Share News

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:37 PM

Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana: శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయం ఇవాళ హాట్ హాట్‌గా సాగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన పలు పథకాలపై ఇద్దరు నేతలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు.

TDP VS YSRCP: శాసనమండలిలో బొత్స సత్యనారాయణకు అచ్చెన్నాయుడు కౌంటర్
Kinjarapu Atchannaidu vs Botsa Satyanarayana

అమరావతి: శాసనమండలిలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు( Kinjarapu Atchannaidu) వర్సెస్ మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను నాశనం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు తీసుకువచ్చామని అచ్చెన్నాయుడు తెలిపారు. గాలి వచ్చినా గాలి రాకపోయినా తాను ప్రజా జీవితంలోనే ఉన్నానని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చ పెట్టాలని బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే, మంత్రి అయ్యావ్... ఇంకా ఏం లేదు అవ్వడానికి అని అచ్చెన్నాయుడును ఉద్దేశించి బొత్స సత్యనారాయణ విమర్శించారు.


2014 నుంచి 2019 మధ్యలో ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద పేదలకు ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇచ్చిందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని మండిపడ్డారు. కట్టిన ఇళ్లకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. జగనన్న కాలనీలు అన్నారు.. దాని గురించి తాను ఏమీ మాట్లాడాల్సిన పనిలేదు.. ఏం జరిగిందో అందరికీ తెలుసునని అన్నారు. కేంద్రం డబ్బులతోనే కథ నడిపారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు. తాము పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. వైసీపీ హయాంలో ఎంత ఖర్చు చేశారో సమాధానం చెప్పాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.


మిర్చి రైతులపై వైసీపీ సభ్యులు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై ఇవాళ(సోమవారం) చర్చ ప్రారంభమైంది. వివిధ కేటాయింపులు, సంక్షేమానికి నిధుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. వైసీపీ హయాంలో గుంటూరు మిర్చి యార్డు అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుంటూరు మిర్చి యార్డులో జరిగిన అవినీతిపై విచారణ చేశామని అన్నారు. మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు, తాను సమీక్ష చేశానని అన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని 5 గంటలసేపు సీఎం చంద్రబాబు చర్చించారు. మిర్చి ధరలపై ఎగుమతిదారులు, మిర్చి రైతులతో సీఎం చంద్రబాబు చర్చించారని అన్నారు. మిర్చి రైతులకు లాభం రావాలని కేంద్ర వ్యవసాయమంత్రితో సీఎం చంద్రబాబు మాట్లాడారని గుర్తుచేశారు. మార్కెట్‍లో మిర్చికి రూ.11,500 ఉంటే రూ.7,500కే కొనాలని వైసీపీ జీవో ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.


బిల్లులు ఇవ్వలేదనడం అవాస్తవం: బొత్స సత్యనారాయణ

botcha.jpg

2014 నుంచి 2019 వరకు టీడీపీ హయాంలో ఇళ్లు కట్టిన వారికి వైసీపీ ప్రభుత్వ హయంలో బిల్లులు ఇవ్వలేదని మాట్లాడటం అవాస్తవమని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ బిల్లులు ఇచ్చామని గుర్తుచేశారు. అర్హత లేకుండా ఇళ్లు కట్టుకుని బిల్లులు కావాలని పట్టుబట్టిన వారికి మాత్రమే తాము ఇవ్వలేదని చెప్పారు. కూటమి నేతలు కేవలం రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం రాజకీయ కక్ష్యలతో ఇవ్వలేదని చెప్పటం సరికాదన్నారు. వైసీపీ ప్రభుత్వం అర్హులైన ప్రతీ ఒక్కరికీ అన్నీ పథకాలు ఇచ్చిందని తెలిపారు. వైసీపీ నేతలకే పనులు, పథకాలు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పలేదని బొత్స సత్యనారాయణ అన్నారు.


రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న చంద్రబాబు గత ప్రభుత్వ పథకాలపై చేసిన వ్యాఖ్యలు సరికాదని బొత్స సత్యనారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు మాట్లాడిన మాటలకు సిగ్గుపడాలన్నారు. లబ్ధిదారులకు పార్టీలు అంట గడతారా అని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు ఇవ్వాల్సిన భాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉందని బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రమాణం చేసి పదవులు తీసుకున్న వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడతారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కేవలం వైసీపీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు ఇవ్వమనటానికి ఇదేమైనా టీడీపీ సొంత ఆస్తా అని నిలదీశారు. తమ ప్రభుత్వంలో గత ఐదేళ్లలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ పథకాలు ఇచ్చామని బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. అనంతరం మిర్చి రైతుల సమస్యలపై కౌన్సిల్‌లో వాయిదా తీర్మానాన్ని వైసీపీ ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. వెల్‌లోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాదులో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు..

జీఎంసీ బాలయోగికి మంత్రి లోకేష్ నివాళి

జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 03 , 2025 | 01:46 PM