Share News

దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:40 AM

వారసుడు పుట్టాడని ఆనందంగా దైవ దర్శనానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఉసురు తీసింది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలుజేసింది. ఈ హృదయ విదారక ఘటన అవనిగడ్డ మండలం పులిగడ్డ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది.

దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు..

- పులిగడ్డలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న కారు

- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

- మరో ఇద్దరికి తీవ్ర గాయాలు..ఆస్పత్రికి తరలింపు

- మృతులది గుంటూరు జిల్లా తెనాలిగా గుర్తింపు

వారసుడు పుట్టాడని ఆనందంగా దైవ దర్శనానికి బయలుదేరిన ఓ కుటుంబాన్ని మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురి ఉసురు తీసింది. మరో ఇద్దరిని తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలుజేసింది. ఈ హృదయ విదారక ఘటన అవనిగడ్డ మండలం పులిగడ్డ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది.

అవనిగడ్డ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి):

హైదరాబాద్‌లోని ఐటీసీ(ఇండియా టొబాకో కంపెనీ) ఉద్యోగిగా పని చేస్తున్న గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన గిడుగు సందీప్‌కు రెండు నెలల క్రితం కుమారుడు పుట్టగా, మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భార్య, కుమారుడు, కుమార్తె, తల్లిదండ్రులతో కలసి ఆల్టో కారులో సోమవారం మోపిదేవికి బయలుదేరారు. పులిగడ్డ - పెనుమూడి వారధి, టోల్‌ గేట్ల నడుమ కాకినాడ నుంచి పామాయిల్‌ లోడుతో ఎదురుగా వస్తున్న లారీని కారు రాంగ్‌ రూట్‌లో వెళ్లి ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ముందు సీటులో ఉన్న సందీప్‌ తండ్రి జి.ఆర్‌.మోహన్‌బాబు(60), వెనుక కూర్చున్న తల్లి అరుణ (55) అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీటులో ఉన్న సందీప్‌ భార్య పల్లవి, కుమార్తె సాత్విక(5), తల్లి ఒడిలో ఉన్న షణ్ముఖ్‌(2 నెలలు), డ్రైవింగ్‌ సీటులో ఉన్న సందీప్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారుకు ఇరుక్కుపోయిన మోహన్‌బాబు, అరుణ మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన సాత్విక, సందీప్‌, పల్లవిలను అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

కారు సీటు వెనుక పసికందు

క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించటం పూర్తయిందని భావించిన పోలీసులు ప్రమాద స్థలం నుంచి కారును వెనక్కి తీయగా, కారులో సీటు వెనుక పడిన రెండు నెలల పసికందు కనిపించింది. వెంటనే అప్రమత్తమైన అవనిగడ్డ సీఐ యువకుమార్‌, ఎస్‌ఐ శ్రీనివాస్‌ హుటాహుటిన అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రికి పసికందును తీసుకొచ్చారు. అయితే అప్పటికే ప్రమాదం జరిగి అరగంట కావడంతో పసికందును కాపాడేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్రంగా గాయపడిన స్వాతికకు రెండు మార్లు వైద్యులు సీపీఆర్‌ చేశారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో బెలూన్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తూ మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మార్గమధ్యలోనే సాత్విక మృతి చెందింది. సందీప్‌ భార్య పల్లవి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను, కాలు, పక్కటెముకలకు తీవ్ర గాయాలైన సందీప్‌ను కూడా మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నా వాళ్లు ఎక్కడ?

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సందీప్‌ షాక్‌లోకి వెళ్లిపోయాడు. కొద్దిసేపు తానెవరు, ఎక్కడి నుంచి వస్తుంది కూడా చెప్పలేకపోయిన సందీప్‌ కొద్దిసేపటి తర్వాత తాము గుంటూరు జిల్లా తెనాలి నుంచి వచ్చినట్లుగా పోలీసులకు తెలిపారు. నాకేమైంది.. ఇక్కడెందుకు ఉన్నాను.. నా వాళ్లు ఎక్కడ అంటూ సందీప్‌ పోలీసులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు, వైద్య సిబ్బంది తల్లిదండ్రులు, కుమార్తె, కుమారుడు మరణించారని సమాధానం చెప్పలేక కంటతడి పెట్టుకున్నారు. సందీప్‌ ఫోన్‌కు తెలిసిన వారి నుంచి ఫోన్‌ రావడంతో వారు తెనాలి చెంచుపేటకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వెంటనే వారి బంధువులను అవనిగడ్డ రావాల్సిందిగా సూచించారు. అవనిగడ్డ ఏరియా ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ సుమన్‌, డాక్టర్‌ నాగమణిలు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స చేసి మచిలీపట్నం తరలించారు. జి.ఆర్‌.మోహన్‌బాబు, అరుణ, షణుఖ్‌ మృతదేహాలను అవనిగడ్డ మార్చురీకి తరలించగా, మచిలీపట్నం వెళ్తూ మార్గమధ్యలో మృతి చెందిన సాత్విక మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.

Updated Date - Apr 01 , 2025 | 12:40 AM