మందుల మాయ
ABN , Publish Date - Mar 25 , 2025 | 12:52 AM
నిత్యం అనేక రకాల రోగాలకు, రుగ్మతలకు మనం వాడుతున్న మందులు మంచివేనా? ‘ఆపరేషన్ గరుడ’లో భాగంగా మందుల షాపుల్లో సోదాలు నిర్వహించిన ఔషధ నియంత్రణ మండలి అధికారులు అనేక రకాల నకిలీ మందులను గుర్తించారు. ఉత్తరాదిలో గుట్టుచప్పుడు కాకుండా తయారవుతున్న నకిలీ మందులను ఓ మాజీమంత్రి అనుచరుడి కనుసన్నల్లో బెజవాడకు తెప్పించి విక్రయాలు జరుపుతూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్నారు.

ఉమ్మడి కృష్ణాలో విచ్చలవిడిగా నకిలీ మందుల మాఫియా
ఉత్తరాదిలో తయారు.. విజయవాడకు సరఫరా
ఓ మాజీమంత్రి అనుచరుడి ఆధ్వర్యంలో వ్యాపారం
మందుల షాపుల్లో లెక్కకుమించిన సరుకు
నిషా కలిగించే మందులు యువతకు విక్రయం
తెలియక బానిసలవుతున్న అమాయకులు
అమ్మిన మందులకు కనిపించని బిల్లులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు మందులను సరఫరా చేసే ఏజెన్సీలు విజయవాడలో కేంద్రీకృతమై ఉన్నాయి. రెండు జిల్లాల్లో మందుల షాపులను నిర్వహిస్తున్న యజమానులు ఇక్కడి నుంచి సరుకును తీసుకెళ్తుంటారు. ఇలా మందులను సరఫరా చేస్తున్న కొంతమంది బ్రాండెడ్ కంపెనీల పేర్లను పోలి ఉన్న నకిలీ మందులను రప్పించుకుంటున్నారు. ఉత్తరాది రాషా్ట్రల్లో ఇబ్బడిముబ్బడిగా తయారవుతున్న నకిలీ మందులను విజయవాడకు రప్పించుకుని షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ నకిలీ మందుల్లో నార్కోటిక్ సైకోట్రోఫిక్ మందులు ఉంటున్నాయని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఎన్‌ఆర్‌ఎక్స్ మందుల్లో మొత్తం 41 రకాలు ఉన్నాయని ఔషధ నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు. వాటిలో సగం వరకు నకిలీ మందులు మార్కెట్‌లో చెలామణి అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలా ఉత్తరాది రాషా్ట్రల నుంచి వచ్చిన నకిలీ మందుల గుట్టును ఇంతకుముందు ఔషధ నియంత్రణ మండలి అధికారులు, విజయవాడ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. అలా్ట్రసెట్ మందు బిళ్లల అమ్మకాలు తగ్గిపోతుండటంతో జాన్సన అండ్ జాన్సన కంపెనీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ పేరుతో నకిలీ మందుల అమ్మకాలు జరుగుతున్నాయని ఆ సంస్థ ప్రతినిధులు ఫిర్యాదులో పేర్కొన్నారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, ఔషధ నియంత్రణ మండలి అధికారులు వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించి నకిలీ అలా్ట్రసెట్ మందులను గుర్తించారు. ఆ తర్వాత ఒక్కో లింక్‌ను ఛేదించుకుంటూ వెళ్లిన పోలీసులకు అసలు మూలాలు ఉత్తరాఖండ్‌లో ఉన్నట్టు ఆధారాలు లభించాయి.
మాజీమంత్రి అనుచరుడి కనుసన్నల్లో..
వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ఎలాంటి పర్యవేక్షణ, నిఘా లేకపోవడంతో నగరంలో మందుల మాఫియా చాపకింద నీరులా విస్తరించింది. ఈ మాఫియా చేస్తున్న చేష్టలకు అసలు మందుల అమ్మకాలు తగ్గిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఓ మాజీమంత్రి అనుచరుడి కనుసన్నల్లో ఈ మాఫియా నడుస్తోంది. ముఖ్యంగా నార్కోటిక్ సైకోట్రోఫిక్ (ఎన్‌ఆర్‌ఎక్స్) మందులు పక్కదారి పడుతున్నట్టు తనిఖీల్లో వెల్లడైంది.
హద్దులు దాటుతున్న హ్యాబిట్యువల్
రోగాలు ఎన్ని ఉన్నాయో అదే స్థాయిలో మందులు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా డొమాస్టిక్, హ్యాబిట్యువల్ డ్రగ్స్ ఉంటాయి. జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులకు ఉపయోగించే మందులు డొమాస్టిక్ కేటగిరీలో ఉంటాయి. మానసిక రుగ్మతలు ఉన్న రోగులకు వైద్యులు రాసే మందులను హ్యాబిట్యువల్ కేటగిరీగా పరిగణిస్తారు. ట్రమడాల్, ఆల్‌ప్రాజోలం, నైట్రోజిఫాం, ఆలా్ట్రసెట్ వంటి మందులు.. నొప్పులు, మానసిక ప్రశాంతత కోసం వైద్యులు రాస్తుంటారు. ఈ మందులను వైద్యుల చీటీలతో సంబంధం లేకుండా విక్రయించేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ బ్రాండ్లతో నకిలీ మందులు చెలామణీ జరుగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. గొల్లపూడి కూడలిలో ఉన్న గోపీకృష్ణ మెడికల్స్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్‌లో 2.03 కిలోల ఎన్‌ఆర్‌ఎక్స్ మందుల దుర్వినియోగం జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. దీనిపై షాపు యజమానికి ఔషధ నియంత్రణ మండలి అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. యజమాని ఇంట్లోనూ సోదాలు చేశారు. ఈ మందులను వైద్యుల చీటీ లేకుండా విక్రయించినట్టు తేలింది. మందుల షాపుల యజమానులు సాధారణ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని సమాచారం. జ్వరం, తలనొప్పి, జలుబు, ఒంటినొప్పులకు బాధితులు చీటీ లేకుండా షాపులకు వెళ్లి అడిగితే మందులు ఇస్తారు. దాని ముసుగులోనే ఎన్‌ఆర్‌ఎక్స్ మందులను యువతకు విక్రయిస్తున్నారని అధికారులు నివేదిక రూపొందించారు. ఈ ఎన్‌ఆర్‌ఎక్స్ మందులు వేసుకోగానే నిషా ఎక్కిన అనుభూతి కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకోసమే యువత ఈ మందులను రహస్యంగా కొనుగోలు చేస్తోందని అభిప్రాయపడుతున్నారు.