Posani Arrest: ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..
ABN , Publish Date - Feb 27 , 2025 | 10:53 AM
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళీని అరెస్టు చేసిన పోలీసులు గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు.

హైదరాబాద్: రచయిత, సినీ నటుడు పోసాని కృష్ణ మురళీ (Posani Krishna Murali )ని పోలీసులు(Police)కాసేపట్లో అన్నమయ్య జిల్లా (Annamayya district), ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్ (Police Station)కు తీసుకువెళతారు. బుధవారం రాత్రి హైదరాబాద్ (Hyderabad)లో మైహోం భూజా అపార్టుమెంట్లో ఉన్న పోసానికి నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్న పోలీసులు గురువారం ఓబులవారిపల్లె పీఎస్‌కు తరలించారు. వైసీపీ (YCP) అధికారంలో ఉండగా టీడీపీ (TDP), జనసేన (Janasena) అగ్రనేతలపై అడ్డూ అదుపు లేకుండా నోరు పారేసుకున్న పోసానిని పోలీసులు అరెస్టు చేశారు. ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆతనిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ వార్త కూడా చదవండి..
ఈరోజైనా వంశీ నోరు విప్పుతారా..
అర్ధమైందా రాజా...
కాగా పోసాని కృష్ణ మురళీని ఓబులవారిపల్లెలో పోలీస్ స్టేషన్‌లో హాజరుపరిచిన తర్వాత అతనికి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. పరీక్షల అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరుస్తారు. మండలి జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి పోసానిని అరెస్టు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కుటుంబాన్ని టార్గెట్ చేసి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో ప్రసారం అయ్యాయి. దీనిపై మణి ఓబులవారిపల్లె పీఎస్‌లో చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోసానిపై ఏపీలో 11 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరించారు.
రంగంలోకి అన్నమయ్య జిల్లా పోలీసులు
అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో ఈనెల 24వ తేదీన మణి అనే జనసేన నాయకుడు పోసానిపై ఫిర్యాదు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించడం వంటి అభియోగాలతో భారత న్యాయ సంహితలోని సెక్షన్ 196, 353 (2), 111 రెడ్‌విత్ 3(5) కింద కేసు (క్రైమ్ నంబర్ 65/2025) నమోదు చేశారు. పోసాని మాట్లాడిన మాటల వీడియో, ఆడియో టేపులను పోలీసులు పరిశీలించారు. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.
పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి..
వైసీపీ అధికారంలో ఉండగా... టీడీపీ, జనసేన అగ్రనేతలపై పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి, అడ్డూ అదుపూ లేకుండా నోరు పారేసుకున్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా ఓబుళవారిపల్లె పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని మైహోం భూజా అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసాని కృష్ణ మురళి నివాసానికి వెళ్లి... నోటీసులు అందించి, అరెస్టు చేశారు. అన్నమయ్య జిల్లా సంబేపల్లె ఎస్‌ఐ భక్తవత్సలం ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసులను కలిసి... పోసాని కృష్ణ మురళిపై నమోదైన కేసు వివరాలను అందించారు. ఆయన అరెస్టుకు ఎస్కార్ట్ కల్పించాలని కోరారు. దీంతో... రాయదుర్గం ఠాణా నుంచి ఒక ఎస్‌ఐ, ఒక కానిస్టేబుల్ ఏపీ పోలీసులకు తోడుగా వెళ్లారు. రాత్రి 8.45 గంటల సమయంలో మైహోం భూజాలోని పోసాని నివాసానికి వెళ్లి, ఆయనను అరెస్టు చేశారు.
పోలీసులతో వాగ్వాదం...
