వైసీపీ బుకీ.. ఆటకట్టు
ABN , Publish Date - Mar 29 , 2025 | 12:31 AM
ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ జోరులో వైసీపీ బుకీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అవనిగడ్డ నుంచి వచ్చి పటమట కేంద్రంగా రూ.లక్షల్లో పందేలు కడుతున్న అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి కుమారుడు పవన్‌కుమార్‌ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతని ఫోన్, బ్యాంక్ ఖాతాను పరిశీలించిన పోలీసులు తెరవెనుక ఉన్న వారిని బయటకు లాగే పనిలో పడ్డారు.

ఐపీఎల్ బెట్టింగ్‌లో అవనిగడ్డ ఎంపీపీ కుమారుడి అరెస్టు
ముందస్తు సమాచారంతో చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
అవనిగడ్డ నుంచి వచ్చి పటమట కేంద్రంగా బెట్టింగ్‌లు
అతని బ్యాంక్ ఖాతాలో భారీ నగదు నిల్వలు
జనసేన మద్దతుదారుడూ పోలీసుల అదుపులో..
నెట్‌వర్క్‌ను ఛేదించే పనిలో కాప్స్
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ బెట్టింగులకు నగరంలోని అయ్యప్పనగర్ నెహ్రూ రోడ్డులో ఉంటున్న ఇళ్ల లోకేశ్ (30) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనను పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణించారు. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న బెట్టింగ్ నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ప్రత్యేక బృందాన్ని నియమించారు. బుకీలపై నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో వేటాడదామని వేచి ఉన్న ఈ బృందానికి వైసీపీకి చెందిన అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి కుమారుడు పవన్‌కుమార్ దొరికినట్టు తెలిసింది. అతడు విస్తరించిన నెట్‌వర్క్ ద్వారా కృష్ణాజిల్లాకు చెందిన మరో బుకీని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ బుకీ జనసేనకు మద్దతుదారుడిగా ఉన్నట్టు తెలిసింది.
పటమటలో పందేలు
సన్‌రైజర్స్ హైదరాబాద్, లఖ్‌నవు సూపర్ జైంట్స్ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. దీనిపై పటమటలోని దర్శిపేటకు సమీపాన రాఘవనగర్‌లో ఉంటున్న తుంగల పవన్‌కుమార్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. వారు వెంటనే ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. పవన్‌కుమార్ ఉంటున్న స్థావరాన్ని చుట్టిముట్టి లోపలకు వెళ్లే సరికి పందేలు జరుగుతున్నాయి. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. పవన్‌కుమార్ బ్యాంక్ ఖాతాను పరిశీలించగా, లక్షలాది రూపాయల నిల్వ ఉన్నట్టు గుర్తించారని తెలిసింది. అతడిని విచారణ చేయగా, ఉమ్మడి కృష్ణాజిల్లా మొత్తం నెట్‌వర్క్‌ను విస్తరించినట్టు వెల్లడించాడని సమాచారం. పవన్‌కుమార్‌తో నిత్యం ఫోన్లలో ఎవరెవరు సంభాషణలు జరిపారన్న వివరాలను ఈ ప్రత్యేక బృందం ఆరా తీసినట్టు తెలిసింది. అతడి ఫోన్ సంభాషణలన్నీ ఎక్కువగా వాట్సాప్ కాల్స్ ద్వారా సాగినట్టు సమాచారం. పవన్‌కుమార్‌తో నిత్యం సంప్రదింపులు జరుపుతున్న అవనిగడ్డకు చెందిన జనసేన మద్దతుదారుడు చెన్నా గోపయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పవన్‌కుమార్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించినట్టు ఆరోపణలు ఉన్నాయి. అతడి స్వస్థలం అవనిగడ్డ అయినప్పటికీ విజయవాడ కేంద్రంగా బెట్టింగ్‌లు నడుపుతున్నాడు. పవన్‌కుమార్ ప్రధాన బుకీగా ఉంటూ ఉమ్మడి జిల్లాలో సబ్‌బుకీలను నియమించుకున్నాడు. ఈ నెట్‌వర్క్‌ను ఛేదించి మిగిలిన బుకీల ఆట కట్టించే పనిలో ప్రత్యేక బృందం ఉన్నట్టు తెలిసింది.
ఆ డబ్బంతా పందేలదేనా..?
పవన్‌కుమార్ ఖాతాలో ఉన్న భారీ నగదు నిల్వ ఎవరిదన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. బెట్టింగ్‌లో గెలిచిన వారికి చెల్లించాల్సిన మొత్తంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మొత్తం తన కష్టార్జితంగా పవన్‌కుమార్ చెబుతున్నట్టు తెలిసింది. గోపయ్య బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసు అధికారులు త్వరలో అధికారికంగా వివరాలు వెల్లడిస్తారని సమాచారం.