుండా నేరుగా దినేశ్‌కుమార్‌పై సంస్థ చైర్మన్ జీవీరెడ్డి మీడియా సమక్షంలో తీవ్ర ఆరోపణలకు దిగడంపై ఇటు రాజకీయవర్గాల్లోనూ.. అటు ఆలిండియా సర్వీసు వర్గాల్లోనూ బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ కార్యానిర్వాహక అధికారాలను గుంజుకునేందుకు చైర్మన్లు ప్రయత్నిస్తే ఎలా ఆమోదిస్తామంటూ కార్పొరేషన్ల ఎండీలు కొందరు ప్రశ్నిస్తున్నారు. అంతగా కావాలనుకుంటే ఎండీలుగా ఐఏఎస్‌లను కాకుండా.. రాజకీయ నేతలనే ప్రభుత్వం నియమించుకోవచ్చు కదా అంటూ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో తామేమీ కార్యనిర్వహణాధికారాలను కోరుకోవడం లేదని.. చైర్మ న్లు చెబుతున్నారు. ఈ తరుణంలో.. గురువారం నాడు ఫైబర్‌నెట్ ఎండీపై చైర్మన్ తీవ్రమైన ఆరోపణలు చేయడంతో.. ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగారు. ఇలాంటివాటికి పరిష్కారం చూపేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవి కూడా చదవండి..
మహిళలకు బ్యాడ్ న్యూస్.. బంగారం ధర ఎంతకు చేరిందంటే..
భారత్‌లో నియామకాలు ప్రారంభించిన టెస్లా
Read Latest AP News And Telugu News