Tumma Vijayakumar Reddy: నా ముందువాళ్లు చేసిందే నేనూ చేశా
ABN , Publish Date - Apr 04 , 2025 | 06:20 AM
ఏసీబీ అధికారులు వైసీపీ ప్రభుత్వ ప్రకటనల రూపంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన విషయంపై ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిని విచారించారు. అతను 839 కోట్ల రూపాయల వివాదంపై విచారణకు సమాధానాలు ఇచ్చి, తదుపరి విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించారు

నాది తప్పయితే వారిదీ తప్పే
రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా మాతృసంస్థకు తిరిగి వెళ్లే హక్కు నాకుంది
ఏసీబీకి తుమ్మా విజయకుమార్‌రెడ్డి జవాబు
రెండో రోజూ సుదీర్ఘంగా విచారణ
నేడు కూడా హాజరు కావాలని నోటీసులు!
గుంటూరు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): జగన్ మీడియాకు, వైసీపీ కూలి మీడియాకు రూ.వందల కోట్లను ప్రభుత్వ ప్రకటనల రూపంలో దోచిపెట్టిన వ్యవహారంపై సమాచార, పౌరసంబంధాల (ఐ అండ్ పీఆర్) మాజీ కమిషనర్ తుమ్మా విజయ్‌కుమార్‌రెడ్డిని ఏసీబీ అధికారులు వరుసగా రెండో రోజు కూడా సుదీర్ఘంగా విచారించారు. బుధవారం 8 గంటలకుపైనే ఆయన్ను ప్రశ్నించగా.. గురువారం కూడా అదే పరిస్థితి. ఉదయం 10.15 గంటలకు ఆయన ఏసీబీ కార్యాలయానికి రాగా.. గుంటూరు ఏసీబీ అదనపు ఎస్పీ మత్తె మహేంద్ర సారథ్యంలో రాత్రి 7 గంటల వరకు విచారణ కొనసాగింది. రూ.839 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం వ్యవహారంలో పలు ప్రశ్నలకు దాటవేత ధోరణిలోనే ఆయన జవాబులిచ్చినట్లు సమాచారం. ఏబీసీ నిబంధనలకు విరుద్థంగా పక్షపాత ధోరణితో ప్రజాధనాన్ని ప్రకటనల రూపంలో జగన్ మీడియాకు, వైసీపీ ప్రభుత్వ అనుకూల మీడియాకు దోచిపెట్టడం తప్పు కాదా అని ఏసీబీ అధికారులు అడిగారు. ‘నాకంటే ముందు పని చేసిన ముగ్గురు సీనియర్ అధికారులు ఏం చేశారో నేను కూడా అదే చేశా. 2014 నుంచి వారు ఎలా చేస్తే నేనూ అలాగే చేశా. వారిది తప్పయితే నాది కూడా తప్పే. అసలు అలా చేయడం తప్పని నాకు తెలియదు’ అని ఆయన చెప్పడంతో ఏసీబీ అధికారులు విస్మయానికి గురయ్యారు.
ఐ అండ్ పీఆర్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ.. ప్రభుత్వం మారిన వెంటనే ఎటువంటి అనుమతి లేకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా, ఆయా రికార్డులు ప్రభుత్వానికి అప్పజెప్పకుండా నేరుగా కేంద్ర (మాతృ) సర్వీసులకు ఎలా వెళ్తారని ప్రశ్నించగా.. ఆ విధంగా వెళ్లే హక్కు తనకుందని ఏమాత్రం తడబాటు లేకుండా ఆయన సమాధానమిచ్చినట్లు తెలిసింది. మూడోరోజు శుక్రవారం కూడా విచారణకు రావాలని ఏసీబీ అధికారులు ఆయనకు చెప్పారు. అయితే వ్యక్తిగత పనులు ఉన్నాయని, తదుపరి విచారణకు కొంత సమయమివ్వాలని ఆయన కోరగా.. వారు అంగీకరించలేదని తెలిసింది. ఇప్పటికే ఈ కేసు విచారణలో చాలా జాప్యం జరిగిందని, ఇక ఏమాత్రం ఆలస్యం చేసే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. అనంతరం శుక్రవారం హాజరు కావాలని ఆయనకు వారు నోటీసులిచ్చినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి
కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త
Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో
Read Latest AP News And Telugu News