ప్రగతి.. పురోగతి
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:02 AM
జిల్లా మూలధన ఆదాయం రూ.4,88,310 కోట్లు ఉండగా, ఈ ఏడాది 16.54 శాతం మేర వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నామని కలెక్టర్ బాలాజీ వివరించారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం జరిగిన మూడో విడత కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో జిల్లా అభివృద్ధి, వివిధ రంగాల్లో సాధించిన ప్రగతి, ఇంకా సాధించాల్సిన లక్ష్యాలపై కలెక్టర్ సోదాహరణంగా వివరించారు. జిల్లా మూలధన ఆదాయం, వివిధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వ నుంచి రావాల్సిన సహకారం గురించి ఆయన తెలిపారు. - ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం

క్యాపిటల్ ఇన్‌కమ్ ప్రధాన మార్గంగా జిల్లా పాలన
ప్రస్తుతం క్యాపిటల్ ఇన్‌కమ్ రూ.4,88,310 కోట్లు
వృద్ధిరేటును 16.54 శాతం మేర పెంచేలా సమగ్ర ప్రణాళిక
వ్యవసాయ, అనుబంధ రంగాలకు చేయూతనిచ్చేలా ప్లాన్
పెడనలో కలంకారీ క్లస్టర్ ఏర్పాటుకు సన్నాహాలు
జిల్లాలో అందుబాటులో 13 లక్షల టన్నుల ఇసుక
పంటలు భద్రపరచుకునేందుకు 18 గోడౌన్ల నిర్మాణం
జిల్లా సమగ్ర నివేదికను సీఎం చంద్రబాబుకు వివరించిన కలెక్టర్ బాలాజీ
వ్యవ సాయంలో ఎరువుల వినియోగం తగ్గించే విషయంలో రైతులకు అవగాహన కల్పించేందుకు 22 వేల భూసార పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు కలెక్టర్ బాలాజీ సీఎం చంద్రబాబుకు తెలిపారు. ఈ ఏడాది మే 31 నాటికి ఈ పనిని పూర్తి చేస్తామని చెప్పారు. 2025-26 సంవత్సరంలో ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేసేందుకు 141 పంచాయతీల్లోని 59,206 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. 890 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇందులో 100 హెక్టార్లలో 140 మంది రైతులతో పండ్లజాతి మొక్కల పెంపకం, 50 హెక్టార్లలో 80 మంది రైతుల ద్వారా కూరగాయలు, పూలసాగు, 690 హెక్టార్లలో 700 మంది రైతులతో వివిధ రకాల తోటలు, 60 మంది రైతులతో 50 హెక్టార్లలో సుగంధద్రవ్య మొక్కల సాగు చేపట్టాలని ప్రణాళికను రూపొందించామన్నారు. జూన్ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 2026, మార్చి నాటికి మైక్రో ఇరిగేషన్ పద్ధతిని 1,200 హెక్టార్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
పీఎంఈజీపీ పథకం ద్వారా జిల్లాలో 100 యూనిట్ల చిన్నతరహా పరిశ్రమలు, ఎంఎస్‌ఎంఈ ద్వారా 100 యూనిట్లు, నాలుగు పెద్ద పరిశ్రమలను 2026 చివరి నాటికి ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు. పెడనలో కలంకారీ క్లస్టర్‌ను 2026 చివరి నాటికి ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జిల్లాలోని ఇసుక రేవుల ద్వారా 13 లక్షల టన్నుల ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రూ.100 కోట్లతో వివిధ రకాల నిర్మాణాలు చేపట్టనున్నామన్నారు. జిల్లాలో 387 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో లోవోల్జేజీ సమస్యను తీర్చేందుకు పది 11 కేవీ విద్యుత సబ్‌స్టేషన్లను ఈ ఏడాదిలో నిర్మించనున్నామని కలెక్టర్ చెప్పారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఓఎన్‌జీసీ సహకారంతో బంటుమిల్లి మండలంలో తొమ్మిది తాగునీటి బావులను తవ్వించనున్నట్లు చెప్పారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించే వరకు నిల్వ చేసుకునేందుకు జిల్లాలో 18 గోడౌన్ల నిర్మాణాలను ఈ ఏడాది సెప్టెంబరులోగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 800 బోట్లకు ట్రాన్స్‌పాండర్‌లను వచ్చే జూన్ నాటికి ఏర్పాటు చేస్తామన్నారు.
జిల్లాలో బ్యాంకుల సేవలను మరింతగా పెంచేందుకు మే నెలలోగా ఇండియన్ బ్యాంక్, ఎస్‌బీఐ బ్రాంచ్‌లను ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద అన్ని పంటలకు పంటబీమా వర్తింపజేయనున్నామన్నారు. మచిలీపట్నంలో స్టార్ హోటల్ నిర్మాణం, బీచ్‌లో రీసార్ట్‌లను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించామని, దీనికోసం రెండు నుంచి మూడెకరాల భూమిని కేటాయించినట్లు తెలిపారు.
