Share News

ఎన్టీఆర్‌ జిల్లాను అగ్రభాగంలో నిలుపుదాం

ABN , Publish Date - Mar 30 , 2025 | 01:24 AM

కొండపల్లి ఖిల్లా పై శనివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడారు.

ఎన్టీఆర్‌ జిల్లాను అగ్రభాగంలో నిలుపుదాం
జిల్లా అభివృద్ధిపై వివరాలు తెలుసుకుంటున్న ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, కలెక్టర్‌ లక్ష్మీశ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్‌, శ్రీరాం తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు, విప్‌ తంగిరాల సౌమ్య

జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌

ఇబ్రహీంపట్నం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్టీఆర్‌ జిల్లాలో సముద్ర తీరం తప్ప అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు అనుకూలమైన అన్ని వనరులు ఉన్నా యి. అధికారులంతా సమన్వయంతో, చిత్తశుద్ధితో పనిచేస్తే తలసరి ఆదాయంలో ఇప్పుడున్న మూడో స్థానం నుంచి అగ్రస్థానంలో జిల్లాను నిలపొచ్చు.’ అని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ అన్నారు. కొండపల్లి ఖిల్లా పై శనివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వరకు సాయం అందుతోందన్నారు. రూ.27 వేల కోట్ల రైల్వేలైన్‌ పనులు, రూ.3 లక్షల కోట్లతో హైవే రోడ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 2047 వర కు ఏటా 15 శాతం వృద్ధి రేటు టార్గెట్‌గా పెట్టుకోవాలని అందుకు ప్రతి అధికారి పూర్తి సహకారం అందించాలని కోరారు. అలసత్వం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఖిల్లాపై జైలును పర్యాటక ప్రాంతంగా మార్చాలి

కొండపల్లి ఖిల్లాపై జైలును అండమాన్‌ జైలులా పర్యాటక ప్రాంతంలా మార్చాలని అధికారులకు మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ సూచించారు. కొండపల్లి కోటకు వచ్చే అప్రొచ్‌ రోడ్డు దిగువ భాగంలో బూడిద లారీలు తిరుగుతున్నందున దాన్ని ఎన్టీటీపీఎస్‌ అఽధికారులతో మాట్లాడి సీసీ రోడ్డుగా అభివృద్ధి చేస్తామన్నారు. సూర్యఘర్‌ పథకానికి 80 వేల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని 1,000 మందే ఇన్‌స్టాలేషన్‌ చేసుకున్నారని విద్యుత్‌శాఖ అఽధికారులు చెప్పడంతో మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పీఎంఎ్‌ఫబీవైపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో 1.4 లక్షల మంది రైతులుంటే 3,187 మందికే బీమా ప్రీమియం చెల్లించడం ఏమిటని ప్రశ్నించారు. పలుచోట్ల ఆర్వోబీలు, ఆర్‌యూబీలపై రైల్వే అధికారులు, విద్యుత్‌శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం ఉందని దాన్ని సరి చే సుకోవాలని సూచించారు.

టూరిజం హబ్‌గా జిల్లాను తీర్చిదిద్దుతాం: కలెక్టర్‌ లక్ష్మీశ

జిల్లాను టూరిజం హబ్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ లక్ష్మీశ తెలిపారు. పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలు చూసేలా టూరిజం ప్యాక్‌ను తయా రు చేస్తున్నామన్నారు. విజయవాడలో ఇప్పుడున్న ఫుడ్‌ కోర్టుతో పాటు మరో మూడు చోట్ల ఫుడ్‌ కోర్టుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. సితార సెంటర్‌లో రూ.2 కోట్లతో ఒకదాని పనులు ప్రారంభించామన్నారు. ప్రభుత్వాస్పత్రి వద్ద, బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫుడ్‌ కోర్టులు పెడతామన్నారు. గత ప్రభుత్వ హయంలో జి.కొండూరు మండలం సున్నంపాడు గ్రామంలో 230 ఎకరాలను వీఎంసీ లబ్ధిదారులకు నివేశన స్థలాలుగా ఇచ్చేందుకు కేటాయిస్తే అక్కడకు ఎవ్వరూ వెళ్లలేదని, అది నిరుపయోగంగా ఉందని దాన్ని పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని అన్నారు.

