Share News

శ్రీగిరిపై ఉగాది ఉత్సవాలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 12:00 AM

ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

శ్రీగిరిపై ఉగాది ఉత్సవాలు

భృంగి వాహనంపై స్వామి, అమ్మవార్ల విహారం

మహాలక్ష్మిగా దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

భక్తులతో కిటకిటలాడిన శ్రీశైల క్షేత్రం

శ్రీశైలం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో గురువారం ఉగాది మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ ఉగాది మహోత్సవాలు 31న ముగియనున్నాయి. ఉదయం ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు మొదలయ్యాయి. ఆలయ అర్చకులు శివసంకల్పం, పుణ్యాహవచనం, చంఢీశ్వరపూజ నిర్వహించారు. సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం జరిపించారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉగాది ఉత్సవాలను ఆలయ ఈఓ శ్రీనివాసరావు పర్యవేక్షించారు.

భృంగివాహనంపై స్వామి, అమ్మవార్లు

ఉగాది ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు గురువారం స్వామిఅమ్మవార్లకు భృంగివాహన సేవ నిర్వహించారు. అర్ధనారీశ్వర రూపానికి మూలకారకుడైన భృంగి భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్ల సేవలో తరించారు. క్షేత్రవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. అశేష భక్తజనం ఈ అద్భుత ఘట్టాన్ని కనులారా వీక్షించి పరవశించారు. గ్రామోత్సవం ముంగిట శంఖం, జే గంట, ఢమరుకం, కొమ్ము వాయిద్యం, కోలాటం, చెక్కభజన, తప్పెట్లు, శంఖునాదాలు, కర్ణాటక డోలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

నేడు కైలాసవాహన సేవ, మహాదుర్గ అలంకరణ

ఉగాది మహోత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం స్వామివారికి విశేష అర్చనలు, మహాశక్తి స్వరూపిని భ్రమరాంబికదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వాహనసేవలో భాగంగా స్వామి, అమ్మవార్లకు కైలాసవాహనసేవ, అమ్మవారు మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.

Updated Date - Mar 28 , 2025 | 12:00 AM