పెదకళ్లేపల్లిలో తాగునీటి కష్టాలు
ABN , Publish Date - Mar 23 , 2025 | 01:47 AM
మండలంలోని అతి పెద్ద పంచాయతీ పెదకళ్లేపల్లి. గ్రామంలో 1000 కుటుంబాలు ఉన్నాయి. గ్రామస్థులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఫిల్టర్ చేయకుండానే చెరువు నుంచి కుళాయిలకు నీరు విడుదల
చేతి పంపులపై ఆధారపడుతున్న గ్రామస్థులు
ప్రతిపాదనలకే పరిమితమవుతున్న ఫిల్టర్ బెడ్ల ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి-మోపిదేవి): మండలంలోని అతి పెద్ద పంచాయతీ పెదకళ్లేపల్లి. గ్రామంలో 1000 కుటుంబాలు ఉన్నాయి. గ్రామస్థులు తాగునీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు. నాలుగెకరాల విస్తీర్ణంలో చెరువు ఉన్నప్పటికీ ఫిల్టర్ బెడ్లు పని చేయడం లేదు. దీంతో నేరుగా చెరువు నీటినే కుళాయిలకు వదులుతున్నారు. చెరువులోనే కలుషితమైన నీరు కుళాయిల ద్వారా వచ్చాక దుర్వాసన వస్తోంది. పశువులు తాగేందుకైనా ఉపయోగపడని నీరు కుళాయిల ద్వారా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభం కావటంతో చెరువులో నీరు అడుగంటడంతో గ్రామస్థులు మరింత ఆందోళన చెందుతున్నారు. గ్రామంలోని ఓవర్ హెడ్ ట్యాంక్‌ల ద్వారా నాంది ఫౌండేషన్‌కు నీరు సరఫరా అవుతోంది. నాంది ఫౌండేషన్ వద్ద కొందరు నీటిని కొనుగోలు చేసి వినియోగించుకుంటున్నారు. గ్రామ శివారుల్లో ఉన్న చేతి పంపులు, బోరుబావులను గ్రామస్థులు వినియోగించుకుంటున్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా వచ్చే నీటిని తాగునీటికి, ఇంట్లో అవసరాలకు ఉపయోగించటం మానేశామని చెబుతున్నారు. స్నానం చేస్తే దద్దుర్లు, అంటువ్యాధులు వస్తున్నాయని చెబుతున్నారు.
పదిహేనేళ్ల నుంచి ప్రతిపాదనలు పంపుతున్నా..
రక్షిత మంచినీటి పథకం ఫిల్టర్ బెడ్ల మరమ్మతుల వ్యవహారం పదిహేనేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. 2006లో ఫిల్టర్ బెడ్లకు మరమ్మతులు చేశారు. నాటి నుంచి ఫిల్టర్ బెడ్ల ఏర్పాట్లు, మరమ్మతులకు ఏటా పది లక్షల అంచనా వేసి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు పంపుతున్నారు. 2023లో రూ.12లక్షలతో ఫిల్టర్ బెడ్ల ఏర్పాటుకు అంచనాలు తయారు చేశా రు. మంజూరయ్యే సమయానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని గ్రామస్థులు చెబుతున్నారు. శాశ్వత ప్రాతిపదికన మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేసేందుకు రూ.20 లక్షలతో మరో అంచనా తయారు చేసి ఎంపీ వల్లభనేని బాలశౌరికి పంపారు. మంజూరు చేయగా, టెండర్లు పిలిచే దశలో ఎన్నికల కోడ్ రావటంతో ఆ ప్రతిపాదనలు నిలిచిపోయాయి. నాలుగు పర్యాయాలు అంచనాలు తయారు చేసి ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు ఉన్నతాధికారులు, నాయకుల వద్దకు పంపగా, ఎన్నికల కోడ్, ఇతర సమస్యలో నిలిచిపోవటంతో అధికారుల తీరుపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాతలు వేసిన పంపులే ఆధారం
గ్రామ శివారుల్లో దాతలు వేసిన చేతి పంపుల వద్ద ఎక్కువ మంది మంచినీరు తెచ్చుకుంటున్నారు. మెంతి దిబ్బ, పెదకళ్లేపల్లి నుంచి కుమ్మరిపాలెం వెళ్లే రహదారి, మేళ్లమర్రు రహదారుల్లో పంచాయతీ వారు, పలువురు దాతలు పొలాల వద్ద ఏర్పాటు చేసిన చేతి పంపులు గ్రామస్థుల మంచినీటి అవసరాలకు ఉపయోగపడుతున్నాయి. ప్రధాన గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్నప్పటికీ ద్విచక్ర వాహనాలు, సైకిళ్లపై వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు.
కుళాయిల్లో నీరు దుర్వాసన వస్తోంది
పదేళ్ల నుంచి ఫిల్టర్ బెడ్ల మరమ్మతులను అధికారులు, నాయకులు పట్టించుకోలేదు. గ్రామానికి వచ్చినపుడు మంచినీటి సమస్య ప్రస్తావించగా, అంచనాలు వచ్చాయంటూ కాలం దాటవేస్తున్నారు. గ్రామ శివారుల్లో దాతలు ఏర్పాటు చేసిన చేతి పంపులపై ఎంతకాలం ఆధార పడాలి. అధికారులు మంచినీరు కూడా అందిచలేకపోతున్నారు. కుళాయిల్లో నీరు పసరుగా ఉంది. మురుగునీరులా వచ్చి దుర్వాసన వేస్తోంది. - కాలారి రామారావు, గ్రామస్థుడు
చెరువును శుభ్రం చేయాలి
గ్రామానికి మంచినీరు అందిస్తున్న చెరువు అపరిశుభ్రంగా ఉంది. నీరు కలుషితమై దుర్వాసన వస్తోం ది. చెరువును శుభ్రం చేసి గ్రామప్రజల అవసరాలకు తగినంత మంచినీటిని అందించాలి.
-గంధం చలపతిరావు, గ్రామస్థుడు
అంచనాలు రూపొందించాం
గ్రామంలో రక్షిత మంచినీటి పథకానికి ఫిల్టర్ బెడ్లు నూతనంగా ఏర్పాటు చేసేందుకు రూ.20 లక్షలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పం పాం. ఇప్పటికే ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు కలెక్టర్, ఎంపీ వల్లభనేని బాలశౌరి దృష్టికి తీసుకెళ్లాం. గ్రామప్రజల తాగునీటి అవసరాలు తీర్చేదిశగా ప్రయత్నిస్తున్నాం.
-అరజా సంధ్యారాణి, సర్పంచ్