Share News

ప్రేమ కోసం పిడకల సమరం

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:03 AM

ఆస్పరి మండలంలో ప్రతి ఏటా ఓ సంబరం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కైరుప్పల గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకుంటూ తమ భక్తిని చాటుకోవడం ఇక్కడి ప్రత్యేకత. కైరుప్పల గ్రామంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది.

ప్రేమ కోసం పిడకల సమరం
ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో పిడకలతో కొట్టుకుంటున్న గ్రామస్థులు

30 నిమిషాల పోరాటం

సమరంలో 45 మందికి పైగా స్వల్ప గాయాలు

కర్నూలు జిల్లాలో ఏళ్ల తరబడి వినూత్న ఆచారం

ఆస్పరి మార్చి 31 (ఆంధ్రజ్యోతి): ఆస్పరి మండలంలో ప్రతి ఏటా ఓ సంబరం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కైరుప్పల గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పిడకలతో కొట్టుకుంటూ తమ భక్తిని చాటుకోవడం ఇక్కడి ప్రత్యేకత. కైరుప్పల గ్రామంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. పిడకల సమరం సోమవారం వేలాది మంది జన సమక్షంలో ఉత్కంఠ భరితంగా సాగింది. ఈ సమరంలో 45 మందిపైగా స్వల్పంగా గాయపడ్డారు. సంప్రదాయం ప్రకారం కారుమంచి నుంచి పెద్దరెడ్డి వంశస్తుడైన నందకిశోర్‌ రెడ్డి గుర్రంపై మందీ మార్బలం, మేళతాళాలతో కైరుప్పలకు వచ్చి ఆలయంలోకి వెళ్లి పూజలు చేసి వెనుతిరగగానే ఈ పిడకల సమరం మొదలైంది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి, కాళికాదేవి వర్గీయులుగా గ్రామస్థులు విడిపోయారు. పరస్పరం పిడకలతో దాడి చేసుకున్నారు. వందల సంఖ్యలో పిడకలు గాల్లోకి లేచి ప్రత్యర్థి వర్గంపై పడుతుంటే ఉత్సాహం రెట్టింపైంది. పిడకల దుమ్ము అకాశాన్నంటింది. తమను తాము రక్షించుకుంటూ ఎదుటి వారిపై పిడకలు విసురుకుంటూ గుంపులుగా ప్రజలు కదిలారు. ఓసారి ఒక వర్గం వారిది పైచేయి అయితే, ఇంకోసారి మరో వర్గం వారిది పైచేయిగా నిలిచింది. తమవర్గం వారు గెలవాలనే తపనతో మహిళలు పిడకలు అందిస్తూ సాయంగా నిలిచారు. ఒక చోట కుప్పగా వేసిన పిడకలు అయిపోయేంత వరకు అరగంట పాటు ఈ సమరం కొనసాగింది. దెబ్బలు తగిలిన వారు స్వామి వారి విభూది రాసుకున్నారు. మూడు రోజుల్లో ఆ గాయం నయమవుతుందన్న ప్రగాఢ నమ్మకం వారిది. ఈ సమరం ముగిసిన తర్వాత గ్రామపెద్దలు పంచాయితీ చేసి కాళికాదేవి, వీరభద్రస్వామి వారి వివాహానికి అంగీకారం తెలిపారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు కైరుప్పల చుట్టుపక్కల గ్రామాల పుప్పాలదొడ్డి, కారుమంచి, కల్లపర్రి, పుటకలమర్రి, అలారుదిన్నె, బిల్లేకల్లు, చెన్నంపల్లి, వలగొండ, ఆస్పరితో పాటు తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఇదిలా ఉండగా పిడకల సమరానికి డీఎస్పీ వెంకటరామయ్య, ఆస్పరి సీఐ మస్తాన్‌వలి ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్‌ఐలు, 60 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు.

ప్రచారంలో ప్రేమ కథ

ఉగాది సమయంలో ఇక్కడ జరిగే పిడకల సమరం వెనుక ఆసక్తికర కథనం ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో భద్రకాళి దేవి, వీరభద్ర స్వామి ప్రేమికులు. వారి మధ్య ప్రేమ వ్యవహారం కాస్త గొడవకు దారితీస్తుంది. పెళ్లి విషయంలో వీరభద్రస్వామి కొంత ఆలస్యం చేస్తారు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకోకుండా. తమ భద్రకాళి దేవిని వీరభధ్ర స్వామి మోసం చేశారని అమ్మవారి తరపు భక్తులు నమ్మి వీరభద్ర స్వామిని ఆవు పేడతో తయారు చేసిన పిడకలతో కొట్టి అవమానించాలని చూస్తారు. ఈ విషయం తెలుసుకొన్న వీరభద్ర స్వామి భక్తులు, అమ్మవారు ఉండే ఆలయం వైపు వీరభద్ర స్వామిని వెళ్లవద్దని వేడుకున్నారు. అయినా స్వామివారు ఆలయం వైపు వెళ్లారని, అప్పుడు అమ్మవారి భక్తులు ముందుగా వేసుకున్న ప్రణాళికలో భాగంగా వీరభద్ర స్వామి వారిపై పిడకలతో దాడి చేశారని ఇక్కడి ప్రజల కథనం.

గాయమైనా..మూడు రోజుల్లో నయమవుతుంది

పిడకల సమరంలో గాయాలవుతాయి. గాయమైన చోట స్వామివారి విభూతి రాసుకుంటే మూడు రోజుల్లో ఆ గాయం కనబడదు. ఎలాంటి నొప్పి ఉండదు. గాయమైనప్పుడు మాత్రమే నొప్పి ఉంటుందేమో కానీ ఆ తర్వాత ఎలాంటి నొప్పి ఉండదు.

- పవన్‌ కళ్యాణ్‌, కైరుప్పల

గాయాలైనా ఏమీ కాదు

పిడకల సమరంలో గాయాలు తగులుతుంటాయి. దెబ్బలు తగిలిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. గాయమైన వెంటనే దేవాలయంలోకి వెళ్లి అక్కడ ఉన్న బండారు గాయమైన ప్రదేశంలో రాసుకుంటాము. నొప్పి అనేది ఉండదు. మూడు రోజుల్లో గాయమైన చోట కనీసం మచ్చ కూడా ఉండదు.

- రమేష్‌, కైరుప్పల

Updated Date - Apr 01 , 2025 | 12:03 AM