Environmental Damage : నదులు.. విలవిల!
ABN , Publish Date - Mar 24 , 2025 | 03:47 AM
నదీ తీరాలు.. మానవ నాగరికతకు పునాదులు. ఆదిమ మానవుడు వ్యవసాయం నేర్చుకుని ఆధునికత దిశగా అడుగులు వేయడానికి బాటలు వేసిన జలజీవధారలు.

వ్యర్థాలు, మురుగునీటితో జలాలు కలుషితం.. సిక్కోలు నుంచి ‘అనంత’ వరకు ఇదే దుస్థితి
కాలుష్య కోరల్లో గోదావరి, కృష్ణా, తుంగభద్ర
గ్రామాలు, కాలనీల నుంచి మురుగు నదుల్లోకి
శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్ లెట్ల నుంచి విడుదల
పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలూ కలుషితం
ఇటీవల విజయనగరంలో డయేరియా కేసులు
ఇతర ప్రాంతాల్లోనూ పొంచిఉన్న రోగాల ముప్పు
జవసత్వాలను జలాలు మనకందిస్తే, ముందుచూపు లేని విధానాలతో మనం వాటిని హాలాహలంగా మార్చేశాం. మానవ స్వార్థం డ్రైనేజీగా మారి నదుల్లోకి పొంగి పొర్లుతోంది. కొండల్లో హోరెత్తే ప్రవాహాలకు జనావాసాల్లో సంకెళ్లు పడుతున్నాయి. అడ్డుపడే చెత్తాచెదారంలో చిక్కుకుపోతున్నాయి. దీంతో కలుషిత నీరే దిక్కైన జనాలను అంటువ్యాధులు కాటేస్తున్నాయి. నీటి తావులు కాలుష్య కాసారాలుగా మారుతున్న తీరుపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
నదీ తీరాలు.. మానవ నాగరికతకు పునాదులు. ఆదిమ మానవుడు వ్యవసాయం నేర్చుకుని ఆధునికత దిశగా అడుగులు వేయడానికి బాటలు వేసిన జలజీవధారలు. మన పూర్వీకుల నుంచి నదీమ తల్లులను దేవతామూర్తులుగా భావించి పూజించడం భారతీయ సంస్కృతి. అంతటి విశిష్ఠత ఉన్న నదులను.. నేడు చెత్తబుట్టల్లా మార్చేస్తున్నారు. తాగు, సాగునీటితో పాటు విద్యుత్ కాంతులు అందిస్తున్న నదులను కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారు. టన్నుల కొద్దీ వ్యర్థాలను కుమ్మరిస్తున్నారు. ఇళ్లు, గ్రామాలు, కాలనీల నుంచి మురుగునీటిని నేరుగా నదుల్లో కలిపేస్తున్నారు. పలు పట్టణాలు, నగరాల్లో ప్లాంట్లలో శుద్ధి చేయకుండా డ్రైనేజీ అవుట్ లెట్లు నదుల్లోకి కలిపేశారు. మన రాష్ట్రంలో వంశధార నుంచి గోదావరి, కృష్ణా, తుంగభద్ర.. ఇటు చివరన చిత్రావతి వరకు నదులన్నింటినీ కలుషితం చేసేస్తున్నారు. డ్రైనేజీలలో ప్రవహించే నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేశాక సాగు, ఇతర అవసరాలకు వినియోగించాలి. కానీ చాలా చోట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయలేదు. ఉన్నవి కూడా నామమాత్రంగా పనిచేస్తున్నాయి.
మురుగునీటిని నేరుగా నదుల్లోకి వదిలేస్తున్నారు. ఫలితంగా తాగే నీరు, కాలువల ద్వారా పంటలకు అందించే సాగు నీరు విషతుల్యంగా మారుతున్నాయి. కొన్నిచోట్ల తాగడానికి కాదు కదా కనీసం స్నానం చేయడానికి కూడా పనికి రాని పరిస్థితి. చాలా చోట్ల నదీ పరివాహక గ్రామాల్లోని భూగర్భ జలాలూ కలుషితమవుతున్నాయి. కొన్నిచోట్ల బోర్లు, బావుల్లో నీరు ఉప్పగా మారుతోంది. నాడు మానవ నాగరికతకు దోహదపడ్డ నదులు నేడు తన సహజ స్వరూపాన్ని కోల్పోయి వ్యర్థాలు, మురుగుతో నిండిపోయాయి. ప్రజల బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం, నాయకుల అలసత్వమే ఇందుకు కారణం. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఈ పరిస్థితి మారకపోతే ‘భవిష్యత్’ మరింత దారుణంగా ఉండే ప్రమాదముంది. రాష్ట్రంలోని నదుల దుస్థితిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.
