Share News

ఆభరణా‘లెక్క’డ?

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:42 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 300 కేజీలకు పైగా వెండి, బంగారు ఆభరణాలు కరిగించి ఆరు నెలలైంది. ఇంతలో ఇద్దరు ఈవోలు మారినా.. ఆ ఆభరణాలు, వాటి లెక్కలు ఏమయ్యాయో ఎవరికీ తెలియదు. మోపిదేవి సుబ్రహ్మణ్యస్వామి దేవస్థానంలో అధికారుల మధ్య జరిగిన ఈ జాప్యం భక్తులను కలవరపెడుతుండగా, అంతర్గత విభేదాలే ఇందుకు కారణమనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆభరణా‘లెక్క’డ?
మోపిదేవిలోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి

మోపిదేవి సుబ్బారాయుడి ఆభరణాల లెక్కల్లో జాప్యం

300 కేజీలకుపైగా ఆభరణాల విషయంలో నిర్లక్ష్యం

ఆరు నెలల కిందట కరిగించిన నాటి ఈవో

నేటి ఈవోకు ఇంతవరకు అప్పగించని వైనం

ఏమయ్యాయో తెలియక భక్తుల మండిపాటు

అవనిగడ్డ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : మోపిదేవిలో వేంచేసి ఉన్న వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి వెండి, బంగారు ఆభరణాల లెక్కల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భక్తులు నగదు రూపంలో గానీ, ఆభరణాల రూపంలో గానీ మొక్కుబడులు చెల్లిస్తుంటారు. ఇలా దాదాపు రూ.16 కోట్లకుపైగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, 300 కేజీలకుపైగా వెండి, బంగారు ఆభరణాలు ఆలయానికి సమకూరాయి.

లెక్కలు తేలేదెన్నడు?

ఆలయానికి సంబంధించి గత ఏడాది జూన్‌ నాటికి దాదాపు 3 వేలకుపైగా (300 కేజీలకుపైగా) వెండి, బంగారు నాగ పడగలు, ఆభరణాలు సమకూరినట్లు లెక్కలు తేలాయి. వెండి నాగ పడగలు, ఇతర చిన్నచిన్న ఆభరణాలు నిత్యం స్వామివారికి అలంకరించే అవకాశం లేకపోవటంతో నాటి దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) నల్ల సూర్యచక్ర ధరరావు ఆ ఆభరణాలకు విలువ కట్టించి, వాటిని హైదరాబాద్‌లోని ఇంట్లో కరిగించినట్లుగా సమాచారం. ఆభరణాల కరిగింపు ప్రక్రియ పూర్తయిన రెండు నెలలకే నల్లం సూర్యచక్రధరరావు తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డిప్యూటీ కమిషనర్‌ హోదాలో దాసరి శ్రీరామ వరప్రసాదరావు.. మోపిదేవి ఆలయ దేవస్థాన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరూ బాధ్యతలైతే స్వీకరించారు కానీ, మోపిదేవి స్వామివారి ఆభరణాల లెక్కలు మాత్రం తేల్చలేదు. బ్యాంక్‌ వివరాలకు సంబంధించి అన్ని బాధ్యతల బదలాయింపు పూర్తయినప్పుటికీ ఆరు నెలలుగా ఆలయ ఆభరణాల లెక్కలు తేల్చలేదు. ఈ ఆభరణాల విలువ ఎంత..? ఎవరి సంరక్షణలో ఉన్నాయి..? అనే వివరాలు తెలియక భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అంతర్గత విభేదాలే కారణమా?

మోపిదేవి ఆలయంలో కార్యనిర్వహణాధికారిగా పనిచేసి, వాడపల్లికి బదిలీ అయిన నల్లం సూర్య చక్రధరరావుకు, ప్రస్తుత ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావుకు మధ్య అంతర్గత విభేదాలే ఆభరణాల లెక్క ఇంకా తేలకపోవడానికి కారణమని తెలుస్తోంది. గతంలో మావుళ్లమ్మ తల్లి ఆభరణాల లెక్కల విషయంలో ఈ ఇద్దరు అధికారుల మధ్య సహృద్భావ వాతావరణం లేదు. కొన్ని నెలలపాటు ఆభరణాల లెక్కల బదలాయింపు ఆలస్యమైంది. దీంతో దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం స్పందించి ఆభరణాలకు సంబంధించి లెక్కలు తేల్చి, వెంటనే వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించటంతో అప్పటికి స్పందించారు. సరిగ్గా మోపిదేవి ఆలయం విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

కమిషనరేట్‌కు చేరిన ‘పంచాయితీ’

మోపిదేవి ఆలయానికి సంబంధించి ఆభరణాల లెక్కలను అప్పగిద్దామంటే సహకరించటం లేదని ఇటీవల వాడపల్లిలో కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ కమిషనర్‌ సూర్యచక్రధరరావు దేవదాయ శాఖ కమిషనరేట్‌కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును మోపిదేవిలో కార్యనిర్వహణాధికారికి కమిషనర్‌ కార్యాలయం పంపించారు. అయినా ఇప్పటి వరకు మూడుసార్లు ఆభరణాల అప్పగింత ప్రక్రియ వాయిదా పడింది. కాగా, ఆరు నెలల నుంచి ఆభరణాల లెక్క తేలకపోవడంతో దేవదాయ శాఖ కమిషనర్‌ కార్యాలయం ఏం చేస్తోందని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

పని ఒత్తిడి వల్లే.. : ఈవో

ఈ విషయమై ఆలయ కార్యనిర్వహణాధికారి దాసరి శ్రీరామ వరప్రసాదరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, ఆభరణాల లెక్కలు మినహా మిగిలిన అన్ని చార్జీల బదలాయింపు పూర్తయిందని, ఆభరణాల లెక్కలు అప్పగించాల్సిందిగా తాను రెండు తేదీలు సూచిస్తూ కమిషనర్‌ కార్యాలయానికి లేఖ రాశానని తెలిపారు. అప్పగింత కార్యక్రమంలో జరిగిన జాప్యానికి రెండు దేవస్థానాల్లో ఉన్న పని ఒత్తిడే కారణం తప్ప మరే ఇతర కారణాలు లేవన్నారు. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 28 , 2025 | 12:42 AM