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల మంది మహిళలకు కేన్సర్ స్ర్కీనింగ్ టెస్టులు చేయించేందుకు ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో నేరాలను అదుపు చేసేందుకు 2,715 సీసీ టీవీలు, డ్రోన్ కెమెరాలను వినియోగించనున్నామన్నారు. జిల్లాలో 61 సంక్షేమ వసతి గృహాలకు సెప్టెంబరులోగా మరమ్మతులు చేయడానికి అంచనాలు రూపొందించామని వివరించారు. ఇందులో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 37, బీసీ సంక్షేమ వసతి గృహాలు 24 ఉన్నట్లు తెలిపారు.
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతరత్రా వర్తక, వాణిజ్యం ద్వారా వచ్చే ఆదాయం రూ.15,294 కోట్లు ఉండగా, ఈ ఏడాది ఆ రంగాల్లో వృద్ధి రేటును 22.18 శాతం మేర పెంచాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రెండు కోల్డ్ స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. రైల్వే విభాగంలో రూ.168 కోట్ల జీడీవీఏ ఉండగా, రవాణా, ఇతర త్రాల రూపంలో రూ.5,532 కోట్లు ఉందని, ఈ ఏడాది ఆ వృద్ధి రేటును 16.83 శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. కమ్యునికేషన్ విభాగంలో రూ.1,149 కోట్లు ఉండగా, ఈ ఏడాది 17 శాతం వృద్ధిని సాధించాలని ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రియల్ ఎస్టేట్, ఇతరత్రాల రూపంలో రూ.5,956 కోట్ల వ్యాపారం ఉండగా, ఈ ఏడాది 18.41 శాతం, పబ్లిక్ అడ్మినిసే్ట్రషన్‌లో రూ.2,335 కోట్లు ఉండగా, ఈ ఏడాది 9.89 శాతం మేర వృద్ధిని సాధించాలని నిర్ణయించామన్నారు. విద్య, వైద్యం, రిక్రియేషన్ విభాగాల్లో రూ.4,602 కోట్లు ఉండగా, ఈ ఏడాది 16.72 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లా మొత్తంగా క్యాపిటల్ ఇన్‌కమ్ రూ.4,88,310 కోట్లు ఉండగా, 16.54 శాతం మేర వృద్ధిని సాధించాలని లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
ప్రభుత్వ సహకారంతో మచిలీపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపన కోసం ముడా వద్ద 511.95 ఎకరాలు, మరో 7 వేల ఎకరాల సాల్ట్ భూములను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ తెలిపారు. అమృత-1 పథకం ద్వారా మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్‌లో డ్రెయిన్లకు 122 ప్రాంతాల్లో లింక్‌లను కలిపేందుకు రూ.13.03 కోట్లతో అంచనాలు రూపొందించామన్నారు. ఈ కార్పొరేషన్‌లో డ్రెయిన్ల సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.164 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి నివేదికను పంపామని తెలిపారు. నీటిపారుదల, డ్రెయినేజీ విభాగాల్లో కాల్వల నిర్వహణ కోసం 722 పనులకు రూ.36.72 కోట్లతో అంచనాలను రూపొందించి నివేదికను ప్రభుత్వానికి పంపామని, అనుమతులు రావాల్సి ఉందన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ కోసం డ్రయ్యర్ సౌకర్యం కోసం ప్రతిపాదనలను పంపామని తెలిపారు.
వ్యవసాయంలో జీడీవీఏ రూ.4,212 కోట్ల మేర ఉండగా 13.12 శాతంగా నమోదైందని, ఉద్యాన పంటల సాగులో రూ.2,793 కోట్లు ఉండగా, 9.47 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జూన్ 10న వరి సాగునీటిని విడుదల చేస్తే అక్టోబరులోనే వరికోతలు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కాల్వలకు సాగునీటిని విడుదల చేయడంతో పంటల సాగు ఆలస్యమై నవంబరులో కురిసే భారీ వర్షాలకు పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. ఈ ఏడాది 31,784 హెక్టార్లలో పచ్చిరొట్ట ఎరువులను సాగుచేసి భూసారాన్ని పెంచే ఆలోచన చేస్తున్నామన్నారు. మత్స్యసంపద ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం రూ.321.30 కోట్లు ఉండగా, 15.21 శాతం వృద్ధిరేటు సాధించాలని, 32,804 ఎకరాలను ఆక్వాజోన్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు తెలిపారు. సోలార్ పవర్‌ను ఆక్వా చెరువుల్లో వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.