కన్నుల పండువగా ఆదిదంపతుల ప్రభోత్సవం
ABN , Publish Date - Mar 29 , 2025 | 11:51 PM
శ్రీగిరిలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.

నంది వాహనంపై విహరించిన స్వామి, అమ్మవార్లు
మహా సరస్వతిగా దర్శనమిచ్చిన అమ్మవారు
నేడు పంచాంగ శ్రవణం, రథోత్సవం
శ్రీశైలం, మార్చి 29(ఆంధ్రజ్యోతి): శ్రీగిరిలో ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం క్షేత్ర రథవీధుల్లో అశేష భక్తజనం మధ్య స్వామి, అమ్మవార్లకు ప్రభోత్సవం నిర్వహించారు. పుష్పప్రియుడైన మల్లన్నకు సుగంధ పుష్పాలు, పరిమళ ద్రవ్యాలతో అలంకరించిన ప్రభపై ఆదిదేవులను ఊరేగించారు. ఈ వేడుక అనంతరం రాత్రి భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు నందివాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వగా, మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం క్షేత్రపురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరావు, అర్చకులు, అధికారులు, సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
అలరించిన వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం
శనివారం రాత్రి శివదీక్షాశిబిరాల వద్ద వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి భక్తులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమాలు నిర్వహించారు. కర్ణాటకకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ శూలాలు మొదులుగా గల అస్ర్తాలను తమ చంపల్లోకి, నాలుకలలోకి, పెదవులలోకి, కడుపులోకి, చేతులకు గుచ్చుకుంటారు. ఈ విన్యాసాలు చేసేవారిని పురవంతులు అని పిలుస్తారు. తరువాత ఎంతో భక్తిప్రవత్తులతో నిప్పులపై నడుస్తారు. వీరు చేసే విన్యాసాలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేశాయి.
నేడు పంచాంగ శ్రవణం, రథోత్సవం
నేడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10గంటలకు పంచాంగ శ్రవణం, సాయంత్రం 5 గంటలకు రథోత్సవం, రాత్రి అమ్మవారు రమావాణి సేవిత రాజరాజేశ్వరిగా దర్శనమివ్వనున్నారు.