Share News

కైలాసవాహనంపై శ్రీశైలేశుడు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:35 AM

ఇల కైలాసంగా వెలుగొందుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

కైలాసవాహనంపై శ్రీశైలేశుడు

మహాదుర్గగా దర్శనమిచ్చిన అమ్మవారు

నేడు ప్రభోత్సవం, నందివాహన సేవ

శ్రీగిరిపై కొనసాగుతున్న ఉగాది ఉత్సవాలు

శ్రీశైలం, మార్చి 28(ఆంధ్రజ్యోతి): ఇల కైలాసంగా వెలుగొందుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి కైలాస వాహనంపై విహరించారు. భ్రమరాంబికా దేవి మహాదుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవానికి ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధపుష్పాలతో ముస్తాబు చేసి కైలాస వాహనంపై అధిష్టింపజేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం రాజగోపురం నుంచి క్షేత్రవీధుల్లోకి తీసుకొచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం ఎదుట కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. గ్రామోత్సవంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈఓ ఎం.శ్రీనివాసరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేడు నందివాహనసేవ, మహా సరస్వతి అలంకారం

ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడో రోజు శనివారం సాయంత్రం ఆదిదే వులకు ప్రభోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు నందివాహన సేవ, మహాసరస్వతి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారు. రాత్రి 10 గంటలకు వీరాచార్య విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు వెల్లడించారు.

Updated Date - Mar 29 , 2025 | 12:35 AM