Share News

పల్లెల దాహానికి మిగులు వాటా నీరు

ABN , Publish Date - Mar 31 , 2025 | 12:27 AM

పల్లెల దాహానికి మిగులు వాటా నీరు

 పల్లెల దాహానికి మిగులు వాటా నీరు
తుంగభద్ర డ్యామ్‌ నుంచి నదికి నీటి విడుదల

టీబీ డ్యాం నుంచి నదికి 5వేల క్యూసెక్కులు విడుదల

వేసవిలో ఎల్లెల్సీ ఆధునికీకరణ పనులకు శ్రీకారం

ఏప్రిల్‌ 15 తరువాత నీళ్లివ్వలేమని తేల్చి చెప్పిన తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు

నీటి విడుదలకు సీఈ కబీర్‌ బాషా ప్రత్యేక చొరవ

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఆధునికీకరణ పనుల్లో భాగంగా ఆర్‌సీసీ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. వైసీపీ హయాంలోనే టెండర్లు పూర్తి చేశారు. ఈ వేసవిలో లైనింగ్‌ పనులు చేసేందుకు ఇంజనీర్లు సన్నాహాలు చేస్తున్నారు. పనులు మొదలైతే ఎల్లెల్సీ కాలువకు నీటి విడుదల సాధ్యం కాదు. ఏప్రిల్‌ 15న నీటి విడుదలను ఆపేస్తున్నామని, అప్పటిలోగా ఎల్లెల్సీ వాటా జలాలు వాడుకోవాలని, ఆ తరువాత ఇచ్చేది లేదని తుంగభద్ర బోర్డు ఇంజనీర్లు తేల్చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులకు అధికారికంగా లేఖ కూడా రాశారు. ఏప్రిల్‌ 15 వరకు నీళ్లు వాడుకున్నా.. 2.07 టీఎంసీల మిగులు వాటా ఉంటుంది. దీంతో జలవనరుల శాఖ కర్నూలు ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ ఇంజనీరు (సీఈ) కబీర్‌బాషా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రభుత్వంతో చర్చించి జిల్లాలో తుంగభద్ర నదీతీర గ్రామాలకు తాగునీటి కోసం టీబీపీ డ్యాం నుంచి విడుదల చేసేందుకు ఒప్పించారు. ఆదివారం 5 వేల క్యూసెక్కులను డ్యాం నుంచి తుంగభద్ర నదికి విడుదల చేశారు.

కర్నూలు, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా పశ్చిమ ప్రాంతం కరువు పల్లెసీమల ప్రాణాధారం తుంగుభద్ర దిగువ కాలువ (టీబీపీ ఎల్లెల్సీ). ఆలూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో 1.51 లక్షల ఎకరాలకు సాగునీరు, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపల్‌ పట్టణాలతో పాటు 195 గ్రామాలకు తాగునీరు అందించే ఎల్లెల్సీ కాలువకు తుంగభద్ర డ్యాం నుంచి 24 టీఎంసీలు నీటివాటా ఉంది. 2024-25 నీటి సంవత్సరంలో డ్యాం చేరిన వరద నీటిని అంచనా వేసి కేడబ్ల్యూడీటీ-1 (బచావత్‌ అవార్డు) దమాషా మేరకు 22.30 టీఎంసీలు కేటాయించారు. ఎల్లెల్సీ సీసీ లైనింగ్‌ పనులు చేపట్టాల్సి ఉండడంతో ఏప్రిల్‌ 15 వరకు నీటిని విడుదల చేస్తామని, ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లో నీటిని ఇవ్వలేమని, ప్రత్యామ్నాయం చూసుకోవాలంటూ టీబీపీ బోర్డు అధికారులు లేఖ రాశారు. ఏప్రిల్‌ 15 వరకు ఎల్లెల్సీ వాటాలో 20 టీఎంసీలు వినియోగించుకొనే అవకాశం ఉంది. 2.07 టీఎంసీలు మిగులు వాటా ఉంటుంది. ఆ తరువాత వాడుకునే పరిస్థితి ఉండదని ఇంజనీర్లు అంచనా వేశారు. అదే సమయంలో తుంగభద్ర నది ఒట్టిపోవడంతో నదితీర గ్రామాల్లో అప్పుడే తాగునీటి సమస్యలు తలెత్తున్నాయని, నదికి నీటిని విడుదల చేయాలంటూ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్‌.రాఘవేంద్రరెడ్డి ఇరిగేషన్‌ ఇంజనీర్ల దృష్టికి తీసుకెళ్లారు. ఎల్లెల్సీ మిగులు వాటా నీటిని వినియోగించుకుంటే నదితీర గ్రామాలతో పాటు కర్నూలు నగరం తాగునీటికి ఇబ్బందులు ఉండవని ఉమ్మడి కర్నూలు జిల్లా ఇరిగేషన్‌ ప్రాజెక్ట్స్‌ సీఈ కబీర్‌బాషా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానా యుడు, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. వారితో చర్చించి ఎట్టకేలకు ఒప్పించారు.

డ్యాం నుంచి నదికి 5 వేల క్యూసెక్కులు

రోజుకు 5 వేలు క్యూసెక్కుల చొప్పున ఏప్రిల్‌ 2వ తేది వరకు తుంగభద్రకు విడుదల చేయాలని జిల్లా ఇరిగేషన్‌ ఇంజనీర్లు ఇండెంట్‌ ఇచ్చారు. ఆదివారం 5 వేల క్యూసెక్కులు నదికి విడుదల చేశారు. 2వ వరకు 1.728 టీఎంసీలు విడుదల చేసినా.. ఎల్లెల్సీ వాటాగా డ్యాంలో 0.341 టీఎంసీలు నిల్వ ఉంటుందని, అత్యవసరం పరిస్థితుల్లో ఎల్లెల్సీ ద్వారా తీసుకునే అకాశం ఉందని ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం సుంకేసుల డ్యాంలో 290.30 అడుగుల లెవల్‌లో 0.631 టీఎంసీలు నిల్వ ఉంది. డ్యాం నుంచి విడుదల చేసిన నీటిలో 0.600 టీఎంసీలు సుంకేసులకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంచనా మేరకు నీరు చేరితే సుంకేసుల బ్యారేజీలో గరిష్ట సామర్థ్యం 1.200 టీఎంసీలకు చేరుతుందని, కర్నూలు నగరానికి ఈ ఏడాది తాగునీటి సమస్యే ఉండదని ఇంజనీర్లు పేర్కొంటున్నారు.

Updated Date - Mar 31 , 2025 | 12:27 AM