Share News

లక్ష్య సాధనలో ముందడుగు

ABN , Publish Date - Mar 27 , 2025 | 01:08 AM

జిల్లా సమ్మిళిత అభివృద్ధికి బృహత ప్రణాళికతో ముందుకు కదులుతున్నామని కలెక్టర్‌ లక్ష్మీశ పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో రెండోరోజు బుధవారం కలెక్టర్‌ లక్ష్మీశ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లా నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతు గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. రూ.1,12,056 కోట్ల స్థూల ఉత్పత్తే లక్ష్యంగా, సేవారంగమే టార్గెట్‌గా వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లా సమగ్రాభివృద్ధికి ముందడుగు వేస్తామని కలెక్టర్‌ తెలిపారు.

లక్ష్య సాధనలో ముందడుగు
సీఎంతో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ లక్ష్మీశ

  • జిల్లా సమ్మిళిత అభివృద్ధికి బృహత ప్రణాళిక

  • రూ.1,12,056 కోట్ల స్థూల ఉత్పత్తే లక్ష్యం

  • 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18.50 వృద్ధి దిశగా ప్లాన్‌

  • సేవా రంగంలో రూ.69,220 కోట్లు లక్ష్యం

  • పారిశ్రామిక రంగంలో రూ.21,021 కోట్ల టార్గెట్‌

  • వ్యవసాయానుబంధ రంగంలో రూ.12,632 కోట్లు సాధిస్తాం..

  • రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎంకు కలెక్టర్‌ లక్ష్మీశ వివరణ

  • జిల్లాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారంపై వినతి

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఎన్టీఆర్‌ జిల్లా సమ్మిళిత అభివృద్ధికి, రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరంలో 18 శాతం పైబడి వృద్ధిని సాధించే ప్రణాళికలను కలెక్టర్‌ లక్ష్మీశ వివరించారు. సీఎం చంద్రబాబుతో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ రెండోరోజు కలెక్టర్‌ లక్ష్మీశ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా జిల్లా నిర్దేశించుకున్న లక్ష్యాలు, ప్రభుత్వం నుంచి కావాల్సిన మద్దతు గురించి వివరించారు. జిల్లాలో సేవ, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వినియోగించుకుని మరింతగా వృద్ధిని నమోదు చే సేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను వివరించారు. వ్యవసాయానుబంధ రంగంలో వ్యవసాయం కంటే కూడా ఉద్యానంలో జిల్లా పురోగతి సాధించటానికి ఉన్న అవకాశాలను తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల్లో ఆయకట్టును పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాంసం ఉత్పత్తులను 10 శాతం అదనంగా ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని, చేపల ఉత్పాదకతను గణనీయంగా పెంచటం కోసం కాట్ల, రోహు, మ్రిగాల్‌ వంటి రకాలను చెరువుల్లో పెంచడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. పది హెక్టార్లలో అటవీ ప్రాంతాలను సృష్టించేలా మొక్కలు నాటాలన్నది తమ లక్ష్యమని, 2025, జూలై నాటికి 10 కొత్త ఇసుక రీచ్‌లను తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని, మరో 12 పట్టా భూముల్లో డీ కాస్టింగ్‌కు చర్యలు తీసుకుంటామని వివరించారు. కొత్తగా ఖనిజాల అన్వేషణ సాగిస్తామన్నారు. అన్ని గ్రామాల్లో విద్యుదుత్పత్తి నాణ్యతను పెంచేందుకు వీలుగా 3 ఫేజ్‌ సరఫరా చేస్తామన్నారు. 41.5 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పీఎం సూర్యఘర్‌ కింద 25 వేల యూనిట్లను ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. నిర్మాణ రంగం ఊపందుకునేలా చేయటానికి సీసీ రోడ్ల నిర్మాణం, 8,256 ఇళ్ల నిర్మాణం, తిరువూరు వాటర్‌ పైపులైన్‌ ప్రాజెక్టు, నాబార్డు పనులు పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని పెంచేందుకు, సందర్శకుల సంఖ్యను 10 శాతం వృద్ధి చేసేందుకు ఎగ్జిబిషన్ల నిర్వహణ, హ్యాపీ సండే కార్యక్రమాలతో పాటు కొత్తగా మూడు ఈట్‌ స్ర్టీట్‌లను ప్రారంభిస్తామని చెప్పారు. ప్రతి గ్రామంలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను 100 ఎంబీబీఎస్‌ వేగంతో అందించేందుకు ఫైబర్‌నెట్‌ కనెక్షన్లను 50 వేల వరకు తీసుకెళ్తామని చెప్పారు. సేవా రంగాన్ని విస్తృతం చేయడానికి విజయవాడలో సీ ప్లేన్‌ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంతో పాటు అమరావతి రైల్వేలైన్‌ భూ సేకరణ వంటి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తామని కలెక్టర్‌.. సీఎం చంద్రబాబుకు వివరించారు.

