Share News

కర్నూలు ప్రగతి అజెండా..!

ABN , Publish Date - Mar 25 , 2025 | 12:09 AM

రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు రేపు, ఎల్లుండి నిర్వహించనుంది. రాబోయే ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు.

కర్నూలు ప్రగతి అజెండా..!
హెడ్‌ స్లూయిస్‌ పనులతో ఆగిపోయిన ఆర్డీఎస్‌ కుడి కాలువ

స్మార్ట్‌ సిటీగా కర్నూలును అభివృద్ధి చేయాలి

వలసల నివారణకు ప్రత్యేక ప్రణాళిక

ఆర్డీఎస్‌ కుడి కాలువ, వేదవతి ప్రాజెక్టులతో కరువు నివారణ

గుండ్రేవులపై దృష్టి సారించాలి

వాటర్‌ గ్రిడ్‌ ద్వారా తాగునీటి సమస్యకు చెక్‌

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు

అమరావతికి బయలుదేరిన కలెక్టర్‌ రంజిత్‌ బాషా, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కర్నూలు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సు రేపు, ఎల్లుండి నిర్వహించనుంది. రాబోయే ఏడాదికి 15 శాతం వృద్ధి సాధించాలనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో కీలకమైన ఐదు అంశాలు కర్నూలు ప్రగతి అజెండాగా కలెక్టరు పి.రంజిత్‌బాషా, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అమరావతికి బయలుదేరారు. స్మార్ట్‌ సిటీగా కర్నూలు, వలసలు నివారణ, సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు నేషనల్‌ హైవే రోడ్డు.. వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు.

2019 జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టిన వేవతి ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు లక్ష్యంగా వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణానికి 2019 జవనరిలో రూ.1,942.38 కోట్లు మంజూరు చేస్తూ జీవో.ఆర్‌టీ.నెం.77 జారీ చేశారు. టెండర్ల పూర్తి చేసి పనులు కూడా మొదలు పెట్టారు. సుమారుగా రూ.90 కోట్లు ఖర్చు చేశారు. అలాగే.. మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గా ల్లోనే అత్యధికంగా వలసలు ఉన్నాయి. శాశ్వత పరిష్కా రం కోసం గత టీడీపీ ప్రభుత్వం ఆర్డీఎస్‌ కుడి కాలువ నిర్మాణానికి 2019 జనవ రిలో జీవో ఆర్టీ నం.76 జారీ చేసి రూ.1,985.42 కోట్లు మంజూరు చేశారు. ఆర్డీఎస్‌ అనకట్ట దగ్గర హెడ్‌ స్లూయిస్‌ పనులు, కాలువ నిర్మాణం మొదలు పెట్టి 0.06 శాతం పనులు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పనులు అటకె క్కాయి. రాయలసీమ జిల్లాల జీవనాడి గుండ్రేవుల జలాశయం నిర్మాణానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

స్మార్ట్‌సిటీగా కర్నూలు

ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత సీఎం చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్‌లు కర్నూలు స్మార్ట్‌సిటీగా అభివృద్ధి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. నిధులు, ట్రాఫిక్‌ నియంత్రణకు ఫ్లైఓవర్‌ బిడ్జిల నిర్మాణం, తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది.

దాహం తీరాలంటే ‘వాటర్‌ గ్రిడ్‌’ శరణ్యం

జిల్లాలో ఇప్పటికీ 1,16,264 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేవు. గాజుల దిన్నె, పులికనుమ, హంద్రీనీవా పత్తికొండ, గోరుకల్లు జలాశయాల నుంచి శుద్ధి చేసిన సురక్షిత తాగునీరు పైపులైన్ల ద్వారా 1.7707 టీఎంసీలు సరఫరా చేసి అందించేందుకు రూ.3,343.80 కోట్లతో వాటర్‌గ్రిడ్‌ ప్రతిపాదన తయారు చేశారు. వాటర్‌గ్రిడ్‌ను సీఎం చంద్రబాబు దృష్టికి కలెక్టర్‌ తీసుకెళ్లనున్నారు.

పశ్చిమ ప్రాంతంలో కేజీబీవీ స్కూళ్లు పెంచాలి

జిల్లా పశ్చిమ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలసి స్కూళ్లలో చదువుకుంటున్న పిల్లలు కూడా వలస వెళ్లుతున్నారు. దీంతోవాళ్ల చదువు ఆగిపో తోంది. జిల్లాలో 26 కేజీవీబీ పాఠశాలు ఉన్నాయి. వాటి సంఖ్యను రెట్టింపు చేయాల్సి ఉంది.

కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు జాతీయ రహదారి

జిల్లాలో ఏకైక ప్రధాన రహదారి కర్నూలు-బళ్లారి వయా కోడుమూరు, ఆలూరు రోడ్డు, ఆలూరు, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం కర్నూలుకు చేరుకోవాలంటే ఏకైక రహదారి. ఏళ్లు గడుస్తున్నా విస్తరణకు నోచుకోవడం లేదు. నేడు కలెక్టర్ల సదస్సులో ఈ రహదారి అభివృద్ధిపై కలెక్టర్‌ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లనున్నారు.

జిల్లా సమగ్ర అభివృద్ధే ప్రధాన అజెండా

జిల్లా కలెక్టర్ల సదస్సులో ఏ ఏ అంశాలపై హాజరు కావాలో సీఎంవో నుంచి వచ్చిన ఫార్మెట్‌ ప్రకారం జిల్లా సమగ్ర అభివృద్ధిపై నివేదిక తయారు చేశాం. ఐదు ప్రధాన అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లబోతున్నాం. అవకాశం ఉంటే ఇతర అంశాలపై కూడా చర్చిస్తాను. - పి.రంజిత్‌బాషా, కలెక్టర్‌, కర్నూలు

Updated Date - Mar 25 , 2025 | 12:09 AM