కాలుష్య కృష్ణా!
పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవనాధారం... ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల దాహార్తిని తీరుస్తున్న కృష్ణా నది కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వ హయాంలో స్వచ్ఛ కృష్ణా కార్యక్రమానికి పిలుపునివ్వటంతో.. చాలావరకు నదీ కాలుష్యాన్ని అరికట్టారు. అయితే మేజర్ గ్రామ పంచాయతీల అలసత్వం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్వాకం కారణంగా పలుచోట్ల మురుగునీరు కృష్ణా నదిలో కలుస్తోంది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర భారీ అవుట్ ఫాల్ డ్రెయిన్ నేరుగా నదిలో కలుస్తోంది. ఈ డ్రెయిన్ క్యాచ్‌మెంట్ పరిధిలో ఉన్న పశ్చిమ ఇబ్రహీంపట్నం, ఫెర్రీ డౌన్ ఏరియా, ఆర్టీసీ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరంతా కూడా కృష్ణా నదిలో కలుస్తోంది. తుమ్మలపాలెం దగ్గర మరో మైనర్ డ్రెయిన్ నుంచి మురుగునీరు నేరుగా కృష్ణా నదిలోకి కలుస్తోంది. ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాలలో విజయవాడ నగర పరిధిలో రెండు చోట్ల అవుట్ ఫాల్ డ్రైనేజీల నుంచి నేరుగా కృష్ణానదిలోకి కలుస్తోంది. రాణిగారితోటలో మురుగునీటితో పాటు చెత్త కూడా కొట్టుకువస్తూ కృష్ణానదిలో కలుస్తుంది.
విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, బెంజ్ సర్కిల్ ఏరియా, ఎన్టీఆర్ సర్కిల్ ఏరియాల నుంచి వచ్చే మురుగునీరు కృష్ణవేణి రోడ్డు మీదుగా పటమట దర్శిపేట, అంబేడ్కర్ నగర్‌ల మీదుగా కృష్ణా నదిలో కలుస్తోంది. విజయవాడ నగరంలో కాల్వ గట్లపై ఉన్న ఇళ్లలో మరుగుదొడ్లలోని వ్యర్థాలు నేరుగా కాల్వలలోకి వదులుతున్నారు. నగరంలోని బందరు కాల్వ, ఏలూరు కాల్వలపై ఇలాంటి పరిస్థితి ఉంది. ఇదే నీటిని దిగువ ప్రాంతాల వారికి తాగునీటి కోసం చెరువులను నింపుతారు.
మురుగునీరే తాగునీరు
ఏలూరు నగరానికి ప్రధాన తాగునీటి వనరు గోదావరి, కృష్ణా కాల్వలు. ఈ కాల్వల్లో నీటిని తాగునీటిగా మార్చి సరఫరా చేస్తున్నారు. ఈ కాల్వలను ఎప్పుడూ శుభ్రం చేయరు. పిచ్చి మొక్కలు, నాచు, తూడుతో నీళ్లన్నీ దుర్వాసన వెదజల్లుతుంటాయి. ఈ కాల్వల్లోనే ప్రజలు చెత్తా చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు, హోటళ్ల యజమానులు కుళ్లిన వ్యర్థాలన్నీ విసిరేస్తుంటారు. పందులు, కుక్కలు, ఇతర జంతువుల కళేబరాలు కొట్టుకొస్తుంటాయి. ఈ నీటిని శుద్ధి చేయడానికి మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏలూరులో నిర్మించలేదు. ముఖ్యంగా కృష్ణా కాల్వ నుంచి ఏలూరు పంపుల చెరువు నింపుతారు. మున్సిపల్ అధికారులు క్లోరిన్, ఫిల్టర్ బెడ్స్ ద్వారా శుద్ధి చేసి మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తుంటారు. ఇది సురక్షితం కాదు. దీంతో ఏలూరు నగర ప్రజలు తరచూ అనారోగ్యాల పాలవుతున్నారు. నాలుగేళ్ల క్రితం వింత వ్యాధితో ఎంతో మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి కారణం శుద్ధి చేయని నీరేనని కొన్ని జాతీయ ప్రయోగశాలలు నివేదికలు ఇచ్చాయి. అయినా నగర పాలక సంస్థ అధికారులు... కాల్వల్లో వ్యర్థాలు వేయవద్దని చాటింపులు వేయడం, బోర్డులు పెట్టడం మినహా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దెందులూరు వద్ద 117 ఎకరాల్లో తాగునీటిని అందించేందుకు చెరువును తవ్వారు. ఈ రెండు ట్యాంకుల ద్వారా నగరంలోని మూడు లక్షల మంది జనాభాకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దశాబ్దాల తరబడి ప్రజలు తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నారు.
