HCU Land: ఆ భూములు విక్రయించవద్దు..
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:16 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించవద్దని, 400 ఎకరాల భూమి వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వక్తలు డిమాండ్ చేశారు.

హెచ్‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ
పంజాగుట్ట, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విక్రయించవద్దని, 400 ఎకరాల భూమి వేలాన్ని వెంటనే నిలిపివేయాలని వక్తలు డిమాండ్ చేశారు. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హెచ్‌సీయూ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. గతంలో సెంటర్ ఫర్ స్మార్ట్ గవర్నెన్స్ కోసం భూమి కావాలని అడిగితే ఈసీలో ఉన్న తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు హయాం నుంచి భూ కేటాయింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు.
భూమిని అంగట్లో సరుకులా విక్రయిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. వర్సిటీకి చెందిన అంగుళం భూమిని కూడా పోనివ్వమని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ అన్నారు. రూ.40 వేల కోట్ల విలువైన భూమిని ముంబైకి చెందిన వారికి రూ.10 వేల కోట్లకే ఎలా కుదువ పెడతారని సీనియర్ జర్నలిస్ట్ విఠల్ ప్రశ్నించారు. పౌరసమాజం స్పందించకపోతే అన్యాయాలు జరుగుతాయని సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అన్నారు. జస్టిస్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా ప్రతినిధి కంచర్ల బద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.