ఉమ్మడి జిల్లాకు ఉగాది పురస్కారాలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 12:20 AM
రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది పర్వదిన సందర్భంగా కవులు, కళాకారులకు అందిం చే ఉగాది కళారత్న (హంస), ఉగాది విశిష్ట పురస్కారాలను ఈసా రి జిల్లాకు చెందిన పత్తి ఓబులయ్య, సాహితీవేత్తలు డాక్టర్ ఎం. హరికిషన్, ఎస్‌డీవీ అజీజ్ అందుకున్నారు.

కళారత్న (హంస) పురస్కారం అందుకున్న పత్తి ఓబులయ్య
ఉగాది విశిష్ట పురస్కారం పొందిన డాక్టర్ ఎం. హరికిషన్, ఎస్‌డీవీ అజీజ్
కర్నూలు కల్చరల్, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉగాది పర్వదిన సందర్భంగా కవులు, కళాకారులకు అందిం చే ఉగాది కళారత్న (హంస), ఉగాది విశిష్ట పురస్కారాలను ఈసా రి జిల్లాకు చెందిన పత్తి ఓబులయ్య, సాహితీవేత్తలు డాక్టర్ ఎం. హరికిషన్, ఎస్‌డీవీ అజీజ్ అందుకున్నారు. ఆదివారం ఉదయం విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో, రాష్ట్ర దేవదాయ శాఖ, పర్యాటక శాఖ, భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరై ఈ పురస్కారాలు అందజేశారు. నాటక రంగంలో కర్నూలు కు చెందిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్యకు ప్రతిష్టాత్మక కళారత్న (హంస) పురస్కారం ముఖ్యమంత్రి అందజేశారు. ఆయనకు హంస ప్రతిమతోపాటు, రూ.50 పారితోషికాన్ని అందజేసి, శాలువతో సత్కరించారు. అలాగే సాహితీ రంగంలో విశేషంగా సేవలు అందిస్తున్న డాక్టర్ ఎం. హరికిషన్, ఎస్‌డీవీ అజీజ్‌లకు ఉగాది విశిష్ట పురస్కారాలు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదానం చేశారు. వారికి తెలుగు తల్లి ప్రతిమతోపాటు రూ.10 వేలు నగదు అందజేశారు.
ఎస్‌ఆర్‌ఎస్ ప్రసాద్‌కు హంస పురస్కారం
నంద్యాల కల్చరల్, మార్చి 30(ఆంధ్రజ్యోతి): నంద్యాలకు చెందిన కళాకారుడు ఎస్‌ఆర్‌ఎస్ ప్రసాద్‌కు విజయవాడులో ఆదివారం ఉగాది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కళారత్న హంస పురస్కారం అందించారు. గోల్డ్‌కలర్ హంస, 50వేల రూపాయలు చెక్కు, సర్టిఫికెట్‌ను ఆయనకు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాకారుడు ఎస్‌ఆర్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ కళాకారులకు పూర్వవైభవం వచ్చిందన్నారు. ఈ సందర్బంగా నంద్యాలలోని ప్రముఖులు, కళారాధన నిర్వాహకులు డాక్టర్ రవిక్రిష్ణ, డాక్టర్ మధుసూదనరావు, కళాకారులు, తోటి మిత్రులు ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు.