'Blasting' effected to people వారి గుండెల్లో ‘బ్లాస్టింగ్’
ABN , Publish Date - Mar 18 , 2025 | 11:54 PM
'Blasting' effected to people ‘మీ ఊరు దగ్గరలో క్వారీ వస్తుంది.. మీకు ఇబ్బందేమీ ఉండదు.. పెద్దగా శబ్దాలు రావు.. మీ ఆరోగ్యానికి కాని, పంటలకు కానీ ఎలాంటి సమస్య రాదు’ అంటూ అధికారులు చెప్పడంతో క్వారీకి అనుమతించామని, తీరా క్వారీ ప్రారంభించాక నరకం చూస్తున్నామని ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ గోడు విని క్వారీ మూయించకపోతే తమ ప్రాణాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి గుండెల్లో ‘బ్లాస్టింగ్’
నరకం చూస్తున్నామంటున్న ధర్మవరం ప్రజలు
భారీ పేలుళ్లతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన
క్వారీ వాహనం అడ్డగింత.. మూసేయాలని నిరసన
సీఎంకు ఫిర్యాదు చేస్తామన్న స్థానిక యువకులు
‘మీ ఊరు దగ్గరలో క్వారీ వస్తుంది.. మీకు ఇబ్బందేమీ ఉండదు.. పెద్దగా శబ్దాలు రావు.. మీ ఆరోగ్యానికి కాని, పంటలకు కానీ ఎలాంటి సమస్య రాదు’ అంటూ అధికారులు చెప్పడంతో క్వారీకి అనుమతించామని, తీరా క్వారీ ప్రారంభించాక నరకం చూస్తున్నామని ఎస్.కోట మండలం ధర్మవరం గ్రామస్థులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ గోడు విని క్వారీ మూయించకపోతే తమ ప్రాణాలు పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్నాళ్లుగా క్వారీ నిర్వహణ తీరుపై అనేక అనుమానాలతో రగిలిపోతున్న వారు మంగళవారం క్వారీ వద్దకు చేరుకుని పేలుడు పదార్థాలను తీసుకొచ్చిన వాహనాన్ని అడ్డుకున్నారు. విలేకరుల వద్ద తమ ఇబ్బందులను వివరిస్తూ కన్నీరు పెట్టారు.
శృంగవరపుకోట రూరల్, మార్చి 18(ఆంధ్రజ్యోతి):
క్వారీ అంటేనే ధర్మవరం ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అక్కడి క్వారీ నుంచి ప్రతిరోజూ వింటున్న శబ్దాలకు వణుకుతున్నారు. ప్రాణాలపై ఆశ వదులుకున్నామని కొందరు చెప్పడాన్ని చూస్తుంటే వారు ఏ స్థాయిలో ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. క్వారీ నిర్వహణ తీరుపైనా వారికి అనేక అనుమానాలు ఉన్నాయి. అక్కడ చిన్నపాటి బ్లాస్టింగ్‌లు చేయాల్సి ఉంది. కానీ 90అడుగుల మేర గోతులు తవ్వి రిగ్‌బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీనివల్ల ఇళ్లు దెబ్బతింటున్నాయని, పంట పొలాల్లో దిగుబడి పడిపోయిందని చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధుల్లో తరచూ అనారోగ్య సమస్యలు వస్తున్నాయనేది మరో ఆవేదన. పేలుళ్లలో నిషేధిత జిలెటిన్‌స్టిక్ వాడుతున్నట్లు వారికి అనుమానాలున్నాయి. కాగా క్వారీ ఏర్పాటుకు ముందు గ్రామంలో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టినప్పుడు డీఆర్‌వో, పొల్యూషన్ కంట్రోల్ ఉన్నతాధికారులు వచ్చి గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్వారీయింగ్ చేస్తారని హామీ ఇచ్చారు. క్వారీకి చుట్టుపక్కల ప్రాంతాల్లో చెట్లు పెంపకం, వైద్య శిబిరాలు చేపడ్తారని, పాఠశాలల ఆభివృద్ధికి క్వారీ నిర్వాహకులు సహకారం అందిస్తారని చెప్పారు. క్వారీ ఏర్పాటు చేశాక అలాంటిదేమీ లేదని స్థానికులు చెబుతున్నారు. కొన్ని నెలలుగా గ్రామస్థులంతా క్వారీపై గుర్రుగా ఉన్నారు. దీనినుంచి బయట పడడం ఎలా అని తరచూ చర్చించుకుంటున్నారు. స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎవరూ పట్టించుకోవడం లేదన్న నిర్వేదంలో ఉన్న వారికి కడుపు మండింది. తేడోపేడో తేల్చుకోవాలని మంగళవారం క్వారీకి వద్దకు వెళ్లారు. క్వారీ వద్దంటూ ఆందోళన చేశారు. అదే సమయంలో పేలుడు పదార్థాలు తీసుకొచ్చిన వ్యాన్‌ను అడ్డుకున్నారు. విలేకరులకూ సమాచారం ఇవ్వడంతో మీడియా బృందం వచ్చాక తమ బాధలన్నీ వివరించారు.
- సర్పంచ్ గాలి సన్యాసయ్య, వీఆర్‌వో సుధీర్‌లను కూడా తీసుకొచ్చి అక్కడ జరుగుతున్న తవ్వకాల తీరును చూపించారు. క్వారీ ఏర్పాటుచేసిన దగ్గర్నుంచి తమకు కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు. చిన్నగా బ్లాస్టింగ్‌లు చేయాల్సి ఉండగా లారీని తీసుకొచ్చి 90అడుగుల మేర గోతులు తవ్వి రిగ్‌బ్లాస్టింగ్ చేస్తున్నారని, దీనివల్ల రోజూ ఇళ్లగోడలు అదురుతున్నాయని, పొలాలు బీడువారుతున్నాయని విన్నవించారు. తాము పొలాల్లో, చెరువుల్లో ఉపాధి పనులు చేసే సమయంలో ఎటువంటి హెచ్చరికలు లేకుండా పేలుళ్లు చేపడుతున్నారని, దీంతో ఆ రాళ్లు తమపై పడతాయేమోనన్న భయంతో పరుగులు తీస్తుంటామని చెప్పారు.
- గ్రామ యువకులు మాట్లాడుతూ ట్రాక్టర్ కంపర్షన్‌తో క్వారీలో గోతులు తీసి పేళుడు చేపట్టాల్సి ఉండగా ఈ యాజమాని అత్యాశతో ఏకంగా లారీలతో రిగ్‌బ్లాస్టింగ్ చేస్తూ ఎక్కువ రాయి తీస్తున్నాడని, ఇది సరికాదని చెబితే తమను తిరిగి బెదిరిస్తున్నాడని వాపోయారు. పేలుళ్లలో నిషేధిత జిలెటిన్‌స్టిక్ వాడుతున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. ఫిర్యాదు చేసినా జిల్లా మైన్స్ అధికారులు కనీసం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
- నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్న క్వారీని రద్దుచేయాలని, లేనిపక్షంలో తమ సమస్యపై ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రికి లేఖలు రాస్తామని స్థానికులు హెచ్చరించారు. ఇక్కడి పరిస్థితిపై వీఆర్‌వో సుధీర్ మాట్లాడుతూ పేలుడు పదార్థాలు ఎక్కడ నుంచి వచ్చాయో విచారణ నిర్వహిస్తామని, ఈ వాహనం పోలీసులకు అప్పగిస్తామని తెలిపారు. సర్పంచ్ మాట్లాడుతూ క్వారీ నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.