అమెరికాలో గుడివాడవాసి ఆత్మహత్య
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:43 AM
జిల్లాకు చెందిన యువకుడు సోమవారం అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొల్లి శ్రీనివాసరావు, లక్ష్మీశేషుకుమారికి కవల పిల్లలు. శ్రీనివాసరావు గుడివాడలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.

పదేళ్ల కిందట అమెరికాకు..
కష్టపడి చదివి.. ఉద్యోగంలో స్థిరపడి..
అకస్మాత్తుగా బలవన్మరణం
గుడివాడ, మార్చి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు చెందిన యువకుడు సోమవారం అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. గుడివాడ మండలం దొండపాడు గ్రామానికి చెందిన కొల్లి శ్రీనివాసరావు, లక్ష్మీశేషుకుమారికి కవల పిల్లలు. శ్రీనివాసరావు గుడివాడలో ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. కుమారులు కొల్లి అరవింద్, అభిషేక్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదివేవారు. దీంతో మధ్యతరగతి కుటుంబమైనా శ్రీనివాసరావు పిల్లలిద్దరినీ చదివించారు. అప్పులుచేసి మరీ చిన్న కుమారుడు అభిషేక్‌ను పదేళ్ల కిందట ఎంఎస్ చదివేందుకు అమెరికా పంపారు. మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి అమెరికాలోనే మంచి ఉద్యోగం సంపాదించాడు. అమెరికాలో స్థిరపడిన భారత సంతతి అమ్మాయితో ఏడాది క్రితం కులాంతర వివాహమైంది. వారి కష్టానికి ఫలితంగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. తల్లిదండ్రులకు చేదోడుగా నిలిచారు. వివాహాలు కూడా కావడంతో కుటుంబమంతా ఆనందంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద కుమారుడు అరవింద్‌కు భార్యతో మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో అన్నకు తమ్ముడు అభిషేక్ అండగా నిలిచాడు. తనతో పాటు అమెరికా తీసుకెళ్లి మంచి ఉద్యోగం కల్పించాడు. ఎంతో బాధ్యతగా, కలివిడిగా ఉండే అభిషేక్ ఒక్కసారిగా ఆత్మహత్య చేసుకోవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. అయితే, అభిషేక్ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అమెరికా నుంచి దర్జాగా వస్తాడనుకున్న కొడుకు శవమై వస్తుండటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.