నదిలోకి డ్రైనేజీ అవుట్ లెట్లు
అనకాపల్లి, కాకినాడ జిల్లాల సరిహద్దున తాండవ నది పరిస్థితి ఇది. ఇటు పాయకరావుపేట పంచాయతీ, అటు తుని మునిసిపాలిటీ డ్రైనేజీల అవుట్ లెట్లు ఏర్పాటు చేయడంతో కలుషితమవుతోంది. ఆ నీరు ఇంకి భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. పాయకరావుపేట, తుని నియోజకవర్గాల్లో సుమారు 18 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్న లక్ష్యంతో 2009లో పాయకరావుపేట వద్ద తాండవ నదిపై ఆనకట్టలు నిర్మించారు. పాయకరావుపేట పంచాయతీ, తుని మునిసిపాలిటీల మురుగు కాలువల అవుట్ లెట్లు ఎక్కడికక్కడ నదిలోకి పెట్టడంతో ఆనకట్టల మధ్య స్టోరేజీ ఏరియాలో ఉన్న నీరు మురికిగా మారుతోంది. దీనికితోడు ఈ రెండు పట్టణాల ప్రజలు చెత్తను నదిలో పారేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లో బోర్లు, బావుల్లో నీరు ఉప్పగా మారుతోంది.
గోదారంతా అపవిత్రం!
తూర్పుగోదావరి జిల్లాలో చారిత్రక రాజమహేంద్రవరంలో పవిత్ర గోదావరి తీరం అపవిత్రమవుతోంది. నగరంలో చెత్తంతా తీసుకొచ్చి గోదావరిలో పడేస్తున్నారు. అలాగే నగరంలోని మురుగునీరు గోదావరి నదిలో కలుస్తోంది. అదే గోదావరి నీటిని ప్రజలు తాగుతున్నారు. లక్షల మంది జీవించే రాజమహేంద్రవరంలో వాడకపు నీటిని పంపించడానికి ఏళ్ల తరబడి చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. అధికశాతం మురుగునీరు నల్లా చానల్ గుండా నేరుగా గోదావరిలో కలిసేది. అయితే ప్రస్తుతం గేట్లు మూసేసి ఈ చానల్‌లో నీటిని ఆవలో ఉన్న ఎస్‌టీపీకి పంపిస్తున్నారు. అక్కడ నామమాత్రంగా శుద్ధి అవుతోంది. మురుగునీరు ఆవ చానల్ గుండా ధవళేశ్వరం సాయిబాబా గుడి సమీపంలో గోదావరిలో కలుస్తోంది. దీనివల్ల కాలువలకు వెళ్లే నీరు కలుషితం అవుతోంది. రాజమహేంద్రవరంలో నల్లా చానల్‌తో పాటు పుష్కరఘాట్ సమీపంలోనూ, మార్కండేయ స్వామి గుడి సమీపంలోనూ అవుట్ లెట్లు గోదావరిలోకే ఉన్నాయి. కోటిలింగాల ఘాట్ వద్ద కూడా ఒకటి ఉంది. దీంతో మొత్తం గోదావరి ఘాట్లన్నీ మురుకుగా మారుతున్నాయి. పేపరు మిల్లు వ్యర్థాలు ఎగువ భాగంలోని వెంకటనగర్ లంక భూముల్లో పంపింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి చాలా మురుగునీరు వస్తుంటుంది.