స్థూల ఉత్పాదకతలో సంవృద్ధి
ABN , Publish Date - Mar 26 , 2025 | 01:17 AM
స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా రెండు, కృష్ణాజిల్లా మూడు స్థానాలు పొందాయి. విశాఖపట్నం మొదటి స్థానం సాధించింది. కొద్దిరోజుల్లో ముగియనున్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో ఎన్టీఆర్ జిల్లా రూ.94,562 కోట్లు, కృష్ణాజిల్లా రూ.87,742 కోట్ల ఉత్పాదకతను పొందాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ జిల్లా 10.09 శాతం, కృష్ణాజిల్లా 11.58 శాతం మేర జీడీడీపీలో వృద్ధిని నమోదు చేశాయి.

ఎన్టీఆర్ జిల్లా 2, కృష్ణాజిల్లా 3 స్థానాలు
రూ.94,562 కోట్ల ఉత్పత్తి సాధించిన ఎన్టీఆర్ జిల్లా
రూ.87,742 కోట్ల ఉత్పత్తితో కృష్ణాజిల్లా
కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో గణాంకాలు విడుదల చేసిన సీఎం
రాష్ట్ర జీడీడీపీలో ఎన్టీఆర్ 5.79, కృష్ణా 5.57 శాతం కాంట్రిబ్యూషన్
తలసరి ఆదాయంలో రెండు, మూడు స్థానాలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో రాష్ట్రంలోనే ఎన్టీఆర్ జిల్లా రెండు, కృష్ణాజిల్లా మూడు స్థానాలు పొందాయి. విశాఖపట్నం మొదటి స్థానం సాధించింది. కొద్దిరోజుల్లో ముగియనున్న 2024-25 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాల్లో ఎన్టీఆర్ జిల్లా రూ.94,562 కోట్లు, కృష్ణాజిల్లా రూ.87,742 కోట్ల ఉత్పాదకతను పొందాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే ఎన్టీఆర్ జిల్లా 10.09 శాతం, కృష్ణాజిల్లా 11.58 శాతం మేర జీడీడీపీలో వృద్ధిని నమోదు చేశాయి. వ్యవసాయానుబంధ రంగాల కేటగిరీలో వ్యవసాయం, ఉద్యానం, మాంసం, చేపలు, రొయ్యల ఉత్పత్తిలోనూ, పారిశ్రామిక రంగాల కేటగిరీలో మైనింగ్, క్వారీయింగ్, తయారీ, విద్యుత, గ్యాస్, వాటర్ సప్లై, నిర్మాణం వంటి రంగాల్లో ఉత్పాదకత, సేవా రంగంలో వ్యాపారం, హోటళ్లు, రెస్టారెంట్లు, రైల్వే, బ్యాంకింగ్, రవాణా, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు సంబంధించి సాధించిన జీడీడీపీని మంగళవారం జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు విడుదల చేశారు.
ఎన్టీఆర్ జిల్లాలో వృద్ధి
వ్యవసాయ రంగంలో ఎన్టీఆర్ జిల్లా రూ.1,081 కోట్లు సాధించి 1.24 శాతం కంట్రిబ్యూషన్ అందించింది. ఉద్యాన రంగంలో మాత్రం రూ.4,905 కోట్ల ఉత్పాదకతను సాధించి, 5.62 శాతం వృద్ధితో కంట్రిబ్యూషన్ అందించింది. లైవ్‌స్టాక్ (మాంసం) రంగంలో రూ.4,414 కోట్ల ఉత్పాదకతతో, 5.06 శాతం వృద్ధితో కంట్రిబ్యూషన్ అందించింది. మొత్తంగా వ్యవసాయ రంగంలో 2022-23తో పోల్చుకుంటే, 2024-25కు 15.94 శాతం వృద్ధితో రూ.1,737 కోట్ల ఉత్పాదకతను సాధించడం విశేషం. పారిశ్రామిక రంగానికి సంబంధించి మైనింగ్-క్వారీయింగ్‌లో రూ.1,149 కోట్లు, తయారీకి సంబంధించి రూ.3,310 కోట్లు, ఎలక్ర్టిసిటీ, గ్యాస్, వాటర్ సప్లైకు సంబంధించి రూ.2,638 కోట్లు, నిర్మాణాలకు సంబంధించి రూ.10,632 కోట్ల ఉత్పాదకతతో గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే రూ.3,293 కోట్ల మేర అదనంగా ఉత్పాదకతను సాధించింది. సేవా రంగంలో ట్రేడ్, హోటళ్లు, రెస్టారెంట్ల ద్వారా రూ.16,691 కోట్లు, రైల్వేస్ ద్వారా రూ.1,250 కోట్లు, రవాణా ద్వారా రూ.6,088 కోట్లు, కమ్యూనికేషన్ ్స ద్వారా రూ.2,691 కోట్లు, బ్యాంకింగ్-ఇన్‌స్టిట్యూట్స్ ద్వారా రూ.10,005 కోట్లు, రియల్ ఎస్టేట్ ద్వారా రూ.10,046 కోట్లు, ఇతర సేవల ద్వారా రూ.8,842 కోట్ల ఉత్పాదకత సాధించింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలతో పోల్చుకుంటే 18.06 శాతం వృద్ధితో రూ.10,591 కోట్ల ఉత్పాదకతను ఎన్టీఆర్ జిల్లా సాధించడం విశేషం.
రెండు జిల్లాల కాంట్రిబ్యూషన్
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పాదకతలో రెండు జిల్లాలు రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. గత రెండేళ్లతో పోల్చి చూస్తే ప్రస్తుతం ముగియనున్న, రాబోయే ఆర్థిక సంవత్సరాల్లో సాధించాల్సిన కాంట్రిబ్యూషన్ రెండంకెల వృద్ధిలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా 5.79 శాతం, కృష్ణాజిల్లా 5.57 శాతం కాంట్రిబ్యూషన్‌ను నమోదు చేశాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా 6.04 శాతం, కృష్ణాజిల్లా 5.53 శాతం కాంట్రిబ్యూషన్‌ను నమోదు చేశాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం (ఇంకా ముగియలేదు)లో ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా 5.94 శాతం, కృష్ణాజిల్లా 5.51 శాతంలో ఉన్నాయి. రాబోయే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఎన్టీఆర్ జిల్లా 6.01 శాతం, కృష్ణాజిల్లా 5.50 శాతం మేర రాష్ట్ర జీడీపీకి కాంట్రిబ్యూషన్ ఇచ్చేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి.
తలసరి ఆదాయంలో కీలక స్థానాలు
తలసరి ఆదాయంలో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. కృష్ణాజిల్లా తలసరి ఆదాయం రూ.4,18,997 కాగా, ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం రూ.3,53,150గా నమోదైంది. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే కృష్ణాజిల్లాలో రూ.69,313, ఎన్టీఆర్ జిల్లాలో రూ.64,262 మేర తలసరి ఆదాయం పెరిగింది. కృష్ణాజిల్లాలో 16.54 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 18.20 శాతం వృద్ధి నమోదైంది. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో కృష్ణాజిల్లా రూ.4,88,310, ఎన్టీఆర్ జిల్లా రూ.4,17,412 తలసరి ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.