Share News

తామరాపల్లి వద్ద హైవేపై బీభత్సం

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:23 AM

జమ్ము జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి.

తామరాపల్లి వద్ద హైవేపై బీభత్సం
తామరాపల్లి వద్ద వరుసగా ఢీకొన్న లారీలు

నరసన్నపేట, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జమ్ము జంక్షన్‌ ఫ్లై ఓవర్‌ వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐదు లారీలు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఒక లారీ డ్రైవర్‌ మాత్రమే గాయాలు కాగా.. మిగిలిన డ్రైవర్లు స్వల్పగాయాలతో బయట పడ్డారు. శ్రీకాకుళం నుంచి టెక్కలి వైపు హైవేపై జమ్ము జంక్షన్‌ ప్లై ఓవర్‌ దాటే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నుజ్జు అయిన లారీని హైవే అధికారులు క్రేన్‌ సాయంతో తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో ఇతర వాహనాలను నిలుపుదల చేసేందుకు చిన్న సూచికలు ఏర్పాటు చేశారు. అదిగమనించకుండా ఒడిశాకు చెందిన ట్యాంకర్‌ ఉదయం ప్రమాదానికి గురైన లారీని ఢీకొంది. అదే సమయంలో ఒకేసారి వెనుక నుంచిమరో నాలుగు లారీలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈప్రమాదంలో రెండు కంటైనర్లు, ఒక ట్యాంకర్‌, అరటి గెలలు రవాణా చేస్తున్న లారీలు ఒకదానిపై ఒకటి చేరాయి. అయితే ఈ లారీల్లో క్లీనర్లు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్లు ఉన్న వైపు లారీలు స్వల్వంగా దెబ్బతినడంతో ఇద్దరికి సల్వ గాయాలయ్యాయి. ప్రమాదం జరిగే సమయంలో నేషనల్‌ హైవే అధికారులు అక్కడ ఉండి వాహనాలను అదుపు చేసేందుకు ప్రయత్నించినా నియంత్రణ చేయలేపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా ప్రాంతానికి సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ దుర్గాప్రసాద్‌ చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నారు. క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఈ వాహనాల నుంచి ఆయిల్‌ లీకై హైవే పైకి చేరింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు అదుపు తప్పే అవకాశం ఉంది. ఈఘటనను కవర్‌ చేసేందుకు వెళ్లిన ఒక విలేకరి కాలుజారడంతో కాలికి తీవ్ర గాయమైంది.
కొంప ముంచిన పొగమంచు
తామరాపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌కు గాయాల య్యాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. శనివారం ఉదయం దట్టంగా పొగమంచు కురవడంతో టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వాహనాలు నెమ్మదిగా వెళు తున్నాయి. అయితే వెనుక నుంచి ఒక లారీ వేగంగా వచ్చి మరో లారీని క్రాస్‌ చేసే సమయంలో బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపు తప్పి డివైడర్‌ పైనుంచి పక్క రోడ్డుపైకి వెళ్లిపోయింది. అయితే ఆ సమయం లో నరసన్నపేట నుంచి టెక్కలి వైపు ఎటువంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిం ది. ముందుగా వెళుతున్న లారీని బలంగా ఢీకొన డంతో లారీ డ్రైవర్‌కు కాళ్లకు, క్లీనర్‌కు గాయాలయ్యా యి. వెంటనే వారికి 108లో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటన ప్రాంతానికి పోలీసులు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 30 , 2025 | 12:23 AM