పాలకుల నిర్లక్ష్యంతోనే సీమ వెనుకబాటుతనం
ABN , Publish Date - Mar 24 , 2025 | 11:47 PM
దశాబ్దాలుగా పాలకులు అవలంబించిన నిర్లక్ష్యం వల్లనే రాయలసీమ వెనుకబాటు తనానికి గురైందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పార్టీలకతీతంగా సాగు, తాగునీరుకై ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సంఘం సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు.

పందికోన’కు రూ.250 కోట్లు కేటాయించాలి
రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి
పత్తికొండ టౌన్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా పాలకులు అవలంబించిన నిర్లక్ష్యం వల్లనే రాయలసీమ వెనుకబాటు తనానికి గురైందని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొని పార్టీలకతీతంగా సాగు, తాగునీరుకై ఉద్యమించాలని రాయలసీమ సాగునీటి సంఘం సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్ నుంచి పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పందికోన రిజర్వాయర్ ఆయకట్టు సాధన సమితి అధ్యక్షుడు శేషాద్రి రెడ్డి అధ్యక్షత జరిగిన ధర్నాలో ముఖ్య అతిథిగా హాజరైన బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పందికోన రిజర్వాయరు 14 ఏళ్లు కావస్తున్నా కళ్లెదుటే పక్క జిల్లాలకు ఏటా కాలువ ద్వారా పారుతున్నా ఆ నీరును రైతులు వాడుకునే అవకాశం లేకపోవడం విచారకరమన్నారు. పందికోన కుడి, ఎడుమ కాలువలను పూర్తి చేస్తే 62 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని, అలాగే అనేక గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం అవుతుందన్నారు. కేవలం కుడి కాలువకు మాత్రమే నీరు ఇవ్వడం ద్వారా కేవలం 10వేల హెక్టార్లు సాగులోకి వచ్చిందని, అదే ఎడమకాలువ పూర్తయితే 50వేల పైచిలుకు నీరు సాధించవచ్చన్నారు. రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు అరుణ్ మాట్లాడుతూ పందికోన రిజర్వాయరు కింద ఆయకట్టుకు కింద పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆస్పరి, గోనెగండ్ల మండలాల పంట పొలాలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.250 కోట్లు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన పత్రాన్ని రెవెన్యూ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ కార్యదర్శి రాజాసాహెబ్, నియోజకవర్గ అధ్యక్షుడు సురేంద్ర కుమార్, రైతు సంఘాల నాయకులు ఆదినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి, మహిళా రైతు నాయకురాలు మునెమ్మ, స్థానిక రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు