Share News

తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు

ABN , Publish Date - Mar 28 , 2025 | 11:54 PM

జమ్మలమడుగు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలు అన్నీ ఇన్నీ కావని కౌన్సిలర్లు బానా శివరామలింగారెడ్డి, ముల్లాజానీ, సింగరయ్య, మునిసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

 తాగునీటి కోసం ప్రజల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు
కౌన్సిల్‌ సమావేశంలో చైౖర్‌పర్సన్‌ శివమ్మ

కౌన్సిల్‌ సమావేశంలో పలువురు కౌన్సిలర్ల ఆవేదన

జమ్మలమడుగు, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు మున్సిపాలిటీలో తాగునీటి సమస్యలు అన్నీ ఇన్నీ కావని కౌన్సిలర్లు బానా శివరామలింగారెడ్డి, ముల్లాజానీ, సింగరయ్య, మునిసుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం జమ్మలమడుగు మున్సిపల్‌ సాదారణ సమావేశం ఛైర్‌పర్సన్‌ శివమ్మ అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావే శంలో కౌన్సిలర్‌ బానా శివరామలింగారెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని కన్నెలూరు, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కాలనీల్లో ప్రజలు మంచినీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాత జగనన్న కాలనీ, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కాలనీలో మున్సిపాలిటీ సిబ్బంది రూ.2,500 డబ్బులు తీసుకుని చేతివాటం ప్రదర్శిస్తూ కుళాయి కనెక్షన్లు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ కాలనీలో కుళాయి కనెక్షన్‌ ఉచితంగా వేసుకోవచ్చన్నారు. అక్కడ ఎవరైనా డబ్బులు తీసుకుంటుంటే చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో వైస్‌ఛైర్మన్‌-2 సింగరయ్య మాట్లాడుతూ అధికారులు ఆయా వార్డులకు వచ్చినప్పుడు కౌన్సిలర్లను పిలువకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. పాత బిల్లులు పెట్టకుండానే కొత్త బిల్లులకోసం మున్సిపల్‌ సమావేశాలు నిర్వహిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్‌ మునిసుబ్బారెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు పట్టణంలో డీకేటీ స్థలాల్లో కొందరు ఆక్రమించి ఫంక్షన్‌ హాళ్లు, ఇతరత్రా నిర్మాణాలు చేస్తున్నారని వెంటనే రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు మేల్కొని వాటిని స్వాధీనం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 11:54 PM