Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. ఎప్పటి నుంచంటే
ABN , Publish Date - Apr 03 , 2025 | 12:06 PM
రెండు తెగల మధ్య రేగిన విబేధాల కారణంగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో అల్లర్లు చెలరేగాయి. పరిస్థితిని అందుపులోకి తీసుకువచ్చేందుకు.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. గత కొద్ది నెలలుగా పరిస్థితి సద్దుమణిగినట్లే ఉంది. ఈ క్రమంలో తాజాగా మరోసారి మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ వివరాలు..

న్యూఢిల్లీ: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పార్టీలతో సంబంధం లేకుండా సభలోని సభ్యులందరూ దీనికి ఆమోదం తెలిపారు. దీన్ని ధ్రువీకరిస్తూ.. ఒక చట్టబద్దమైన తీర్మానాన్ని ఆమోదించారు. బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికి.. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలకు కేంద్రమే కారణం అంటూ విపక్షాలు విమర్శలు చేశాయి.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. "ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. గత నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోలేదు. మైతి, కుకి తెగల మధ్య చర్చలు జరపడమే ఈ సమస్యకు శాంతియుత పరిష్కారం" అన్నారు. కేంద్ర ప్రభుత్వం బుధవారం నాడు.. లోక్‌సభలో వక్ఫ్ బిల్లు 2025 ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో దీనిపై చర్చించేందుకు.. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజాము 2 గంటల వరకు సుదీర్ఘ సమయం పాటు సభ కొనసాగింది.
ఈ క్రమంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తెల్లవారుజామున ఉదయం 2 గంటలకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. సుమారు 40 నిమిషాల పాటు దీనిపై చర్చించారు. అనంతరం సభ ఈ తీర్మానాన్ని వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది.
ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ.. "మొత్తం మీద మణిపూర్‌లో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది. ప్రజలు శిబిరాల్లో ఉన్నంత వరకు, పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పడం భావ్యం కాదు. మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది" అని తెలిపారు.
హైకోర్టు ఆదేశం తర్వాతనే మణిపూర్‌లో హింస చెలరేగిందని అమిత్ షా చెప్పుకొచ్చారు. "హైకోర్టు ఆదేశాలు వెలువడిన రోజే.. మేము కేంద్ర బలగాలను వాయుమార్గంలో మణిపూర్‌కి పంపాము. మా వైపు నుండి చర్యలను తీసుకోవడంలో, పరిస్థితిని అదుపు చేయడంలో ఎటువంటి ఆలస్యం జరగలేదు" అని స్పష్టం చేశారు.
2023 మేలో ప్రారంభమైన హింసలో ఇప్పటివరకు 260 మంది మరణించారని.. వారిలో 80 శాతం మంది గొడవలు ప్రారంభం అయిన తొలి నాళ్లలోనే అనగా మే నెలలోనే ప్రాణాలు కోల్పోయారని అమిత్ షా చెప్పుకొచ్చారు.
"సుమారు ఒక దశాబ్దం పాటు మణిపూర్‌లో చెదురుమదురు హింస కొనసాగింది. ఫలితంగా ఇక్కడ ఇప్పటి వరకు సుమారు 750 మంది ప్రాణాలు కోల్పోయారు. 1997-98లో కుకి-పైతి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ గొడవల్లో సుమారు 352 మంది మరణించారు. 1990లలో మెయిటే-పంగల్ ఘర్షణల్లో 100 మందికి పైగా మరణించారు. అప్పటి ప్రధానమంత్రి, అప్పటి హోంమంత్రి కానీ మణిపూర్‌ను సందర్శించలేదు" అని అమిత్ షా విమర్శించారు.
మణిపూర్‌లో దశాబ్దాలుగా గొడవలు జరుగుతున్నప్పటికి.. కేవలం బీజేపీ పాలనలో మాత్రమే హింస చెలరేగిందని ఒక అభిప్రాయం ప్రచారంలోకి వచ్చిందని.. అది సరైనది కాదన్నారు అమిత్ షా.
రాష్ట్రపతి పాలనకు సంబంధించి చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్.. తమ పార్టీ ఈ తీర్మానానికి మద్దతు ఇస్తుందన్నారు. అయితే రాష్ట్రంలో శాంతి, భద్రతలను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇరు వర్గాల మధ్య చర్చలను ప్రోత్సాహించాల్సిందిగా కోరారు.
అలానే టీఎంసికి చెందిన సయాని ఘోష్ మాట్లాడుతూ, తమ పార్టీ కూడా ప్రెసిడెంట్ రూల్ తీర్మానానికి మద్దతు ఇస్తుందని, అయితే త్వరితగతిన శాంతిభద్రతలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
వక్ఫ్ చట్టం 1995 vs వక్ఫ్ సవరణ బిల్లు 2025
కులాంతర వివాహానికి సిద్ధమైందని.. సోదరినే చంపేశాడు