  • వర్షాకాలంలో బుడమేరు సమస్య పరిష్కారం కోసం డైవర్షన్‌లో గండ్ల పునరుద్ధరణ పనుల కోసం రూ.38.09 కోట్లు, వెలగలేరు రెగ్యులేటర్‌ రిపేర్లకు రూ.1.86 కోట్లు, ట్రిబ్యుటరీల ఫ్లడ్‌ మరమ్మతుల కోసం రూ.92 కోట్లు అవసరమని కలెక్టర్‌ లక్ష్మీశ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో ప్రభుత్వం మంజూరు చేసినవి పోను రూ.92 కోట్లు అవసరమని విజ్ఞప్తి చేశారు.

  • విజయవాడ నగరంలో స్ర్టామ్‌ వాటర్‌ డ్రెయినేజీ పనులను 182 కిలోమీటర్ల మేర పూర్తి చేసేందుకు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. నగరంలో 1,266 కిలోమీటర్ల పొడవున డ్రెయిన్లు ఉన్నాయని, ఎల్‌అండ్‌టీ ఆధ్వర్యంలో 182 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నామని, అమృత ఇన్సెంటివ్‌లో భాగంగా రూ.30 కోట్లతో 7.66 కిలోమీటర్ల మేర పురోగతి సాధించామని, అదనంగా 1,100 కిలోమీటర్ల మేర నిర్మించటానికి నిధులు కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

  • సేవా రంగంలో అభివృద్ధి కోసం కలెక్టర్‌ కీలక సూచనలు చేశారు. జిల్లావ్యాప్తంగా 173 హోటళ్లు ఉండగా, అందులో 3,650 రూములు ఉన్నాయని, వీటిద్వారా 13.4 లక్షల మంది సందర్శకులు రాకపోకలు సాగిస్తున్నారని, సందర్శకుల సంఖ్యను గణనీయంగా పెంచటం కోసం బ్రాండ్‌ ఈవెంట్లు, టూరిజం సర్క్యూట్స్‌ నిర్వహించటం, ప్రచారం కోసం పీపీపీ విధానంలో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు అనుమతులు కోరారు.

  • నైపుణ్యం, ఉపాధి, ఇండస్ర్టీ ప్రమోషన్‌ కోసం స్కిల్‌ ట్రైనింగ్‌ సెంటర్ల ఏర్పాటు, జాబ్‌ మేళాల నిర్వహణ, పీపీపీ విధానంలో ఆటోమొబైల్‌ శిక్షణా సంస్థ ఏర్పాటుతో పాటు ఆటోనగర్‌లో లక్షమంది కార్మికుల శిక్షణకు సంబంధించిన అవసరాల గురించి కలెక్టర్‌ కోరారు.

జీడీడీపీలో లక్ష్యం ఇలా..

ఎన్టీఆర్‌ జిల్లాను తిరుగులేని ఆర్థిక శక్తిగా నిలిపేందుకు రూ.1,12,057 కోట్ల జిల్లా స్థూల దేశీయోత్పత్తి (జీడీడీ పీ) సాధించేలా జిల్లా యంత్రాంగం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జిల్లా స్థూల విలువ జోడింపు (జీడీవీఏ)గా రూ.1,02,873 కోట్లు, తలసరి ఆదాయం రూ.4,17,412ను సాధించేలా భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. జిల్లావ్యాప్తంగా సర్వీసు రంగంలో రూ.69,220 కోట్లు, పారిశ్రామిక రంగంలో రూ.21,021 కోట్లు స్థూల విలువను జోడించేలా నిర్దేశించుకున్న ప్రణాళికలను వివరించారు. వ్యవసాయానుబంధ రంగాలకు సంబంధించి రూ.12,632 కోట్ల స్థూల విలువ జోడింపును తెలియజేశారు. ప్రతి రంగంలో 15 శాతం పైబడి వృద్ధిని సాధించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. స్థూలంగా 18.50 శాతం వృద్ధి నమోదు లక్ష్యంగా పెట్టుకున్నట్టు కలెక్టర్‌ లక్ష్మీశ ముఖ్యమంత్రికి వివరించారు.

ఏ.కొండూరు కిడ్నీ వ్యాధులకు మరేదో కారణం.. సీఎంకు వివరించిన కలెక్టర్‌

తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ వ్యాధులు ప్రబలడానికి గల కారణాలపై జోద్‌పూర్‌లోని ఐసీఎంఆర్‌ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో జిల్లాస్థాయిలో నిపుణులతో అధ్యయనం చేయించామని, అయితే అక్కడ ఈ వ్యాధులకు కారణం నీటి సమస్య కాదని, ఇంకేదో ఉందన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారని కలెక్టర్‌ తెలిపారు. దీంతో ఐసీఎంఆర్‌ నిపుణులతో అధ్యయనం చేయించాలని సంకల్పించామని కలెక్టర్‌.. సీఎంకు వివరించారు.

Updated Date - Mar 27 , 2025 | 01:08 AM