అరెస్టు సమయంలో పోసాని పోలీసులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. ‘నోటీసులు తీసుకోను. అరెస్టు చేసుకోండి. ఆడవాళ్ల మీద రౌడీయిజం చేస్తారా?’ అంటూ నోరు పారేసుకున్నారు. ‘మీరెవరు? ఎలా మా ఇంటికి వస్తారు?’ అని ప్రశ్నించడంతో... తాము అన్నమయ్య జిల్లా పోలీసులమని ఎస్‌ఐ భక్తవత్సలం తెలిపారు. అరెస్టు చేస్తున్నాం... సహకరించండి అని కోరారు. ‘‘ముందు నాకు నోటీసు ఇవ్వండి. నేను ఆస్పత్రికి వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకుని... తర్వాత మీ దగ్గరికి వస్తాను’’ అని పోలీసులకు సూచించారు. అలా కుదరదని, అరెస్టుకు సహకరించకపోతే తమ డ్యూటీ తాము చేయాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేశారు. ‘మా ఇంట్లోకి వచ్చి నన్నే కోఆపరేట్ చేయమంటారేంటి’ అని పోసాని వారిని నిలదీశారు. కేసు నమోదైతే కశ్మీర్‌కైనా వెళ్లి అరెస్టు చేసే అధికారం ఉంటుందని సదరు అధికారి స్పష్టం చేశారు. ‘నాకు ఆరోగ్యం బాగలేదు... ఆపరేషన్ చేయించుకున్నా. పేషంట్‌ను కూడా పట్టించుకోరా’ అని మళ్లీ పోసాని ఆగ్రహించారు. పోసాని సతీమణికి నోటీసు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ‘సర్‌ను అరెస్టు చేస్తున్నాం, నోటీసు తీసుకోండి మేడమ్’ అని కోరడంతో... ‘తీసుకోవద్దు... తీసుకోవద్దు’ అని పోసాని ఆమెను ఆదేశించారు. ‘నోటీసు తీసుకోండి సార్’ అని పోలీసు అధికారి పదేపదే కోరినా... ‘నోటీసు తీసుకునేదిలేదు. అరెస్టు చేసుకోండి’ అని విసురుగా బదులిచ్చారు. ‘ఆడవాళ్ల మీద రౌడీయిజం చేయొద్దు’ అని పోలీసులను హెచ్చరించారు. ‘మేం రౌడీయిజం చేయడంలేదు. నోటీసు ఇస్తున్నాం’ అని ఎస్‌ఐ బదులిచ్చారు. ‘నేను మాత్రలు వేసుకోవాలి. అన్నం తింటా’ అన్నారు. ఆయన వేసుకోవాల్సిన మందులు ఇవ్వాలని పోలీసులు సూచించగా... ‘ఏ మాత్ర ఎప్పుడు వేసుకోవాలో ఆయనకు తెలియదు. అన్నీ నేనే ఇస్తా’ అని ఆయన సతీమణి చెప్పారు. అన్ని విషయాలు తాము దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆయన కొంత సమయం తీసుకుని దుస్తులు మార్చుకుని, పోలీసులతో వచ్చారు.
సారీలు చెప్పుకొని...
కూటమి అధికారంలోకి వచ్చాక కూడా పోసాని తన తీరు మార్చుకోలేదు. టీటీడీ చైర్మన్ బీఆర్‌నాయుడుపై వ్యక్తిగత దూషణలు, అడ్డగోలు ఆరోపణలు చేశారు. దీనిపై అనంతపురం రూరల్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆ తర్వాత వరుస కేసులు, అరెస్టుల భయంతో పోసాని ఒక్కసారిగా తన స్వరం మార్చేశారు. అంతకుముందు వాడూ, వీడు అని విరుచుకుపడిన ఆయనే... ‘గారు’ అంటూ మర్యాద ఇచ్చారు. ‘నేను రాజకీయాల నుంచి తప్పుకొంటున్నా. ఇక ఎవరి గురించీ మాట్లాడను’ అని చేతులు పైకెత్తేశారు. ‘రాజకీయ నాయకులందరికీ నమస్కరిస్తున్నాను. ఇన్నేళ్లు నన్ను ఆదరించారు. ఈ రోజు నుంచి నేను చనిపోయేదాకా నా బిడ్డలు, నా కుటుంబం కోసమే బతుకుతా. ఏ రాజకీయాల గురించీ మాట్లాడను’ అని వినమ్రంగా తెలిపారు. కానీ... అప్పటికే ఆయనపై రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. సీఐడీకి కూడా ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News