Share News

రేషన బియ్యం పక్కదారి

ABN , Publish Date - Mar 30 , 2025 | 11:44 PM

పేదవాడికి పట్టెడు అన్నం కోసం ప్రవేశపెట్టి అమలు అవుతున్న రేషన బియ్యం పథకం పక్కదారి పడుతోంది.

రేషన బియ్యం పక్కదారి
లారీతో సహా పట్టుబడిన రేషన బియ్యం (ఫైల్‌ఫొటో)

లారీలకు లారీలే తరలిస్తున్న వ్యాపారులు

మిల్లులో పాలిష్‌ చేసి రవాణా

నిఘా వైఫల్యమా...అధికారుల చోద్యమా...

బద్వేలు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి) పేదవాడికి పట్టెడు అన్నం కోసం ప్రవేశపెట్టి అమలు అవుతున్న రేషన బియ్యం పథకం పక్కదారి పడుతోంది. ఈ పథకంలోని బియ్యాన్ని సేకరించి పాలిష్‌ చేసి ప్రైవేటు మార్కెట్‌లో పెద్ద ఎత్తునవ్యాపారం సాగిస్తున్నారు. బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు కడప ప్రాంతాలలో ఎక్కువగా ఈ అక్రమ వ్యాపారం సాగుతోంది. ఇందులో బద్వేలు ప్రాంతంలో ఎవరెన్ని చెప్పినా ఫిర్యాదులు అందుతున్నా రేషన బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. అదే వ్యాపారులకు రహదారిగా మారింది. బద్వేలు కేంద్రంగా ఇప్పుడు మైదుకూరుకు మించి సాగుతున్న ఈ దందాకు ప్రభుత్వ నిఘా పని చేయక పోవడమా లేక అధికారులు చోద్యం చూస్తున్నారా అన్న ఆరోపణలు తప్పడం లేదు.

రేషన పట్టు... పాలిష్‌ కొట్టు : నెల నెలా లబ్ధిదారులకు అందించే రేషన బియ్యాన్ని వ్యాపారులు వారి కూలీలు లేదా సొంత మనుషుల ద్వారా సేకరించ డం ఒక మార్గం అయితే.. కొందరు రేషన పంపిణీ చేసే వారే లబ్ధిదారులకు రేషన బదులు డబ్బులు చెల్లించి వ్యాపారులకు విక్రయిస్తున్నారని సమాచారం. ఈ రెండు మార్గాల ద్వారా రేషన బియ్యం సేకరిస్తున్న వ్యాపారులు ఆ బియ్యాన్ని వారి గోడౌనలలోకి చేర్చి పాలిష్‌ చేసి 26 కేజీల బస్తాలుగా నింపి వాటిని నేరుగాను కొన్ని బ్రాండ్ల పేరుతోనూ ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. ఆ రకంగా ఒక్కో లోడ్‌లో 600నుంచి 700 బస్తాలు పొరుగు ప్రాంతాలకు పొరుగు జిల్లాలకు తరలిస్తూ వ్యాపారం సాగిస్తున్నారు. కడపజిల్లాలో మైదుకూరు రేషన బియ్యం, అక్రమ వ్యాపారానికి పేరుగాంచింది. ఇప్పుడు అందుకు తామేమి తక్కువేం కాదంటూ బద్వేలు వ్యాపారాలు పోటీ పడుతున్నారు. వారు లబ్ధిదారులకు 12 నుంచి 15 రూపాయల వరకు ఒక్కో కేజీకి చెల్లించి బియ్యం సేకరించి పాలిష్‌ చేసి 26 కేజీల బస్తాను 1400రూపాయలు అంతకుమించి విక్రయిస్తున్నట్లు సమాచారం. ఈబియ్యంలో కొన్ని నాణ్యమైన బియ్యం కల్తీ చేయడం ఆ మూటను ఈబియ్యాన్ని అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతున్నట్లు సమాచారం.

నిఘా పెడితేనే: అక్రమ రేషన బియ్యం వ్యాపారం అరికట్టాలంటే నిఘా ముమ్మరం చేసి స్థానిక రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. అప్పుడప్పుడు విజిలెన్స అధికారులు తనిఖీ చేయడం, రేషన బియ్యం పట్టుకోవడం లాంటివి జరుగుతున్నా దందాపై స్థానిక అధికారులుబియ్యం వ్యాపారులతో కుమ్మక్కై చేతులు తడుపుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. బద్వేలు ప్రాంతం నుంచి లారీలకు లారీలు బియ్యం ప్రొద్దుటూరు, నెల్లూరు , బెంగుళూరు ప్రాంతాలకు తరలించడంతోపాటు జిల్లాలో కూడా బియ్యం రిటైల్‌ వ్యాపారులకు , అంగళ్లకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ రేషన దందాపై అధికారులు ఏ చర్యలు చేపడతారో చూడాలి.

బియ్యం అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు

ఈ విషయంపై తహశీల్దారు ఉదయభాస్కర్‌ రాజును ‘ఆంధ్రజ్యోతి’వివరణ కోరగా అక్రమ బియ్యం రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవని, డీలర్లు ఎవరైనా అక్రమాలకు పాల్పడినట్లు మా దృష్టికి తెస్తే చర్యలు చేపడతామన్నా రు. సివిల్‌ సప్లై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారని ఇటీవల కాలంలో అక్రమంగా తరలిపోతున్న రేషన బియ్యం రెండులారీలను పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Mar 30 , 2025 | 11:44 PM