Narayana Statement: వైసీపీ అంతా నాశనం చేసింది.. మంత్రి నారాయణ సీరియస్
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:20 PM
Narayana Statement: గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు వేలకోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు.

విజయవాడ, ఏప్రిల్ 2: దేశంలోనే మొట్టమొదటిసారిగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుజనా సర్వీస్ సెంటర్ మంత్రి నారాయణ (Minister Narayan) ఈరోజు (బుధవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘సుజనా చౌదరి 2004 నుంచి నాకు పరిచయం. కేంద్ర మంత్రిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్రను ప్రారంభించినందుకు నా అభినందనలు. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆదర్శ నియోజకవర్గంగా చేసేందుకు తపన పడుతున్నారు. 2014-19లో ఇదే శాఖకు నేను మంత్రిగా ఉన్నా. ఇప్పుడు కూడా అదేశాఖకు మంత్రిగా ఉన్నాను. గతంలో మా శాఖలకు బడ్జెట్ ఉండేది పనులు జరిగేవి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద బడ్జెట్ పోతుంది’ అని తెలిపారు.
రోజుకి 135 లీటర్ల నీరు ఇవ్వాలని రూ.5350 కోట్లు తెచ్చేలా 2019 ఫిబ్రవరిలో ఒప్పందం చేసుకున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర వాటా చెల్లించకుండా ఆపేసిందని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిధులు ఇచ్చి ఉంటే ప్రతి ఇంటికి మనిషికి 135 లీటర్ల నీరు అందేదన్నారు. మళ్ళీ సీఎం చంద్రబాబు చొరవతో నిధులు తీసుకొస్తున్నామని తెలిపారు. స్వచ్ఛాంధ్ర కింద యాభై శాతం కేంద్రం, యాభై శాతం రాష్ట్రం భరించాలన్నారు. కేంద్రం రూ.250 కోట్లు ఇస్తే... రాష్ట్రం రూ.150 కోట్లు మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదని తెలిపారు. ఇలా అనేక పధకాలకు నిధులు రాకుండా గత ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శించారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇదే పరిస్థితి అవలంబించారన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆగిన నిధులు తెచ్చుకునేందుకు కష్టాలు పడుతోందని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు వేలకోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు.
Supreme Court Party Defection Case: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు.. సుప్రీం ఏం చెప్పిందంటే
నేడు ఏ మున్సిపాలిటీలో అయినా వచ్చిన ఆదాయం వారే ఖర్చు పెట్టుకునేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. డ్రైనేజీ వర్కులు ఆగిపోతే... సీఎం అదేశాలతో మళ్లీ మొదలుపెట్టామన్నారు. ఉగాది రోజు పీ4ను చంద్రబాబు ప్రారంభించారని.. అదే స్పూర్తితో సుజనా చౌదరి తన ఫౌండేషన్ ద్వారా చేయడం గొప్ప విషయమని కొనియాడారు. తాను కూడా ఇతర నియోజకవర్గాల్లో ఈ తరహా సేవలు అందించేలా కృషి చేస్తానని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఆ మూడు దానాల సమన్వయమే మా లక్ష్యం: సుజనాచౌదరి
ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ.. పశ్చిమ నియోజకవర్గంలో తాను దుర్భర పరిస్థితులను చూసి చాలా ఆవేదన చెందానన్నారు. ఎమ్మెల్యేగా చాలా చేయవచ్చు అనుకున్నానని.. కానీ అన్నీ చేయలేం అని అర్ధమైందన్నారు. ‘నా దగ్గరకు వచ్చిన పనులు అన్నీ చేస్తున్నా. ప్రజల సహకారం కూడా చాలా అవసరం. సీఎం రిలీఫ్ ఫండ్, పధకాలు ప్రభుత్వంపరంగా ఇప్పించగలను. ప్రతి పనీ సీఎం, ప్రజాప్రతినిధులే చేయాలని భావిస్తున్నారు. గత ఐదేళ్లలో విధ్వంసం పాలనతో ప్రభుత్వాన్ని దివాళా తీశారు. అసలు వ్వవస్థలను గాడిలో పెట్టడానికే కూటమి ప్రభుత్వం చాలా కష్టపడుతోంది’ అని ఆయన అన్నారు.
సీఎం చంద్రబాబు పీ4 విధానంతో పేదలను అర్దికంగా పైకి తెచ్చే కార్యక్రమం చేపట్టారన్నారు. ఈలోగా తన వంతుగా ప్రజలకు ఏం చేయాలని ఆలోచన చేశానని.. తన నియోజకవర్గం ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ముందుంటానని స్పష్టం చేశారు. తాను ఎక్కడ ఉన్నా... నియోజకవర్గం ప్రజలు, అభివృద్ధి గురించి ఆలోచిస్తానన్నారు. గతం మళ్లీ రాదు కాబట్టి.. భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే పనులు చేస్తామని వెల్లడించారు. మన పదవి ద్వారా ప్రజలకు ఏం చేయాలా అని ప్రజాప్రతినిధులుగా తాము ఆలోచన చేస్తున్నామన్నారు. మేధస్సును దానం చేసేందుకు చాలా మంది నిపుణులు ఉన్నారన్నారు. శ్రమదానం చేసేందుకు చాలా మంది ఉన్నారన్నారు. ధనదానం చేయాలని ఉన్నా అందరూ చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ఈ మూడు దానాలను సమన్వయం చేయడమే ఇప్పుడు తమ లక్ష్యమన్నారు. ఓట్ల సమయంలోనే తాము రాజకీయాలు చేస్తామని.. ఇప్పుడు తన, మన అనే బేధం మాకు లేదని... అందరికీ మా సాయం అందిస్తామని చెప్పారు.
అసలు ప్రభుత్వాలు ఏ పధకాలు అమలు చేస్తున్నాయో కూడా చాలా మందికి తెలియదన్నారు. వాటిపై ప్రతిఒక్కరూ అవగాహన కల్పించుకోవాలని సూచించారు. జీవన ప్రమాణాలు పెంచుకునేలా ముందుకు సాగాలన్నారు. అనారోగ్యం బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునే విధానాలను తమ వాళ్లు వివరిస్తున్నారని చెప్పారు. అన్ని రంగాల్లో ఉన్న సమర్ధులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. వారి మేధస్సు ను నేటి తరానికి పంచాలన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అసాంఘిక శక్తులు పెరిగాయన్నారు. సీసీ కెమెరాలు పెడదామంటే అప్పు పుట్టకుండా గత ప్రభుత్వం ముందే తీసుకుందన్నారు. సుజనా ఫౌండేషన్‌తో పాటు, మరికొందరు ముందుకు వచ్చారన్నారు. వారి సహకారంతో త్వరలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
పోలీసులు న్యాయం, ధర్మం చూసి విధులు నిర్వహించాలన్నారు. తప్పు చేసిన వారు అధికార పార్టీ అయినా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు తప్పు చేసినా , అన్యాయం చేసినా తన దృష్ట కి తీసుకురావాలన్నారు. స్థానిక కార్పొరేటర్లు కూడా ముందుకు వచ్చి పని చేయాలని చెప్పామన్నారు. అన్యాయంగా ఉన్న సిఫార్సులను పోలీసులు పట్టించుకోవద్దన్నారు. భవిష్యత్తులో కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..
Ameenpur Case Twist: అమీన్‌పూర్ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం
Read Latest AP News And Telugu News