Share News

బెట్టింగ్‌ల బుకింగ్‌

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:45 AM

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఛేదించిన బెట్టింగ్‌ మూలాల్లో ఉన్న పీపీ ఎవరు? వైసీపీ నేత కుమారుడు పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగానే ఆ పీపీ పారిపోయాడా? కృష్ణాజిల్లాలో బెట్టింగ్‌ నిర్వహణ కోసం సదరు పీపీనే వలను అల్లాడా? ఈ వల అవనిగడ్డ, పెడన మధ్య ఉందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి.

బెట్టింగ్‌ల బుకింగ్‌

అవనిగడ్డ కేంద్రంగా జిల్లాలో బెట్టింగ్‌లు

పటమట స్థావరంలోనూ జోరుగా..

పెడనకు చెందిన పీపీ కీలక పాత్రధారి

అనుచర బుకీగా వైసీపీ నేత కుమారుడు

పవన్‌తో పాటు మరో నలుగురి అరెస్టు

ముందస్తు సమాచారంతో పరారైన ‘పీపీ’

నిందితుల ఖాతాల్లో రూ.48 లక్షల నిల్వ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పటమటలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి కుమారుడు పవన్‌ కుమార్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడితో పాటు పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు, కృష్ణలంకకు చెందిన ఉమామహేశ్వరరావు, అవనిగడ్డకు చెందిన చెన్నా గోపయ్యస్వామి, కమ్మిలి వెంకటరమణను అరెస్టు చేసి శనివారం పటమట పోలీసులకు అప్పగించారు. మొత్తం వారి ఖాతాల్లో రూ.48 లక్షలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పవన్‌కుమార్‌ ఖాతాలోనే రూ.43 లక్షల వరకు ఉన్నట్టు నిర్ధారించారు.

పీపీ అంటే..

పవన్‌కుమార్‌ ఫోన్‌ను పోలీసులు విశ్లేషించినప్పుడు అందులో పీపీ పేరుతో ఓ నెంబర్‌ ఉంది. దాని పూర్తి వివరాలు తీయగా, పెడనకు చెందిన ప్రసాద్‌ అనే యువకుడి నెంబరుగా గుర్తించారు. పవన్‌కుమార్‌ను వెంటబెట్టుకుని వెళ్లిన పోలీసులు అవనిగడ్డలో జరుగుతున్న బెట్టింగ్‌ డెన్‌ను గుర్తించారు. పెడనకు చెందిన ఈ ప్రసాద్‌ అవనిగడ్డలో ఇళ్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌ బాగోతాన్ని నిర్వహిస్తున్నాడు. అవనిగడ్డ, చల్లపల్లి, పెడన, రేపల్లె, హైదరాబాద్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ప్రసాద్‌ ప్రధాన బుకీగా వ్యవహరిస్తుండగా, పవన్‌కుమార్‌ ద్వితీయశ్రేణి బుకీ. ప్రసాద్‌ అవనిగడ్డలోని ఓ భవనం మొదటి, రెండు అంతస్తులను, పెంట్‌హౌస్‌ను అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఇక్కడ అద్దెలు తక్కువగా ఉండటంతో ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఒక్కో ఇంటికి రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు అద్దె చెల్లిస్తున్నాడు. ప్రసాద్‌, పవన్‌కుమార్‌లు.. పార్కర్‌ ఎక్స్ఛేంజ్‌ యాప్‌ ద్వారా ఒక్కో మ్యాచ్‌పై 100 నుంచి 200 మందితో బెట్టింగ్‌ కట్టిస్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు. కాగా, పెడనకు చెందిన కోట నాగేశ్వరరావు పెనమలూరులో ఎమ్మెల్యే కార్యాలయం వీధిలో అద్దెకు ఉంటున్నాడు. పవన్‌కుమార్‌ ద్వారా నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని పెడనకు తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ప్రసాద్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. అవనిగడ్డకు చెందిన గోపయ్యస్వామి తక్కువ మొత్తంలో బెట్టింగ్‌లు కట్టిస్తున్నాడని తేలింది. వెంకటరమణ, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావులు ప్రసాద్‌, పవన్‌కుమార్‌కు కలెక్షన్‌ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు.

ప్రత్యేకంగా జాయింట్‌ అకౌంట్‌

పవన్‌కుమార్‌, ప్రసాద్‌లు బెట్టింగ్‌లో నగదు లావాదేవీల కోసం ప్రత్యేకంగా ఓ జాయింట్‌ అకౌంట్‌ నిర్వహిస్తున్నారు. బెట్టింగ్‌లో ప్లంటర్లు ఎంతెంత మొత్తంలో బెట్టింగ్‌ పెట్టారు, ఎంత మొత్తంలో పందెం గెలిచిన వారికి ఇచ్చారు.. అనే వివరాల్లో పారదర్శకత కోసం ఈ అకౌంట్‌ను నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఆన్‌లైన్‌లో డబ్బు పంపే వారికి ఈ అకౌంట్‌ నెంబరును ఇచ్చారు. కలెక్షన్‌ ఏజెంట్లుగా ఉన్న వెంకటరమణ, నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావులు వసూలు చేసిన డబ్బును పవన్‌కుమార్‌ ఇస్తారు. అతడు ఆ డబ్బును జాయింట్‌ అకౌంట్లో జమ చేస్తాడు. టీస్టాళ్లు, కిళ్లీకొట్లు, కాఫీ కేఫ్‌లను వారు కలెక్షన్‌ పాయింట్లుగా పెట్టుకున్నారు. డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తి వాహనం నెంబరు, ఇవ్వాల్సిన మొత్తం ప్రసాద్‌, పవన్‌కుమార్‌ కలెక్షన్‌ ఏజెంట్లకు చెబుతారు. వారు ఆయా ప్రాంతాలకు వెళ్లి చెప్పిన నెంబరు కలిగిన వాహనం రాగానే డబ్బు వసూలు చేసుకోవాలి. వైసీపీ ఐదేళ్లకాలంలో పీపీ, పవన్‌కుమార్‌లు తమకు ఎదురు లేకుండా బెట్టింగ్‌లు నిర్వహించారు. పోలీసులకు చిక్కడానికి ముందు పవన్‌కుమార్‌ రూ.32 లక్షలను ఓ వ్యక్తికి బదిలీ చేశాడు. బెట్టింగ్‌లో అవతలి వ్యక్తి గెలవడంతో ఆ డబ్బు పంపినట్టు సమాచారం.

Updated Date - Mar 30 , 2025 | 12:45 AM