Share News

పాస్టర్‌ ప్రవీణ్‌ హత్య కేసు.. నగరంలో దర్యాప్తు

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:47 AM

పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు బెజవాడతో లింక్‌ కలిసింది. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ప్రవీణ్‌కుమార్‌ నగరంలో మూడు, నాలుగు గంటల పాటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

పాస్టర్‌ ప్రవీణ్‌ హత్య కేసు.. నగరంలో దర్యాప్తు

రాజమండ్రి నుంచి వచ్చిన పోలీసులు

సీసీ కెమెరాల పరిశీలన జూ ఆ నాలుగు గంటలు ఎక్కడున్నారని కూపీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ మృతి కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు బెజవాడతో లింక్‌ కలిసింది. హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ప్రవీణ్‌కుమార్‌ నగరంలో మూడు, నాలుగు గంటల పాటు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇదే విషయాన్ని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ఈనెల 24న హైదరాబాద్‌ నుంచి బయల్దేరిన ప్రవీణ్‌కుమార్‌ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలో అనుమానాస్పదంగా మరణించిన విషయం తెలిసిందే. ప్రవీణ్‌కుమార్‌ది కచ్చితంగా హత్యేనని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు రాజమహేంద్రవరం కేంద్రంగా సాగిన దర్యాప్తు ఇప్పుడు నగరానికి మారింది. అక్కడి నుంచి పోలీసు బృందాలు నగరానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నాయి. ఎంజీ రోడ్డులోని ఆపరేషనల్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీసీ కెమెరాల ఫుటేజీలను వారు పరిశీలిస్తున్నారు.

ఆ మూడు, నాలుగు గంటలు ఎక్కడున్నారు?

హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయల్దేరిన ప్రవీణ్‌కుమార్‌ నగరంలో మూడు, నాలుగు గంటలు ఎక్కడున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్‌ కేంద్రంగా సొంతంగా మినిసీ్ట్రని నిర్వహిస్తున్న ప్రవీణ్‌కుమార్‌కు నగరంలో బంధువర్గం లేదని అతని సన్నిహితులు చెబుతున్నారు. సాధారణంగా వివిధ మినిసీ్ట్రలు నిర్వహించే సువార్త మహాసభలకు వేర్వేరు మినిసీ్ట్రలకు చెందిన పాస్టర్లను ప్రసంగీకులుగా ఆహ్వానిస్తారు. ప్రవీణ్‌కుమార్‌ నగరంలో నిర్వహించిన సువార్త మహాసభల్లో ఇప్పటి వరకు పాల్గొనలేదని చెబుతున్నారు. మినిసీ్ట్రల ద్వారా ఇక్కడున్న కొంతమంది పాస్టర్లతో ప్రవీణ్‌కుమార్‌కు సన్నిహిత సంబంధాలు ఏర్పడినట్టు చెబుతున్నారు. ఈనెల 24 ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై బయల్దేరిన ఆయన ఇక్కడికి వచ్చేసరికి అలసిపోయి స్నేహితులు ఇళ్లలో విశ్రాంతి తీసుకోవడానికి ఆగారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్‌కుమార్‌ ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా విచారణ చేస్నున్నట్టు తెలిసింది.

Updated Date - Mar 30 , 2025 | 12:47 AM