ప్రజా సమస్యల కంటే వైసీపీకి రాజకీయమే ముఖ్యమా

ఏపీఐసీసీ కాలనీలో 488 కుటుంబాలు ఉంటున్నాయి. 2,500 మంది నివాసం ఉంటున్నారు. వారికి మంచినీరు ఇచ్చే పనులకు కౌన్సిల్‌లో బలం ఉందని వైసీపీ వాళ్లు అడ్డుపడ్డారు. దాన్ని ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. ప్రజా సమస్యల కంటే వైసీపీకి రాజకీయమే ముఖ్యమా? ఇప్పటికే మంత్రి నారాయణతో, ప్రిన్సిపల్‌ సెక్రటరీతో మాట్లాడా. ఈవేసవిలో ఆ కాలనీకి మంచినీరు అందించేలా చూడాలి. కోతులు పట్టే వారిని పంపిస్తే నా సొంత నిధులుస్తా. గుణదల మేరీమా త ఆలయానికి వచ్చే భక్తుల కోసం బస్టాండ్‌, రైల్వే స్టేషన్‌ నుంచి రామవరప్పాడు రింగ్‌ వరకు బస్సులు అధిక సంఖ్యలో తిప్పాలి. రాణిగారి తోట వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నందున అక్కడ సబ్‌వేల నిర్మాణంలో అధికారులు చొరవ తీసుకోవాలి. మొగల్రాజుపురంలో సీఎస్‌ఐ స్కూల్‌ను తక్షణం తెరిపించాలి.

- ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌

అనాసాగరం ఎన్‌హెచ్‌ బాధితులకు న్యాయం చేయాలి

అనాసాగరం ఎన్‌హెచ్‌ కింద భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలి. నందిగామ ప్రభుత్వాస్పత్రిని 50 పడకల నుంచి 100 పడకలకు పెంచడం సంతోషంగా ఉంది.

- ప్రభుత్వ విప్‌ తంగిరాల సౌమ్య

రామచంద్రాపురం వద్ద రహదారి సమస్య పరిష్కరించాలి

ఎ.కొండూరు మండలం రామచంద్రాపురం వద్ద రహదారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ పనులకు గ్రావెల్‌ దొరకని పరిస్థితి ఉంది. గ్రావెల్‌ సమస్యకు పరిష్కారం చూపాలి. ఎ.కొండూరుకు త్వరితగతిన మంచినీరు అందేలా చూడాలి.

-ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు

టిడ్కో ఇళ్ల వ్యవహారం త్వరగా తేల్చాలి

టిడ్కో ఇళ్ల వ్యవహారాన్ని త్వరగా తేల్చాలి. ప్రభుత్వమే లబ్ధిదారులు వడ్డీని భరించాలి. జక్కంపూడిలో పేదలకు నివేశనా స్థలాల ఇవ్వాలి. అంబేడ్కర్‌ స్మృతి వనం వద్ద రైతుబజారు ఏర్పాటు చేయాలి.

- ఎమ్మెల్యే బొండా ఉమా

రైతుల్ని ఆదుకోవాలి

మునేరు, పాలేరు వరదల వల్ల నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. గండ్లు పూడ్చాలి. ఎకరంలో మేట వేసిన ఇసుకను తొలగించేందుకు లక్షల్లో ఖర్చవుతోంది. దాన్ని వేరే అవసరాలకు మళ్లిస్తే ఆదాయం తో పాటు ప్రభుత్వానికి ఖర్చు కలిసి వస్తుంది. జగ్గయ్యపేట నగరవనం (వేదాద్రి), ముక్త్యాల అతిథిగృహాన్ని వినియోగంలోకి తేవాలి. బోట్‌ షికారును అభివృద్ధి చేయాలి. జగ్గయ్యపేటలో 586 ఎకరాల సీలింగ్‌ ల్యాండ్‌ సమస్యను పరిష్కరించాలి.

- ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌

Updated Date - Mar 30 , 2025 | 01:24 AM